మద్యం దుకాణాల వద్ద ఉద్రిక్తత..ఆందోళన

by srinivas |   ( Updated:2020-05-04 05:47:13.0  )
మద్యం దుకాణాల వద్ద ఉద్రిక్తత..ఆందోళన
X

45 రోజుల మద్యం దాహార్తిని తీర్చుకునేందుకు మందుబాబులు వైన్ షాప్స్ వద్దకు పోటెత్తారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో మద్యం కొనుగోలు చేసేందుకు పోటెత్తడంతో షాపుల వద్ద కోలాహలం మొదలైంది. లాక్‌డౌన్ సమయంలో మద్యం కొనుగోలు వెసులుబాటు కావాలంటూ పలువురు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వాలు కనికరించకపోవడంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మందుబాబులు షాపులు ఓపెన్ చెయ్యడంతో గేట్లు తెరిచిన ప్రవాహంలా మందు షాపులకు పోటెత్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ అన్న తేడా లేకుండా అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొన్ని షాపుల్లో క్షణాల్లో స్టాక్ అయిపోయిందంటే కొనుగోళ్లు ఏ స్థాయిలో జరిగాయో ఊహించవచ్చు. ఒక్కసారిగా వస్తున్న మందుబాబులను అదుపుచెయ్యలేక మద్యం దుకాణాల యజమానులు, పోలీసులు చోద్యం చూశారు. పోలీసులు తొక్కిసలాట జరుగకుండా చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

లాక్‌డౌన్ నిబంధనలను మందుబాబులు తుంగలో తొక్కారు. మాస్కులను విస్మరించారు. సామాజిక దూరం, క్యూలైన్లను పట్టించుకోలేదు. మద్యం కొనుగోలు చేస్తే సరిపోతుందన్న స్పృహతో కరోనాను పూర్తిగా విస్మరించారు. కొన్ని చోట్ల తొక్కిసలాటలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయంటే మద్యం కోసం ఏస్థాయిలో అర్రులు చాచారో ఊహించవచ్చు.

గుంటూరు జిల్లాలోని మాచవరం, పిల్లుట్లలోని మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఇతర గ్రామాల వారు తమ గ్రామంలోని మద్యం దుకాణాల వద్దకు రావడంపై పిల్లుట్ల గ్రామస్తులు ధర్నాకు దిగారు. రెడ్ జోన్ల లో ఉన్న వారు గ్రీన్ జోన్లలోకి మద్యం కొనుగోలు నిమిత్తం రావడాన్ని వారు నిరసిస్తూ ఈ ధర్నాకు దిగారు.

చిత్తూరు జిల్లా సత్యవేడులో మందు బాబులు క్యూలైన్లను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో మహిళలంతా ఆందోళన చేపట్టి మద్యం దుకాణాన్ని మూయించారు. అలాగే వివిధ చోట్ల ఘర్షణలు చోటుచేసుకుంటుండడంతో పోలీసులు రంగంలోకి దిగి దుకాణాలు మూయించారు.

పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ప్రస్తుతం మద్యం అమ్మకాలపై నిషేధం ఉండటంతో అక్కడి మందుబాబులు సరిహద్దుల్లోని ప్రాంతాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవీపాలెం, రామాపురంలోని మద్యం దుకాణాల వద్దకు తమిళనాడు వాసులు వస్తుండటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో జీవీపాలెం, రామాపురంలోని 7 మద్యం దుకాణాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. మద్యం షాపులను మూసివేయించి తమిళనాడు వాసులను వెనక్కి పంపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పాలసముద్రంలోనూ మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు నుంచి మందుబాబులు పాలసముద్రంలోని మద్యం దుకాణాల వద్దకు రావడంతో అమ్మకాలు నిలిచిపోయినట్టు సమాచారం. అంతే కాకుండా గ్రీన్ జోన్లలోని మద్యం దుకాణాలకు రెడ్ జోన్లలోని మందుబాబులు వస్తున్నారు. దీంతో కరోనా భయాందోళనలు మిన్నంటుతున్నాయి.

tags: liquor shops open, andhra pradesh, tamil nadu, chittoor, guntur, nellore

Advertisement

Next Story