- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గట్టు’ ఎత్తిపోతల.. తొమ్మిదేళ్లుగా డిజైన్లకే పరిమితం
దిశ, తెలంగాణ బ్యూరో : 2018, జూన్29, జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సీఎం సభ. “పాలమూరు ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలు పండించే అవకాశం ఉంది. గతంలో పాలకులు పట్టించుకోలేదు. వాళ్ల నిర్లక్ష్యంతోనే జూరాల చిన్న ప్రాజెక్టుగా అయింది. ఏపీ వాళ్లు నీళ్లు తీసుకు పోతుంటే హారతులు పట్టిండ్రు. మేం వచ్చినంక రాత్రింబవళ్లు ప్రాజెక్టుల దగ్గర నిద్రహారాలుమాని పనులు పూర్తి చేస్తున్నం. జూరాల నుంచి నేరుగా నీళ్లు తీసుకునేలా గట్టు ఎత్తిపోతలను చేపడుతున్నం. పాలమూరు పచ్చబడాలె. పాలమూరుకు పక్కన కర్నూల్ జిల్లా.. ఇటు పక్కన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి కూలీలు వలస రావాలి. ఎవరు ఎన్ని కేసులు వేసినా ప్రాజెక్టుల పనులు ఆగనీయం” గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్న మాటలవి.
ఈ పథకాన్ని రెండు ఏండ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ తట్టెడు మట్టి కూడా తీయలేదు. మరీ ఘోరమైన పరిస్థితులేమిటంటే… గట్టు ఎత్తిపోతల పథకం డిజైన్రూపొందించడంలోనే ఏండ్లు గడిచిపోతోంది. ఇప్పటి వరకు చేసిన డిజైన్కాదని.. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన డిజైన్‌కే మళ్లీ ప్లాన్వేస్తున్నారు.
ప్లాన్ మారింది ఇలా..
గట్టు ఎత్తిపోతల పథకానికి 2012 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఆనాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రేలంపాడు జలాశయం నుంచి నీళ్లను ఎత్తిపోతల ద్వారా మళ్లించి గట్టు మండలంలోని చెరువులను నింపేందుకు ప్రతిపాదించారు. అప్పటి మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో దీనికి శంకుస్థాపన చేశారు. కానీ స్వరాష్ట్రంలో ఈ డిజైన్ మారింది. కాంగ్రెస్‌నేతలు ప్రతిపాదించిన డిజైన్లను ఆమోదించవద్దనే కారణంతో ప్రాజెక్టుల రీ డిజైన్లు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గట్టు ఎత్తిపోతలను కూడా మార్చారు. జూరాల నుంచి నేరుగా దాదాపు 10 నుంచి 15 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా గట్టు ఎత్తిపోతల పథకానికి రీ డిజైన్‌చేశారు. దాదాపు 3,700 ఎకరాల భూ సేకరణతో 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. కానీ కారణాలేమైనా అనుమతులు మాత్రం ఇవ్వలేదు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలోనే తెరమీదకు వచ్చినా.. ఒక్క రూపాయి విదల్చలేదు.
సర్వేల కోసమే కోట్లు
కృష్ణా జలాలను వినియోగించుకుంటూ గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని పట్టాలెక్కించే పనులు మూలనపడ్డాయి. జూరాల నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని తీసుకుంటూ 30 రోజుల్లో కనీసం 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన ఈ ప్రాజెక్టు సమగ్ర సర్వే పనులు కూడా ముందుకు పడటం లేదు. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి డీపీఆర్ రూపొందించేందుకు సర్వే ఏజెన్సీలకు ఇప్పటికే రూ. 3.40 కోట్లు ఇచ్చారు. ముందుగా గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు.
కానీ ఈ డిజైన్‌ను మార్చి రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్ నుంచే నీటిని తీసుకోవాలని, రిజర్వాయర్ సామర్థ్యాన్ని సైతం పెంచాలని, ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. దీంతో రెండోసారి సర్వే చేసిన అధికారులు జూరాల నుంచి 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేశారు. నీటి నిల్వ కోసం 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు. 2 మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మళ్లీ పాత డిజైన్‌కే..!
ఇప్పటికీ కృష్ణా నీటిని వినియోగంచుకోవడంలో ఏపీ దూసుకుపోతోంది. లెక్కకు మించి వాడుకోవడమే కాకుండా కొత్తగా భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేస్తోంది. తెలంగాణ మాత్రం కృష్ణా జలాల వినియోగంలో మొదటి నుంచి వెనుకబడే ఉన్నది. జూరాల ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం దాదాపు 8 టీఎంసీలకు కుచించుకుపోయిందని ఇంజినీర్లే చెబుతున్నారు. అంతేకాకుండా జూరాల దగ్గర మరో ప్రాజెక్టును రూపొందించాలని రిటైర్డ్ ఇంజినీర్ల బృందం ప్రభుత్వానికి రెండేండ్ల కిందటే నివేదిక సైతం ఇచ్చింది. కారణాలేమైనప్పటికీ కృష్ణా ప్రాజెక్టుల అంశంలో తెలంగాణ ముందుకు కదలడం లేదనేది స్పష్టమవుతూనే ఉంది.
అయితే గట్టు ప్రాజెక్టు డిజైన్మార్చేందుకు ఆదేశాలిచ్చిన సీఎం కేసీఆర్… తాజాగా మళ్లీ మార్పులు చేసేందుకు ఆదేశాలిచ్చారు. జూరాల వెనుక జలాల ఆధారంగా నిర్మించిన జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని రేలంపాడు జలాశయం నుంచి గట్టు పథకానికి నీటిని తీసుకునేలా మళ్లీ ప్లాన్చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎత్తిపోసి గట్టు మండలంలోని కొండల నడుమ రాయపురం దగ్గర నిల్వ చేసి.. దాదాపు 33 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా రీ డిజైన్ చేస్తున్నారు.
అంచనాలు పెరుగుతున్నాయి
గట్టు ఎత్తిపోతల పథకం వ్యయం దాదాపు రూ.750 కోట్ల వరకు పెరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం రూ. 553 కోట్లతో మంజూరు చేసిన నలసోమనాద్రి (గట్టు) ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు మరో రూ. 197 కోట్లు పెరుగుతున్నాయి. జూరాల జలాశయానికి సమాంతరంగా మరో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలనే కొత్త ప్రతిపాదనతో అక్కడి నుంచే నీటిని తీసుకోవాలని గట్టు ఎత్తిపోతల ప్రణాళికలో మార్పులు చేయగా… కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు, భూ సేకరణ తదితర సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం పాత ప్రణాళిక ప్రకారమే గట్టు ఎత్తిపోతలను పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అయినప్పటికీ… అంచనాలు మళ్లీ పెరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలే..
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి కూడా 2008లోగద్వాలలో జరిగిన బహిరంగ సభలో గట్టు హైలెవెల్ కెనాల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ నిధులు మంజూరు కాలేదు. 2012 సెప్టెంబర్ 14న జరిగిన ఇందిరమ్మ కార్యక్రమంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రేలంపాడు నుంచి నీళ్లను ఎత్తిపోతల ద్వారా మళ్లించి గట్టు మండలంలోని చెరువులను నింపుతామని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన తర్వాత గట్టు ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు. ఆ తర్వాత స్వరాష్ట్రంలో 2014 ఎన్నికలకు ముందు మళ్లీ గట్టు ఎత్తిపోతల పథకం ప్రస్తావనను కేసీఆర్ తీసుకువచ్చారు.
కానీ సర్వే జరుగలేదు. ప్రాజెక్టు ప్లాన్ లేదు.. డీపీఆర్ రాలేదు.. టెండర్లు లేవు. 2016లో దాదాపు 28వేల ఎకరాల వరకు కొత్త ఆయకట్టుకు గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చే సమగ్ర సర్వే చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జీవో నెం.461ని 2016 మే 3వ తేదీన విడుదల చేసింది. రూ. 52.46 లక్షలను సర్వే కోసం మంజూరు చేసింది. ఎట్టకేలకు రీ సర్వే ద్వారా 25వేల ఎకరాలనుంచి 33వేల ఎకరాలకు నీరిచ్చేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా 2.8 టీఎంసీల నీటితో 41 చెరువులు నింపి 33వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. దీని కోసం 553.98 కోట్లను మంజూరు చేశారు. కానీ ఒక్క రూపాయి రాలేదు. ఇప్పుడు కూడా మళ్లీ రీ సర్వేకు రూ. 2కోట్లు ఇచ్చారు. కానీ ఎత్తిపోతల నిర్మాణానికి అడుగు కూడా ముందుకు పడటం లేదు.