- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరద విషాదం
దిశ, తెలంగాణ బ్యూరో: వరద మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఐదు రోజుల భారీ వర్షంతో నిరుపేదల కండ్లల్లో నీళ్లింకాయి. రెండు రోజులుగా వరద ఆగింది. వానలతో బయటకు వెళ్లిన బాధితులు ఇప్పుడిప్పుడే తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంటి పరిస్థితులు చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సర్వం కోల్పోయిన వారి బతుకులు రోడ్డున పడ్డాయి. రెక్కాడితే గానీ డొక్కాడని వారి సంసారాలు మళ్లీ గాడిన పడడం కష్టంగా మారింది. పేదల ఇండ్ల దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి వాహనాలన్నీ బురద, మట్టిలో ఉన్నాయి. తిండి గింజలు, దుప్పట్లు, పరుపులు, మంచాలు.. ఒక్కటేమిటి.? సర్వం తడిచి ముద్దయ్యాయి. బురదతో దేనికీ పనికి రానివిగా మారాయి. మట్టిలో కూరుకుపోయిన కార్లను వెతికి తీస్తున్నారు. బురదలో ఇరుక్కుపోయిన బైకులు, స్కూటర్లను మెకానిక్కుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇంట్లో పేరుకుపోయిన డ్రైనేజీని శుభ్రం చేస్తున్నారు. కాలు తీసి కాలు పెట్టలేని విధంగా ఇండ్లు మారిపోయాయి. గదులైతే వాటి రూపురేఖలు కోల్పోయాయి. ముంపునకు గురైన కాలనీలు, బస్తీలలో విషాదం తాండవిస్తోంది. వరద పోయింది. కానీ దాని ప్రభావం ఇంకా ఉంది.
హృదయ విదారకం
తమ ఇళ్లను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులంతా కష్టపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్, శివారు మున్సిపాలిటీలు బడంగ్ పేట, మీర్ పేట, పహడీషరీఫ్, మణికొండ మున్సిపాలిటీలు, బోడుప్పల్, బండ్లగూడ, జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వందలాది కాలనీలు, వేలాది ఇండ్లు బురదలో కూరుకుపోయాయి. శుక్రవారం హఫీజ్ బాబానగర్, రామంతాపూర్ ప్రాంతాల్లో ‘దిశ’ ఫీల్డ్ విజిట్ లో కనిపించిన దృశ్యాలే ఇవి. వాళ్లు సాధారణ స్థితికి చేరుకునేందుకు రూ.లక్షలు ఖర్చు చేసినా కష్టమేనని స్పష్టమవుతోంది. ప్రభుత్వం సాయంగా అందించిన రూ.10 వేలు ఏ మూలకు సరిపోవని ముంపునకు పూర్తిగా గురైన ఇండ్లను పరిశీలిస్తే అధికారులకు కూడా తెలుస్తుందని బాధితులు చెబుతున్నారు. తమ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.