బతుకమ్మను అవమానిస్తావా.. చల్లా రిజైన్ చేయాలి : మాజీ ఎంపీ వీహెచ్

by Shyam |
బతుకమ్మను అవమానిస్తావా.. చల్లా రిజైన్ చేయాలి : మాజీ ఎంపీ వీహెచ్
X

దిశ, ఆత్మకూర్ : బతుకమ్మ ఆడుతున్న మహిళలను కించపరిచే విధంగా.. వారు ఆడుతున్న బతుకమ్మలను తన కారుతో తొక్కి మహిళలను అగౌరవపరిచిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం ఆత్మకూరులో జరిగిన సెంట్రల్ లైటింగ్ ఓపెన్ కార్యక్రమానికి విచ్చేసి అనంతరం తిరిగి వెళ్తూ.. మహిళలు బతుకమ్మ ఆడుతున్నారని కూడా తెలిసి కూడా.. బతుకమ్మల మీది నుండి తన కారును తీసుకు వెళ్లడం అగ్రకుల అహంకారానికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారని, కానీ వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాత్రం బతుకమ్మ పండుగను, తెలంగాణ మహిళల గౌరవాన్ని అభాసుపాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన అగ్రకులం అహంకారాన్ని చిన్న కులాల వారి మీద చూపిస్తున్నారని విమర్శించారు.

అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా బతుకమ్మ చీరల పంపిణీ సందర్బంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ మహిళల పట్ల మన నాయకులకు గౌరవం లేదని తెలుస్తోందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను, తెలంగాణ మహిళలను అగౌరవ పరిచిన ఎమ్మెల్యే చల్లా.. తన ఎమ్మె్ల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్, ఉపసర్పంచ్ స్వాతి భగవాన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పరికిరాల వాసు, ఆత్మకూర్ పీఏసీఎస్ డైరెక్టర్ జైపాల్ రెడ్డి, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story