పండు తినాలా? జ్యూస్ తాగాలా?

by sudharani |   ( Updated:2021-06-11 01:04:47.0  )
పండు తినాలా? జ్యూస్ తాగాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవికాలం వచ్చేస్తోంది. ఇక కూల్ డ్రింక్‌లు, జ్యూస్‌లకు బాగా డిమాండ్ పెరగనుంది. అయితే బయట జ్యూస్‌లు తాగడం కంటే ఇంట్లో చేసుకుని తాగడం మంచిది. కానీ జ్యూస్ చేసుకునే కంటే పండును పండులాగ తింటేనే చాలా మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు. పండు తినడం మంచిదా? జ్యూస్ చేసుకుని తాగడం మంచిదా? అనే ప్రశ్న ఎప్పట్నుంచో ఉంది. దీనికి సమాధానం పండు తినడమే మంచిది. అలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, జ్యూస్ చేసుకోవడం వల్ల కలిగే నష్టాలను లైఫ్‌స్టైల్ కోచ్ లూక్ కోటిన్హో వివరించారు.

కోటిన్హో ప్రకారం జ్యూస్ చేయడం కోసం పండును కోసినపుడు దానిలో షుగర్ శాతం తగ్గిపోతుంది. అలాగే కూరగాయలను జ్యూస్ చేసినపుడు వాటిలో ఉన్న పీచు పదార్థాల శాతం కూడా తగ్గిపోతుంది. అలాగే జ్యూస్ చేయడం వల్ల కలిగే మరికొన్ని అనర్థాలు ఏంటో తెలుసుకుందాం.

బరువు తగ్గే క్రమంలో డైట్ పాటించే వాళ్లు ఆకుపచ్చ జ్యూస్‌లు ఎక్కువ తాగుతుంటారు. అయితే ఆ కూరగాయలను పెంచే విధానంలో వాడిన క్రిమిసంహారక మందులు శరీరానికి హాని చేస్తాయి. కూరగాయను జ్యూస్ చేయకుండా ఉన్నది ఉన్నట్లు తినడం ద్వారా జీర్ణక్రియకు అవసరమయ్యే పీచు పదార్థం దొరుకుతుంది. కానీ జ్యూస్ చేయడం కేవలం రసం మాత్రమే లోపలికి వెళ్లి ఆకలిని నియంత్రించలేకపోతుంది.

పళ్లను, కూరగాయలను నమిలి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నమిలే ప్రక్రియలో భాగంగా సలైవా ఉత్పత్తి అయ్యి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములు విడుదలవుతాయి. తద్వారా అందాల్సిన పోషకాలు చేరాల్సిన చోటికి చేరుకుంటాయి. అంతేకాకుండా ఆ ఎంజైములు నోటిలో, జీర్ణాశయంలో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

జ్యూస్‌లు శరీరాన్ని డీటాక్స్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ శరీరక్రియకు కావాల్సిన పోషకాలను అందజేయవు. దీంతో మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉండదు. ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, కోలన్, చర్మం రూపంలో ఇప్పటికే శరీరంలో ఐదు డీటాక్స్ చేయగల భాగాలు ఉన్నాయి. వీటి పని ఇవి సక్రమంగా చేయాలంటే పోషకాలు అవసరం. ఆ పోషకాలు జ్యూస్‌ల ద్వారా కాకుండా నమిలి తినడం ద్వారా లభిస్తాయని కోటిన్హో పేర్కొన్నారు.

అలాగే ఆహారాన్ని ఎక్కువగా జ్యూస్‌ల రూపంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం, నీరసం వచ్చే సమస్యలు ఉన్నాయి. అందుకే ఘనపదార్థాలను, ద్రవ పదార్థాలను సమతుల్యం చేస్తూ డైట్ ప్లాన్ ఉండాలి. అందుకే క్యారెట్‌ను జ్యూస్ చేసుకుని తినకుండా నములుతూ తింటూ దాని రుచిని, దాని వల్ల చేకూరే ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయాలని కోటిన్హో సలహా ఇస్తున్నారు.

Advertisement

Next Story