కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

by Shamantha N |   ( Updated:2021-05-05 22:55:27.0  )
కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
X

లక్నో : కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) చీఫ్ అజిత్ సింగ్ (82) కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆయన కొద్దిరోజులుగా గురుగ్రాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కొడుకు జయంత్ చౌదరి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గతనెల 20 న కరోనా సోకడంతో ఆయనను గురుగ్రాంకు తరలించి అక్కడే వైద్యం అందించారు. కానీ వ్యాధి తీవ్రత అధికమై ఊపిరి పీల్చడానికి కూడా కష్టమవడంతో ఆయన మరణించారని జయంత్ పేర్కొన్నారు.

అజిత్ సింగ్ రాజకీయ ప్రయాణం.. (1939-2021)

దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ 1939 లో జన్మించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అజిత్ సింగ్.. 1980 లలో రాజకీయ అరంగ్రేటం చేశారు. యూపీలోని బాగ్‌పట్ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆయనకు మంచి పట్టుంది. కేంద్రంలో విపి సింగ్, పివి నరసింహరావు ప్రభుత్వాలలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం 2001లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే గవర్నమెంట్‌లో చేరి వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. తిరిగి 2004లో యూపీఏలో చేరారు.

Advertisement

Next Story

Most Viewed