బ్రదర్ ప్లీజ్ కరోనా సోకుతది.. క్యూలో రావాలని చెబితే వినరే : వైన్స్ యాజమాని ఆవేదన

by Shyam |   ( Updated:2023-05-19 13:35:01.0  )
బ్రదర్ ప్లీజ్ కరోనా సోకుతది.. క్యూలో రావాలని చెబితే వినరే : వైన్స్ యాజమాని ఆవేదన
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో లాక్‌డౌన్ పెడుతున్నట్లు ప్రకటించగానే మందుబాబుల గుండెలు ఒక్కసారిగా ఆగినంత పనైయ్యింది. దీంతో ఉరుకులు పరుగుల మీద దగ్గరలోని వైన్స్ షాపు వెళ్లి వారి ఆవేదన తీర్చుకోవాలనుకున్నారు. లాక్ డౌన్ పెట్టారు.. తెల్లవారితే మందు దొరకదు. అప్పుడు మేము ఎలా బతకాలి అనుకున్నారేమో, క్షణం ఆలోచించకుండా మద్యం షాపులకు లగెత్తారు. కరోనా వైరస్ అనేది ఒకటి ఉంది. కంటికి కనిపించకుండా వచ్చి ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. దాని నుంచి కాపాడేందుకే ప్రభుత్వం ఈ నిర్భంధం విధించారని పాపం మందుబాబులు మర్చిపోయారు.

సరే.. ఎవరి బాధ వారిది. మద్యం తెచ్చుకోవడానికి వెళ్లారు. కొవిడ్ రూల్స్ అనేవి ప్రస్తుతం దేశవాప్తంగా అమలులో ఉన్నాయి. వాటిని పాటిద్దామని ఒక్కరికీ కూడా గుర్తులేదు. ఎదో మాస్క్ పెట్టుకున్నామా.. కరోనా రాదులే అన్న ధీమా వారిది. మాస్కు ఉన్నా భౌతిక దూరం పాటించకపోతే నువ్వు మాస్కు పెట్టుకుని ఎందుకు. వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా వైరస్ నీ శరీరంపై వాలితే తర్వాత నీ పరిస్థితి ఎంటీ..? నీతో పాటే ఇంట్లో ఉంటున్న వారి పరిస్థితి ఎంటీ..? అయితే, ఇవన్నీ ఆలోచించిన ఓ మద్యం షాపు యాజమాని మందు ప్రియులకు హ్యాండ్ మైక్ సాయంతో ఎంత హితబోధ చేసినా వారిలో చలనం లేదంటే మనోళ్లకు కరోనా కంటే మద్యం మీద ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

లాక్‌డౌన్ పెట్టినా ఉదయం 6 నుంచి 10గంటల వరకు వైన్స్ తెరిచే ఉంటుంది. బ్రదర్ ప్లీజ్ తొందర పడొద్దు. నెమ్మదిగా వచ్చి తీసుకొండి. గుంపులుగా గుంపులుగా ఉండొద్దు. కరోనా వస్తది.. లాక్ డౌన్ సమయంలోనూ రోజూ వైన్స్ ఉంటది. జనాలు సచ్చిపోతున్నారు. వెనక్కి వెళ్లండి, అందరికీ ఇస్తం.. దయచేసి లైనులో రావాలని మద్యం షాపు యాజమాని మందుబాబులకు ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వారు వినట్లేదు. ఓవైపు కరోనా సోకి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతుంటే.. మందుబాబులు మాత్రం తమ ప్రాణాల మీద వారికి ఏ మాత్రం భయం లేకున్నా.. పక్క వారి ప్రాణాలంటే కూడా లెక్కలేదని మరోసారి నిరూపించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాండమిక్ సమయంలోనూ ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారని విసుక్కుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed