గల్లీ లీడర్లు చక్రం తిప్పేనా?

by Shyam |
గల్లీ లీడర్లు చక్రం తిప్పేనా?
X

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేటర్​ స్థానాల మీద వందలాది మంది కన్నేశారు. ఆశల పల్లకిలో ఊరేగుతున్న వారంతా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ప్రధాన పార్టీలు టికెట్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా బరిలో దిగేందుకే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తును వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. అభ్యర్థిత్వాలు ఖరారు చేసే సరికి ఒకట్రెండు రోజులు పట్టేటట్లు కనిపిస్తోంది. ఈ లోపే మందీమార్బలం, ఆర్థిక బలాన్ని సమీకరించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎక్కువ మంది టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం తరపున పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రచార పర్వానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార సామగ్రిని కొనుగోలు చేసే బాధ్యతలను అనుయాయులకు అప్పగించారు. సభలు, సమావేశాలు, పాదయాత్రల షెడ్యూల్‌ను రూపొందించుకునే పనిలో పడ్డారు. కరపత్రాలను ముద్రించేందుకు ఏజెన్సీలకు అప్పగించారు. గతంలో బల్దియా ఎన్నికలంటే కనీసం నెల రోజులైనా కార్యకర్తలకు చేతి నిండా పని దొరికేది. ఇప్పుడేమో అతి తక్కువ కాలంలోనే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలియడంతో కాస్త నిరాశకు గురయ్యారు. అభ్యర్థులకు కూడా ఏం చేయాలో అంతుచిక్కడం లేదు. ఎంత మంది అసంతృప్తులు తెర మీదికి వస్తారో కూడా తెలియదు. వారందరినీ బుజ్జగించే సరికి రోజులు గడిచిపోయే ప్రమాదముంది. పైగా అధిష్ఠానాలు ఇప్పటికింకా అభ్యర్థుల జాబితాలనే ప్రకటించలేదు.

దాంతో ఔత్సాహికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టీఆర్ఎస్​‌కు దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ గతంలో కంటే ఎక్కువగా అసంతృప్తులు ఉండే అవకాశం ఉంది. 2016 ఎన్నికలప్పుడే టికెట్లు వస్తాయనుకున్న వారంతా ఆశల్లో ఉన్నారు. అయితే ఈసారి సిట్టింగులకే ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వం వారం దాకా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్టు ఆశించిన వారికి ఏదైనా నామినేటెడ్​ పోస్టు బూచి చూపించొచ్చు. ఈ ఎన్నికల్లో ఔత్సాహికులకు తగ్గ పదవులేవీ ప్రభుత్వంలో లేవు. ఈ క్రమంలో నియోజకవర్గానికో మంత్రి లేదా ఎమ్మెల్యే వంటి వారికి బాధ్యతలను అప్పగించి అసంతృప్తి లేకుండా చూడాలని వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎమ్మెల్యేలే సూత్రధారులు..

పక్కాగా తనకు టికెట్ లభిస్తుందనుకున్నవారు మాత్రం రెండు నెలల నుంచి బస్తీలు, కాలనీల్లో తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ కార్పొరేటర్లకు టికెట్ ఈ దఫా రాదన్న ప్రచారంలో ఉన్న ఆ 25 డివిజన్లలో ప్రత్యామ్నాయ నాయకులు ప్రచారాన్ని మొదలు పెట్టారు. చాప కింద నీరులా కాలనీ పెద్దలను, బస్తీ నాయకులను తనకు మద్దతివ్వాలంటూ వేడుకుంటూనే ఉన్నారు. ఎటొచ్చి అభ్యర్థిత్వాలను ఖరారు చేయనివారు, తనకు ఈసారి టికెట్ ఇస్తారో లేదోనన్న ఆందోళనలో ఉన్న కార్పొరేటర్లు మాత్రం టెన్షన్‌కు గురవుతున్నారు. ఎవరితో చెప్పించుకుంటే పని అవుతుందోనంటూ పెద్ద నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరేమో ఎమ్మెల్యేలను, మరికొందరేమో మంత్రులను నమ్ముకున్నారు. ఇంకోసారి అవకాశం ఇప్పించాలంటూ నగర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ మంత్రుల ఇండ్ల దగ్గర కనిపిస్తున్నారు.

ఎమ్మెల్యేలను విభేదించిన కార్పొరేటర్లకు గడ్డుకాలమే అన్నట్లుగా పార్టీ అధిష్ఠానం వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పూర్తి బాధ్యతను ఎమ్మెల్యేలపైనే వేయడంతో ఇన్నాళ్లుగా తిట్టిపోసినవారినే బతిమిలాడుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. చాలా కాలంగా ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కూకట్​‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, అంబర్‌పేట, ముషీరాబాద్​, ఖైరతాబాద్​, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు మధ్య చాలా కాలం గ్యాప్ ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో వారే కీలక భూమిక పోషిస్తారని తేలడంతో అన్నీ పక్కకు పెట్టి వారి చుట్టూ తిరుగుతున్నారు. అధికార పార్టీ నుంచి అభ్యర్థిత్వాలు ఖరారు చేయకముందే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగూ సిట్టింగు కార్పొరేటర్లకే టికెట్లు ఖరారు చేస్తారన్న ప్రచారం ఉంది. 25 మంది కార్పొరేటర్లపై నెలకొన్న వివాదాలు, అక్రమాల్లో భాగస్వాములుగా పేర్లు ఉన్నాయన్న నెపంతో పక్కన పెట్టేటట్లు ఉంది. డివిజన్లలో కుమ్ములాటలే టీఆర్ఎస్​కు ప్రమాదాన్ని తీసుకొస్తాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

జోష్​ మీద బీజేపీ..

దుబ్బాక ఎన్నికల ఫలితాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగాల జోరుతో బీజేపీ కార్యకర్తలు ఫుల్​ జోష్​ మీద ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ రాజకీయ అలజడిని సృష్టిస్తున్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారంలో వాడి వేడి ప్రసంగాలు వైవిధ్యతను చూపించాయి. పైగా గ్రేటర్​ ఎన్నికల్లోనూ బీజేపీ అభిమతాన్ని బండ సంజయ్ కుండబద్దలు కొట్టారు. ఏ స్టయిల్‌‌లో ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారో అనేది స్పష్టమైంది. జాతీయ వాదం బలంగా వినిపిస్తూనే ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్​ మైత్రి బంధం బీజేపీకి బాగా కలిసి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. వారి బంధాన్ని ఎంతగా ప్రచారంలో పెడితే అదే స్థాయిలో ఓట్లు కురుస్తాయన్న భావనతో కనిపిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్​ ఎన్నికలకు మేనిఫెస్టోను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటీ రెండు రోజుల్లోనే పూర్తి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌కు గడ్డుకాలం..

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి గడ్డు కాలమే వచ్చినట్లుంది. ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడం ఒక ఎత్తయితే, ఎప్పుడు ప్రకటించాలన్న అంశంపై స్పష్టత లేకపోవడం మరో ఎత్తుగా కనిపిస్తున్నది. ఇప్పటికింకా దరఖాస్తుల స్వీకరణతోనే సరిపెట్టారు. పైగా గ్రేటర్​ హైదరాబాద్​‌లో పెద్ద నాయకులెవరూ నిత్యం ప్రజల్లో ఉన్న దాఖలాలేవీ లేవు. ప్రస్తుతానికి పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి మినహా మరెవరూ జీహెచ్​ఎంసీ ఎన్నికలను భుజాన వేసుకొని తిరిగేటట్లు కనిపించడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు. పైగా గతంలో పదవులు అనుభవించిన వారే ఇతర పార్టీలకు జంప్​ అవుతున్నారు. వారిని ఎలా కాపాడుకోవాలో తెలియక పార్టీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. దాసోజు శ్రవణ్​ కుమార్​ వంటి వారు మాత్రమే ప్రభుత్వాన్ని గణాంకాలతో సహా నిలదీస్తున్నారు. అవసరాన్ని బట్టి న్యాయ స్థానాలను ఆశ్రయిస్తూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Next Story