శృతిమించుతోన్న అటవీశాఖ చర్యలు.. నాలుగు ఎకరాల్లో పంట ధ్వంసం

by Sumithra |
శృతిమించుతోన్న అటవీశాఖ చర్యలు.. నాలుగు ఎకరాల్లో పంట ధ్వంసం
X

దిశ, కొత్తగూడ : పోడు భూముల పట్టాల కోసం సడక్ బంద్ చేసిన రోజే ఫారెస్ట్ అధికారుల దాష్టీకానికి ఆరుగాలం పండించిన పంటంతా నేల పాలైంది. ఈ ఘటన కొత్తగూడ మండలంలోని గుంజేడు గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్యాల గడ్డలో మంగళవారం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తగూడ మండల పరిధిలోని గుంజేడు గ్రామ పరిధిలో చిట్యాల గడ్డ ఉంది. ఇక్కడ దాదాపు 55 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గడచిన 40 ఏండ్లుగా వీరంతా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇన్నేళ్లు ఏ సమస్య లేకుండా గడచిన వీరి జీవితాలు గత కొంత కాలంగా ఫారెస్ట్ అధికారుల చర్యల మూలంగా దినదిన గండంగా మారింది.

గడచిన ఏడాది కాలంగా హరితహారం పేరుతో పోడు భూములు లాక్కునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఆదివాసీలు కొన్ని నెలలుగా ఆందోళన చెందుతున్నారు. చిట్యాలలో ఆదివాసీలు దాదాపుగా 50 ఎకరాల వరి సాగు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఈరోజు ఉన్నట్టుండి కల్తీ సతీష్ అనే వ్యక్తికి చెందిన నాలుగు ఎకరాల వరి పంటను ఫారెస్ట్ అధికారులు నేలమట్టం చేశారన్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా చేతికి వచ్చిన పంటను ట్రాక్టర్లు, డోజర్ల సాయంతో ధ్వంసం చేసినట్లు కన్నీటి పర్యంతం అయ్యాడు. సాగు చేసుకునే హక్కును కల్పిస్తూ కలెక్టర్ ఇచ్చిన పత్రాలు ఉన్నప్పటికీ అటవీ అధికారులు తమ నోటి కాడి ముద్ద నేలపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

న్యాయం చేయాలని బాధితుడి ఫిర్యాదు..

చిట్యాల గడ్డలో అటవీ అధికారులు చేతి కందొచ్చిన పంటను ధ్వంసం చేసిన ఘటనలో బాధితుడు కల్తీ సతీష్ కొత్తగూడ పోలీసులను ఆశ్రయించాడు. ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాపై అటవీ అధికారులు సెక్షన్ ఆఫీసర్ అట్టి సింగ్, బీట్ ఆఫీసర్ జాటోత్ సందీప్ వ్యవహరించిన తీరు దారుణం అన్నారు. చేతికి వచ్చిన పంటను ట్రాక్టర్ రూటవేటర్‌తో ధ్వంసం చేశారని, పంట మట్టిపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ హక్కుల చట్టం, పీసా యాక్ట్ ప్రకారం ఈ దారుణానికి కారకులైన అందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తగూడ పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed