ప్రభుత్వాస్పత్రుల్లో సగం ఖాళీలు..

by Shyam |
ప్రభుత్వాస్పత్రుల్లో సగం ఖాళీలు..
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ :

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సగానికి పైగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కరోనా సమయంలోనూ డాక్టర్లు, సిబ్బంది తగినంత లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు సేవలందిస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు.

ఉమ్మడి జిల్లాలో వైద్యుల పోస్టులు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. జిల్లాల్లోని దాదాపు అన్ని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో ఈ సమస్య వేధిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వాస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్య సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది. ఫలితంగా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమౌతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనూ ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 16 వేలు దాటిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది సైతం వైరస్ బారిన పడ్డారు. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల అదనపు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సిబ్బంది లేక యంత్రాలు మూలకు..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులు ఉన్నాయి. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నా వాటిని నిర్వహించేందుకు టెక్నికల్ సిబ్బంది లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఫలితంగా పరీక్షలు అవసరమైన రోగులు ప్రైవేటు పరీక్షా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ సిబ్బందిని నియమిస్తే రోగులకు బయట పరీక్షలు చేయించుకునే ఇబ్బంది తప్పుతుంది.

వైద్య కళాశాలలోనూ..

మహబూబ్‌నగర్ జిల్లాలో వైద్య కళాశాల ప్రారంభమై రెండేండ్లు గడుస్తున్నా.. కావాల్సిన మేర సిబ్బందిని ప్రభుత్వం నియమించలేదు. పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

3 నెలలుగా అందని వేతనాలు..

వైద్య సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి వారికి పూర్తి వేతనాలు, బోనస్ అందిస్తామని విలేకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల మందికి పైగా వైద్య సిబ్బంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్దతితో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి బోనస్ విషయం పక్కన పెడితే కనీసం నెలవారీగా వేతనాలు సైతం అందడం లేదు. 3 నెలలుగా వీరికి జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అసలే తమవి అరకొర జీతాలని వాటిని సైతం సమయానికి ఇవ్వకుంటే తాము ఎలా బ్రతకాలని వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed