'బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది'

by Sumithra |   ( Updated:2023-03-12 16:44:41.0  )
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది
X

దిశ, చెన్నూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మండలంలోని గంగారాం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూరు, కోటపల్లి, జైపూర్ మండలాల్లో ముంపునకు గురైన భూములకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల ప్రాజెక్టుగా మారిందని ఆరోపించారు. ఎక్కడా లేనంత ఇసుక మాఫియా చెన్నూర్ నియోజకవర్గంలో చెలరేగి పోతోందన్నారు. ఇసుక మాఫియా మొత్తం ఎమ్మెల్యే సుమన్ కనుసన్నల్లోనే నడుస్తోందని మండిపడ్డారు.

సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపై ఎమ్మెల్యే దాడులు చేయిస్తూ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నాడని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సీఎం కేసీఆర్ లిక్కర్ కేసులో దొరికిన తన బిడ్డను ఏ విధంగా కాపాడాలని తాపత్రయం పడటం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిని బయటకు తీసి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ రావు, పార్లమెంట్ ప్రబారి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కల మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, నాయకులు మునిమంద రమేష్, పార్లమెంట్ కో కన్వీనర్ నగునూరు వెంకటేశ్వర గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేష్, మండల అధ్యక్షుడు ఆలం బాపూ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed