అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు.. ఫారెస్ట్ ఆఫీసర్ వార్నింగ్

by Aamani |
Forest officials
X

దిశ, ఆసిఫాబాద్: అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్పలకొండ హెచ్చరించారు. ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని ఉపరితల గనుల వద్ద ఆదివారం ఉదయం అక్రమంగా కలప తరలిస్తోన్న నిందితులను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి అప్పలకొండ వివరాలు వెల్లడిస్తూ.. ముందస్తు సమాచారం మేరకు అసిఫాబాద్, తిర్యాని రేంజ్ సరిహద్దు ప్రాంతమైన దంతన్‌పెళ్లి, కైరిగుడా ప్రాంతంలో ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ క్రమంలో ఆ కారులో ఉన్న రూ.89613 నగదు, 22 కలప దుంగలు స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించామని వెల్లడించారు.

కలప తరలిస్తున్న మాదారం గ్రామానికి చెందిన గొర్లపెళ్లి మహేష్, సురేష్, నరేష్, కల్యాణ్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. అంతేగాకుండా.. వారి వద్దనున్న రెండు ద్విచక్ర వాహనాలను సైతం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అక్రమంగా ఎవరైనా కలప తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రాత్రిపూట రేంజ్ పరిధిలో ఎక్కడికక్కడ పెట్రోలింగ్ బృందాలు అక్రమ రవాణాపై నిఘా పెట్టాయని తెలిపారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్, సెక్షన్ అధికారులు విజయ్ కుమార్, మహేందర్, బీట్ అధికారులు స్వప్న పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed