- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ‘ఫ్రీ కరెంట్’ పరేషాన్.!
దిశ, తెలంగాణ బ్యూరో : వృత్తిదారులకు అండగా ఉండేందుకు దోబీఘాట్లు, లాండ్రీల నిర్వాహకులతో పాటు కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం ఈ ఏడాది ఏప్రిల్ 4న ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఈ పథకం కింద రెండు లక్షల రజక, 70వేల నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం గుర్తించింది. అయితే లబ్ధిదారులను గుర్తించేందుకు రూపొందించిన నిబంధనలు అర్హులైన వారు మేలు పొందకుండా అడ్డంకిగా మారాయి. సెలూన్లు, లాండ్రీల నిర్వాహకులను గుర్తించేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని సంబంధిత వృత్తిదారులు, కులసంఘాల నాయకులు గుర్తించారు.
ఇవీ నిబంధనలు..
250 ఉచిత యూనిట్ల పథకం పొందే లబ్ధిదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు రెంట్ తీసుకున్న షాపు యజమానితో ఉన్న ఒప్పందపత్రం, ట్రేడ్ లైసెన్స్ ను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నాయీ బ్రాహ్మణులు కేవలం వెయ్యి మందిలోపు మాత్రమే దరఖాస్తులు చేసుకోగా ప్రభుత్వం గుర్తించిన రజకుల్లో లబ్ధిదారులు ఒక్కశాతం కూడా దరఖాస్తులు సమర్పించలేదు. అద్దెకు తీసుకున్న షటర్లకు సంబంధించి ఏళ్లు గడుస్తున్నా అగ్రిమెంట్ పత్రాలు మెజారిటీ సెలూన్ల నిర్వాహకుల వద్ద లేవు. రెంటల్ అగ్రిమెంట్ పత్రాలు ప్రభుత్వానికి చేరితే తమపై ఇన్ కాం ట్యాక్స్, ఇతర సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుందనే భయంతో యజమానులు అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. దీంతో కటింగ్ సెలూన్లు, లాండ్రీ షాప్ నిర్వాహకులు దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారు.
నిబంధనల్లో మార్పుల కోసం విజ్ఞప్తులు..
ఆన్ లైన్ దరఖాస్తులు చేసేటప్పుడు రెంటల్ అగ్రిమెంట్, ట్రేడ్ లైసెన్స్ అప్ లోడ్ చేయాలని కోరడంపై ఆయా కులసంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి. బీసీ సంక్షేమశాఖ మంత్రిని కలిసి వినతిపత్రాలూ అందజేశాయి. తక్కువ ఆదాయంతో కులవృత్తులు చేసి బతికేవాళ్లంతా ట్రేడ్ లైసెన్స్ ల కోసం ఖర్చు చేసే పరిస్థితి లేదని, కుటుంబాన్ని పోషించేందుకే కష్టపడుతున్న తరుణంలో ఇది మరింత భారం కానుందని మంత్రి దృష్టికి తెచ్చారు. షాపుల యజమానులతో ఎంతో కొంత మాట్లాడుకుని సెలూన్లు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో అగ్రిమెంట్లు చేయాలంటే ఆ మేరకు అద్దె, పన్నులు కలిపి తమ మీదనే వసూలు చేస్తారని సంఘాల నాయకులు ఆవేదన చెందారు. వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ రెండు నిబంధనలను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్రిమెంట్, ట్రేడ్ లైసెన్స్ లేకుండా షాపుల ఫొటోలు, సెల్ప్డిక్లరేషన్ ఉంటే సరిపోతుందని, ఆ మేరకు సర్వర్ లో మార్పులు చేస్తామని మంత్రి హామీనిచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు.
ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్..
ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వస్తున్నప్పటికీ దరఖాస్తు గడువు సమయం తక్కువగా ఉండటం లబ్ధిదారులను ఆందోళన కలిగిస్తోంది. సర్వర్ లో మార్పులు చేసేందుకు మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో దరఖాస్తు గడువు పొడిగించాలని సంఘాల నాయకులు, వృత్తిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొత్తంగా సుమారు మూడులక్షల మంది దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా.. నిబంధనలు సడలించిన తర్వాత సర్వర్ పై భారం పెరిగి ఇంకా ఇబ్బందిగా మారనుందని, ఆర్థికంగా అధిక ఊరట కలగనున్న పథకం కావడంతో అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.