పెయింట్ ఆర్టిస్టులపై ఫ్లెక్సీల ఎఫెక్ట్

by Shyam |   ( Updated:2021-06-25 21:27:16.0  )
flex printing effect on paint artist
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొందరు నిరుద్యోగులు మక్కువతో పెయింటింగ్ నేర్చుకున్నారు. గత పదేళ్ల క్రితం స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల బోర్డులతో పాటు దేవాలయాలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం గోడలపై రాయించేవారు. దీంతో పెయింటింగ్ ఆర్టిస్టులకు ఉపాధి లభించేది. ప్రస్తుతం ఫ్లెక్సీలు మార్కెట్లోకి రావడంతో వీరి ఉపాధిపై ఎఫెక్ట్ పడింది. పనులు లేక షాపులను మూసివేసే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం ఉపాధి చూపితే తప్ప పూటగడువని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ చేయూత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

గత ఐదారేళ్ల క్రితం పెయింటింగ్ కు ఆధారణ ఎక్కువగా ఉండేది. ఎన్నికలు వస్తే ప్రతి పార్టీ నాయకులు పోటీపడి మరీ గోడలపై పేర్లను రాయించుకునే వారు. వీరే కాదు ప్రజా సంఘాల నేతలతో పాటు ఆలయాలు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు బోర్డులు, సినిమాలకు సైతం కట్టే బ్యానర్లను సైతం పెయింటింగ్ఆర్టిస్టులతో రాయించేవారు. విద్యాసంస్థలకు మనిషి ఆవిర్భావం, ప్రముఖుల ఫొటోలు, జీర్ణవ్యవస్థ, ప్రకృతిని ప్రతిబింబించే అంశాలు, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం వివరాలు ఇలా ఒకటేమిటీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను గోడలపై రాయించేవారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పెయింటింగ్ ఆర్టిస్టులు జీవనోపాధి పొందేవారు. కుటుంబాన్ని పోషించుకునేవారు. రానురాను సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో జీవనోపాధిపై ఎఫెక్టు పడింది. ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఫ్లెక్సీల ఎఫెక్ట్

మార్కెట్లోకి ఫ్లెక్సీలు వచ్చాయి. పీటుకు 50 రూపాయల చొప్పున కలర్ లో ఇవ్వడం, తక్కువ సమయంలో ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలు ఫ్లెక్సీలకు ఆదరిస్తున్నారు. దీంతో పెయింటింగ్ ఆర్టిస్టులకు ఉపాధి లేకుండాపోయింది. గోడపై ఒక సమాచారం రాయడానికి రెండు, మూడు రోజులు పట్టేది. అయితే ఫ్లెక్సీలతో కేవలం ఒక్క గంటలోనే ఏర్పాటు అవుతుంది. ఉపాధిలేక పెయింగ్ కళాకారులంతా షాపులను సైతం మూసివేశారు. రోడ్డునపడ్డారు. కుటుంబ పోషణభారమైంది.

గ్రానైట్ రాతిపై బొమ్మలతోనే…

పెయింటింగ్ పై ఆధరణ లేకపోవడంతో కొంత మంది గ్రానైట్ రాతిపై బొమ్మలు వేస్తున్నారు. ఇళ్ల ముందు పెట్లే నేమ్ ప్లేట్లు, దేవుళ్ల ఫొటోలు, శంకుస్థాపన,ప్రారంభోత్సవాలకు ఉపయోగించే శిలాఫలకాలపై పేర్లను చెక్కుతూ జీవనం సాగిస్తున్నారు. కళ్లకు కట్టినట్లు గీయడం వారిలోని సృజనాత్మకతను తెలియజేస్తుంది. శిలలపై బొమ్మలు గీస్తూ ప్రాణం పోస్తున్నారు. అయినప్పటికీ గిరాకీలు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చేయూత కరువు

వారిలో ప్రతిభకు కొదవలేదు.. మనిషిని చూస్తూ… బొమ్మలను చూస్తూ కూడా రాళ్లపై ఉన్నది ఉన్నట్లుగా… కళ్లకు కట్టినట్లుగా అద్భుతంగా గీస్తారు. ఒక వైపు ప్లెక్సీలు… మరోవైపు కరోనాతో ఉపాధి లేకుండా పోయింది. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదు. బ్యాంకులు సైతం రుణం కోసం ముఖం చాటేస్తున్నాయి. ఏం చేయాలో… ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలో తెలియక మనోవేధనకు గురవుతున్నారు.

డిమాండ్లు…

రూ.10లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. ప్రభుత్వం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా పెయింటింగ్ ఆర్టిస్టులకు పని కల్పించాలి. అందుకు సంబంధించిన జీవో జారీ చేయాలి. ప్రతి ఏడాది ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలి. కళాకారులకు ప్రోత్సాహకంగా నగదు అందజేయాలి. పెయింటింగ్ ఆర్టిస్టుల పిల్లలకు విద్యా సంస్థల్లో ఫీజు రాయితీ ఇవ్వాలి. ఉచితంగా వైద్యసేవలందించాలి.

షాపును మూసివేశా

పెయింటింగ్ పై ఆసక్తితో నేర్చుకున్నా. గత 15 ఏళ్లుగా పెయింటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నా. అయితే మార్కెట్లోకి ఫ్లెక్సీలు రావడంతో ఉపాధి కరువైంది. కళ ఉన్నా పనిఇచ్చేవారు లేరు. ప్రభుత్వం గతంలో సంక్షేమ పథకాలకు సంబంధించినవి గోడలపై రాయించేది. ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో ఆ వర్కు కూడా లేకపోవడంతో షాపు కిరాయి కూడా వెళ్లకపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో షాపును మూసివేశా- కొండేటి నివాస్, పెయింటింగ్ ఆర్టిస్టు

ప్రభుత్వమే ఆదుకోవాలి

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బోర్డులతో పాటు ప్రకృతికి సంబంధించిన బొమ్మలు, సైన్స్‌కు సంబంధించిన అంశాలను గోడలపై రాయించేవారు. అప్పుడు చేతినిండా పని ఉండేది. ఇప్పుడు ప్లెక్సీలతో కూడిన బొమ్మలను ఏర్పాటు చేస్తుండటంతో ఉపాధి లేకుండాపోయింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం స్పందించి బ్యాంకులతో వడ్డీలేని రుణాలు ఇప్పించడంతో పాటు ఆర్టిస్టులకు ఉపాధి కల్పించి ఆదుకునేందుకు జీవోను విడుదల చేయాలి. ఆర్టిస్టుల పిల్లలకు విద్యా సంస్థల్లో రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed