ఫుల్ జోష్‌లో కాంగ్రెస్.. పీసీసీ నిర్ణయాలతో దూసుకుపోతున్న హస్తం

by Shyam |   ( Updated:2021-09-18 00:50:04.0  )
Congress-party
X

దిశ, పరకాల : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్ట నిర్మాణానికి పూనుకుంది. అందులో భాగంగా గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు నిర్మాణాన్ని పటిష్ట పరచుకొని భవిష్యత్తు కార్యాచరణ వైపు అడుగులు వేస్తోంది. పీసీసీ సారథిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అదే జోష్ పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో సైతం కనబడుతోంది.

పీసీసీ నిర్ణయం మేరకు ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో క్షేత్ర స్థాయి కమిటీలు వేయడం జరుగుతున్నది. అంతేకాకుండా దళిత, గిరిజన దండోరాలు అన్ని మండలాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒకటి, రెండు మండలాల మినహా దళిత, గిరిజన దండోరాకు అనూహ్య స్పందన రావడం గమనార్హం. ఆ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జీ ఇనుగాల వెంకట్రాంరెడ్డి నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకత్వాన్ని పటిష్ట పరచడమే కాకుండా ప్రభుత్వం విధానాలు ఎండగట్టడంలో ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందిస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు.

అందుకు ఉదాహరణగా సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, దామెర మండలాల్లో ఈ మధ్య కాలంలో జరిగిన దళిత, గిరిజన దండోరాకు లభించిన స్పందన చూస్తే అర్థమవుతున్నది. అక్కడక్కడా కావాలని కొంతమంది దురుద్దేశ పూర్వకంగా నాయకుల్లో ఐక్యత లోపించిందని చేసే తప్పుడు ప్రచారాలకు సైతం ఇనుగాల తనదైన రీతిలో బదులు పలుకుతున్నారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతున్నది అనేది పలువురి అభిప్రాయం. ఇదే జోష్‌తో గనుక ముందుకు వెళ్ళినట్లైతే నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా మారడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed