మా అధ్యక్షుడిగా ఎన్నికైనంక నేను చేసిన మంచి పని ఇదే: మంచు విష్ణు

by Sridhar Babu |
Health-Camp-1
X

దిశ, మియాపూర్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు మెడికోవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఆదివారం మెడికోవర్ అధ్వర్యంలో మా సభ్యుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఉచితంగా పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు విష్ణు మాట్లడుతూ.. ‘కరోనా అన్ని రంగాల వ్యక్తులపైనా తీవ్ర ప్రభావం చూపింది. సినీ కళాకారులపై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. మహమ్మారి తీవ్రతకు ఎంతోమంది కళాకారులు ఆర్థికంగా మాత్రమే కాదు ఆరోగ్య పరంగానూ తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడిగా ఎన్నికవగానే వృత్తి జీవితంలో ఉండే సభ్యుల అరోగ్య పరీరక్షణకు ఏదైనా చేయాలని సంకల్పించానన్నారు. అందుకు పలు ఆసుపత్రులను సంప్రదించాను. మెడికోవర్ హాస్పిటల్ ఎండీ అనిల్ కృష్ణ మాత్రం అడగగానే సుముఖత వ్యక్తం చేశారు. అందుకు ఆయనకు మా తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. వీరితోపాటు ప్రతి ఫిల్మ్, క్రిటిక్ జర్నలిస్టులకు సైతం హెల్త్ చెకప్ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని అన్నారు.

ఆసుపత్రి ఎండీ మాట్లాడుతూ.. తాము ప్రజలకు సేవ చేస్తుండవచ్చు కానీ, మానసికంగా ప్రజలు ఉల్లాసంగా ఉండటానికి, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడేది కళాకారులేనన్నారు. మన దగ్గర అధికశాతం మందికి వినోదమాధ్యమంగా సినిమానే నిలుస్తుందన్నారు. ఆ కళాకారులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటే మనం కూడా ఉత్సాహంగా ఉండొచ్చని, అది దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. తమ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్లకు ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కళాకారుల్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితిలలో తమ ఆసుపత్రులలో చేరితే తప్పకుండా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్యాంపులో సుమారు 300 మంది మా సభ్యులు 5వేల రూపాయల విలువైన పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మా మాజీ ప్రెసిడెంట్ సీనియర్ నరేష్, మెంబర్ శివ బాలాజీ, ఇతర సభ్యులు, మెడికోవర్ హాస్పిటల్స్ క్లస్టర్ హెడ్ దుర్గేష్ , సెంటర్ హెడ్స్ – మాత ప్రసాద్, అనిల్, స్వప్నిల్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story