- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓరుగల్లు నుంచి గంజాయి సప్లై..?
దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నట్లు వస్తున్న సమాచారం జిల్లావాసులను ఆందోళనకు గురి చేస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఠా సభ్యులు నర్సంపేట, పరకాల సబ్ డివిజన్‌కు చెందిన వ్యక్తులని తెలిసినప్పటికీ పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, గంజాయి సప్లై చేసి జిల్లా ప్రతిష్ట దెబ్బతీసే వారిపై ఖాకీలు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పల్లెల్లో గంజాయి సాగు..!
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట, పరకాల సబ్ డివిజన్ పరిధిలోని పలు పల్లెల్లో కొందరు వ్యక్తులు గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం. పత్తి, మొక్కజొన్న, మిర్చి, బంతి చేనుల్లో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరకాల సబ్ డివిజన్‌లోని రేగొండ, నర్సంపేట సబ్ డివిజన్‌లోని నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లోని పలు గ్రామాల్లో గంజాయి పండిస్తుండగా, వాటిని ముఠా సభ్యులు రాత్రివేళలో కోసి ప్రాసెస్ చేసి తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. కొంతకాలంగా ఈ దందా యథేచ్ఛగా నడుస్తున్నప్పటికీ ఎక్సైజ్, పోలీస్ అధికారులు స్పందించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పించుకుని.. పట్టుబడ్డాడు..
వారం రోజుల కిందట పరకాల పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి 3 కిలోల గంజాయి సీజ్ చేశారు. ఆ తర్వాత నిందితుడిని విచారించిన పోలీసులు నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన రాంబాబు అనే వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. దాంతో గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతలు రాంబాబును విడిపించుకు రావడానికి పరకాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన రాంబాబు పోలీసుల కళ్లు గప్పి ఠాణా నుంచి తప్పించుకుని పారిపోయాడు. దాంతో పోలీసులు రాంబాబు కుటుంబీకులు, బంధువులను తమదైన శైలిలో విచారించారు. పోలీసుల వేధింపులు భరించలేని బంధువులు రెండ్రోజుల కిందట రాంబాబును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రాంబాబు నోరు విప్పితే గంజాయి రవాణా చేస్తున్న నిందితులెవరనే విషయం బయటకొచ్చే అవకాశముంది. పోలీసులు ఆ ముఠా సభ్యులను కనిపెట్టే పనిలో విచారణ వేగవంతం చేసినట్లు సమాచారం.