ఐపీఎల్‌లో జెర్సీ బిజినెస్

by Anukaran |
ఐపీఎల్‌లో జెర్సీ బిజినెస్
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో ఆటగాళ్లు ధరించే అవుట్‌ఫిట్‌ను జెర్సీ అంటారు. ఏ క్షణాన దానికా పేరు వచ్చిందో కానీ.. ఫ్రాంచైజీల పాలిట వరంలా మారింది. జెర్సీ ఆవుల నుంచి పాలను పిండినట్లు.. ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జెర్సీలపై, ప్యాంట్లపై, హెల్మెట్లపై యాడ్స్ వేసుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయి. సాంప్రదాయ టెస్టు క్రికెట్ మాత్రమే ఉన్న రోజుల్లో క్రికెటర్ల తెల్లని జెర్సీలపై కనీసం వాళ్ల పేర్లు కూడా ఉండేవి కావు. ఎప్పుడైతే క్రికెట్ ఆట పూర్తి స్థాయి వ్యాపారంగా మారిపోయిందో జెర్సీల రూపు రేఖలే మారిపోయాయి. క్రికెట్ బోర్డులకు ఆదాయం కూడా తెచ్చిపెట్టే ఈ జెర్సీలు.. ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలకు పెట్టుబడులను తిరిగి రాబట్టుకునే వస్తువుగా మారిపోయింది. ఐపీఎల్‌లో ఆటగాళ్ల కోసం రూ. వందల కోట్లు నీళ్లప్రాయంలా ఖర్చు చేస్తున్న ఫ్రాంచైజీలు వారిని అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నాయి. సాధ్యమైనంత మంది స్పాన్సర్లను సంపాదించి వారి సంస్థల లోగోలను ఆటగాళ్లపై ప్రదర్శిస్తూ పెద్ద వ్యాపారమే చేస్తున్నాయి.

ఇరువురికీ లాభమే..

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ ఎలెవెన్ సంస్థ ఈ ఏడాది రూ.220 కోట్లు బీసీసీఐకి ఇవ్వనుంది. అధికార భాగస్వాములు, ఇతర స్పాన్సర్లు బీసీసీఐకి ఉన్నారు. అదే సమయంలో ఫ్రాంచైజీలు కూడా స్పాన్సర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోయినా.. ఒక అధ్యయనం ద్వారా ఒక్కో టీమ్ రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయని తేలింది. దీనిలో ప్రధాన స్పాన్సర్ల వాటానే రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొన్ని బ్రాండ్స్ అయితే ఆరు టీమ్స్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. బోట్ ఎలక్ట్రానిక్స్, కోల్గేట్, బీకేటీ, జియో, కింగ్ ఫిషర్, డ్రీమ్ ఎలెవెన్ సంస్థలు ఐదు కంటే ఎక్కువ జట్లతోనే ఒప్పందాలు ఉన్నాయి.

ఒకే జట్టుతో కాకుండా పలు జట్లతో ఒప్పందం వెనుక అసలు రహస్యం ఏమిటో మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆరు టీమ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంటే.. ప్రతీరోజు ఏదో ఒక టీమ్ తమ లోగో ధరించి ఆట ఆడుతుంది. మధ్యలో ఏదో ఒక రోజు తప్పితే సీజన్ మొత్తం ఆటగాళ్ల జెర్సీలపై తమ లోగోలు కనపడుతుంటాయి. టీవీల్లో యాడ్స్ ఇవ్వడం కంటే ఇలా జెర్సీలపై లోగోల ద్వారానే ఎక్కువ మైలేజ్ వస్తుందని చెబుతున్నారు. గ్రౌండ్‌లో లోగోలు ధరించి క్రికెటర్లు తిరుగుతుండటం.. టీవీల్లో ఎక్కువగా లోగోలు కనిపిస్తుండటం స్పాన్సర్లకు కలిసి వస్తున్నది. ప్రతీ ప్రాంచైజీకి ఒక్కో సంస్థ రూ. 5 నుంచి రూ. 10 కోట్లు లోగో స్థానాన్ని బట్టి ఇస్తున్నాయి. ప్రధాన స్పాన్సర్ల (జెర్సీపై పెద్దగా కనిపించే లోగో)తో పాటు ఇలా చిన్న స్పాన్సర్ల ద్వారా ఒక్కో ఫ్రాంచైజీ రూ. 75 కోట్లు నుంచి రూ. 100 కోట్ల వరకు సంపాదిస్తున్నాయి. అంటే ఆ ఏడాది క్రికెటర్లకు ఇవ్వాల్సిన జీతాలు దాదాపు ఈ స్పాన్సర్ల ద్వారా వచ్చేస్తున్నాయి.

ఒక్కో ఆటగాడిపై 14 లోగోలు..

ఒక్కో క్రికెటర్ అవుట్ ఫిట్ పైన ఛాతీపై మూడు లోగోలు, ఎడమ భుజంపై రెండు, కుడి భుజంపై రెండు, వెనకాల ఒకటి, ప్యాంటు ముందు భాగంలో రెండు, హెల్మెట్ పై నాలుగు వైపులా నాలుగు.. ప్యాడ్లపై, క్యాప్స్‌పై ఇలా ఎక్కడ దొరికితే అక్కడ లోగోలు వేశారు. ఇలా ఒక్కో ప్లేయర్ అవుట్ ఫిట్‌పై 14 లోగోలు వివిధ స్పాన్సర్లకు చెందినవి ఉన్నాయి. అత్యధిక లోగోలు ముంబయి జట్టుపైనే ఉన్నాయి. నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా ఉన్నందు వల్లే అంత మంది స్పాన్సర్లు ఉన్నారు. ఇక సన్‌రైజర్స్ వంటి జట్లకు టైకా లాంటి సంస్థలు పూర్తి కిట్‌ను స్పాన్సర్ చేస్తున్నాయి.

ఏ జట్టు స్పాన్సర్లు ఎవరు

1. చెన్నై సూపర్ కింగ్స్: ప్రధాన స్పాన్సర్లు ముత్తూట్, ఇండియా సిమెంట్స్, గల్ఫ్ ఆయిల్, బ్రిటిష్ ఎంపైర్, నిప్పన్ పెయింట్, క్లియర్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, జియో. అసోసియేట్ స్పాన్సర్లు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బీకేటీ, డ్రీమ్ ఎలెవెన్, బూస్ట్, మయ్ దుబాయ్, ఈయూఎంఈ

2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ప్రధాన స్పాన్సర్లు ముత్తూట్ ఫిన్ కార్ప్, మాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్, అసోసియేట్ స్పాన్సర్లు : మింత్రా, జియో, నువాకో, ఎక్సైడ్, బీకేటీ

3. రాజస్థాన్ రాయల్స్: ప్రధాన స్పాన్సర్లు టీవీ9 భారత్‌వర్ష్, నీనే, జియో, ఫినా, కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్, అసోసియేట్ స్పాన్సర్లు కోల్గేట్, ఏపీఐఎస్ హనీ, డ్రీమ్ ఎలెవెన్, బీకేటీ, కింగ్‌ఫిషర్

4. ముంబై ఇండియన్స్: ప్రధాన స్పాన్సర్ శాంసంగ్, కలర్స్, అసోసియేట్ స్పాన్సర్లు మారియట్ బోన్‌వోయ్, జియో, ఆస్ట్రల్ పైప్స్, బీకేటీ, ఉషా, కింగ్ ఫిషర్, కోల్గేట్, విలియమ్ లాసన్స్, డ్రీమ్11, మేక్ మై ట్రిప్, బోట్, మయ్ దుబాయ్, ప్రిఫోమ్యాక్స్, రిలయన్స్ ఫౌండేషన్, డీఎన్ఏ నెట్‌వర్క్స్, రేడియో సిటీ 91.1, ఫివర్ ఎఫ్ఎం, డైరీ మిల్క్

5. ఢిల్లీ క్యాపిటల్స్: ప్రధాన స్పాన్సర్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, లోటస్ హెర్బల్, అసోసియేట్ స్పాన్సర్లు బీకేటీ, జియో, కోకాకోలా, బోట్, పేటీఎం ఇన్‌సైడర్, డ్రీమ్11, ఫివర్ 101.4 ఎఫ్ఎం, నషా, డీటీడీసీ కొరియర్, స్క్వాడ్ గేర్

6. కోల్‌కతా నైట్‌రైడర్స్: ప్రధాన స్పాన్సర్స్ ఎంపీఎల్, జియో డిజిటల్ లైఫ్, లక్స్ కోజీ, టీవీ9 భారత్‌వర్ష్, ఆస్ట్రల్ పైప్స్, రాయల్ స్టాగ్, గ్రీన్ ప్లై, కోల్గేట్, మెడిమిక్స్ అసోసియేట్ స్పాన్సర్లు బీకేటీ, కింగ్ ఫిషర్, మయ్ దుబాయ్, ఐబీ క్రికెట్, బోట్, క్రిక్‌ఫిగ్, సుదితి ఇండస్ట్రీస్, గల్లీ లైవ్ ఫాస్ట్

7. సన్‌రైజర్స్ హైదరాబాద్: ప్రధాన స్పాన్సర్లు రాల్కో టైర్స్, జియో, టీసీఎల్, వాల్వోలిన్, డ్రీమ్ ఎలెవెన్, నేరోలాక్, అసోసియేట్ స్పాన్సర్లు కోల్గేట్, జైరాజ్ స్టీల్, టైకా, ఫ్యాన్‌కోడ్ షాప్, డబుల్ హార్స్, మయ్ దుబాయ్

8. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: ప్రధాన స్పాన్సర్స్ ఇబిక్స్ క్యాష్ అసోసియేట్ స్పాన్సర్లు జియో డిజిటల్, ఫెనా, రాయల్ స్టాగ్, డ్రీమ్11, బీకేటీ

Advertisement

Next Story

Most Viewed