- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బానిసలం కాదు పాలకులం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, నల్లగొండ: ‘మేం బానిసలం కాదు.. పాలకులం.. తరతరాలుగా మా బిడ్డల భవిష్యత్తు దోచుకుండ్రు. తెలంగాణలో త్యాగాలు ఒకరు చేస్తే.. పదవులు మరొకరు అనుభవిస్తుండ్రు’ అంటూ మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని NG కాలేజీ మైదానంలో బీఎస్పీ నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో ఆయన నిప్పులు చెరిగారు. అంతకుముందు బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ ఆధ్వర్యంలో బీఎస్పీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. అనంంతరం ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరో పదవులు అనుభవిస్తున్నారన్నారు. అమరవీరుల పాదాల వద్ద మోకరిల్లి మీ వద్దకు వచ్చానని, కాన్షీరామ్ కాలుమోపిన ఈ గడ్డ మీద నుంచి మేలుకోండంటూ పిలుపునిచ్చారు. అమరుల సమాధుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను మీకోసం వచ్చా.. ఇది బహుజనుల సునామీ అని తెలిపారు. ఆరున్నరేండ్ల పోలీస్ సర్వీస్‌ను లక్షల మంది బిడ్డల బతుకు మార్పు కోసం త్యాగం చేశానని, బంగారు తెలంగాణలో బానిసలాగా ఫామ్‌హౌస్‌ల చుట్టూ తిరగలేనని అమ్మకు చెప్పానని వివరించారు. నల్లగొండ నీలిగొండగా మారిందని, మాకు ప్రగతి భవన్ చాలా దగ్గరలో ఉందని, దొరల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన నల్లగొండకు ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎస్‌గా రిజైన్ చేసిన రోజే నా మీద కేసు పెట్టారని, ఇక్కడున్న ప్రతిఒక్కరూ ఒక ప్రవీణ్ కుమార్ అని వెల్లడించారు.
కథన కుతూహలంతో కవాతు నిర్మించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. తొమ్మిదేండ్లలో ఎన్నో గొప్ప పనులు చేసి.. నా జాతిని మేల్కొపానని, మరెన్నో సాహస కార్యాలు బహుజన బిడ్డలు చేశారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాపై తీవ్ర ఆరోపణలు చేశాయని, రెక్కాడితే గానీ డొక్కాడని పిల్లలను హాస్టల్ నుంచి తరిమివేశారని చెప్పారు. బహుజనులపై ఘోరమైన కుట్ర జరుగుతోందని, ‘దళితబంధు’ కోసం పెట్టిన రూ.వెయ్యి కోట్లు ఎవరి డబ్బులో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజల సొమ్మును విచ్చలవిడిగా వృథా చేస్తున్నారని, బహుజన రాజ్యం చాలా దగ్గరలో ఉందంటూ తెలిపారు. రాష్ట్రంలో వేల పాఠశాలలు ఉన్నా.. పేద విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని, విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన అవసరమని వివరించారు. ప్రైవేటు యూనివర్సిటీలతో అగ్రవర్ణ పేదలకూ మంచి జరగట్లేదని, ప్రైవేటు వ్యవస్థలోనూ మాకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికల ముందు మాటల గారడీతో ఏడేండ్లుగా మోసపోతున్నామని, వైద్యవిధానం సమూలంగా మార్పు జరగాలని ఆకాంక్షించారు. భారతరత్నకు ఓబీసీలు అర్హులు కారా.. జనాభా ప్రాతిపదికన మాకు అధికార వాటా ఇవ్వాలని, బహుజన రాజ్యంలో అన్ని కులాలకు సమాన వాటా ఉంటుందని వివరించారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఉండబోతుందని, ఒలింపిక్స్‌లో ఒక్క మెడల్ కాదు.. చైనాతో పోటీ పడుతామని తెలిపారు. సబ్బండ వర్గాలు అణచివేత లోనే ఉన్నాయని, రాబోయే రోజులన్ని బహుజన రాజ్య సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
బహుజన రాజ్యం అంత సులువుగా రాదని, తరతరాలుగా దోపిడీ చేసిన ఆధిపత్య కులాలు సంపాదించిన డబ్బులు ఎరగా వేస్తారని చెప్పుకొచ్చారు. నల్లగొండ సభ దేశ రాజకీయలను సైతం మార్చబోతుందని, కారు కింద పడుతారో.. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోతారో మీరే నిర్ణయించుకోవాలని సూచించారు. అంతకుముందు బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీరాం జీ గౌతమ్ మాట్లాడుతూ.. బీఎస్పీ బహుజన రాజ్యం కోసం మహా సంగ్రామమే సృష్టిస్తోందన్నారు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యం తెలంగాణ నుంచే మొదలవుతుందని, బహుజన సమాజ్ పార్టీ నల్లగొండ నుంచి సమర శంఖం పూరిస్తోందని తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ సకల జనుల పార్టీ అని, బీఎస్పీ అంటే బహుజన రాజ్యం కోసం పుట్టిన పార్టీ అని వివరించారు. దేశంలో విద్యావ్యవస్థ పేదవారికి అందుబాటులో లేదని, 2023లో దేశంలో బహుజన రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహుజన సమాజం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం వదిలారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఆయన ప్రకటించారు. అంతకుముందు మర్రిగూడ బైపాస్ నుంచి సభా వేదిక వరకు ప్రవీణ్‌కుమార్.. ర్యాలీగా వచ్చారు. మర్రిగూడ బైపాస్ వద్ద అంబేడ్కర్, జగ్జీవన్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్షులు మంద ప్రభాకర్, పరం జ్యోతి, రాష్ట్ర నాయకులు ఇబ్రాం శేఖర్, బాలయ్య, పూదరి సైదులు, జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్, నగేష్, స్వేరోస్ ప్రతినిధులు, బీఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.