యూరో కప్ మ్యాచ్ చూస్తున్న చిన్నారికి ఊహించని గిఫ్ట్

by Shyam |   ( Updated:2021-07-09 11:31:45.0  )
football match
X

దిశ, స్పోర్ట్స్: యూరో 2020లో భాగంగా ఇంగ్లాండ్-డెన్మార్క్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ చూడటానికి వచ్చిన ఒక చిన్నారికి ఊహించని బహుమతి అందింది. సెమీస్‌లో డెన్మార్క్‌పై 2-1 తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు 55 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కాగా, అదే సమయంలో స్టాండ్స్‌లో తన తండ్రితో ఉన్న చిన్నారి పాపను చూసిన ఇంగ్లాండ్ ఆటగాడు మాసన్ మౌంట్ అక్కడకు వెళ్లాడు.

తన చేతిలో ఉన్న జెర్సీని చిన్నారికి అందించగానే ఆ పాప ఆనంద భాష్పాలతో కన్నీటి పర్యంతమైంది. అక్కడ ఉన్న ప్రేక్షకులు మాసన్ చేసిన పనికి ఫిదా అయ్యారు. అంతే కాకుండా చుట్టూ ఉన్న వాళ్లు తండ్రిని, కూతురిని అభినందించారు. ఈ వీడియోను ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టగా కేవలం ఒక రోజులో 71 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ ఆదివారం రాత్రి ఇంగ్లాండ్ – ఇటలీ జట్లు యూరో ఫైనల్‌లో తలపడనున్నాయి.

Advertisement

Next Story