వాళ్లు ప్రేమికులేనా..? ఆ ముగ్గురిని ఎలా చంపారు..?

by Anukaran |
వాళ్లు ప్రేమికులేనా..? ఆ ముగ్గురిని ఎలా చంపారు..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ పేరుతో ఉన్మాదంగా మారుతున్నారు కొందరు యువకులు. క్లోజ్‌గా అమ్మాయిలు మాట్లాడితే చాలు.. అదే ప్రేమ అనుకొని ఆమె నా సొంతం.. నాకే సొంతం అన్నట్లు వ్యహరిస్తున్నారు. ఆ అమ్మాయితో మరో యువకుడితో మాట్లాడితే చాలు.. అనుమానం పెంచుకోని అంతమొందిస్తున్నారు. ఇలా గడిచిన రెండు నెలల్లోనే నాలుగు ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు పసికందు మొదలుకొని పండు ముదుసలి వరకు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతుండగా.. మరోవైపు ప్రేమ పేరుతో యువతులను కర్కషంగా హత్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వరసగా జరుగుతున్న ప్రేమోన్మాద ఘటనలతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.

అక్టోబర్ 13, రాత్రి 9 గంటలు..

కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలో నర్సుగా పనిచేస్తుంది. స్నేహితురాళ్లతో కలసి ఆసుపత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటుంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం.. ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు నాగభూషణంను హెచ్చరించడంతోపాటు ఆమెను ఏమీ చేయనని హామీ పత్రం రాపించారు.
రోజూలానే అక్టోబర్ 13న విధులకు హాజరైన చిన్నారి రాత్రి 9 గంటలకు విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా, మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు.
ఆమె నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే చనిపోగా… అతనికీ మంటలు అంటుకుని తీవ్రగాయాలయ్యాయి.

అక్టోబర్ 15, ఉదయం 10 గంటలు..

సరిగ్గా రెండు నెలల క్రితం బెజవాడలో దారుణం జరిగింది. తనను ప్రేమించట్లేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తనను తాను కత్తితో పొడుచుకుని ఉన్మాదాన్ని ప్రదర్శించాడు. విజయవాడలోని క్రీస్తు రాజుపురానికి చెందిన దివ్య తేజస్విని ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనలియర్ చదువుతోంది. క్రీస్తు రాజుపురానికే చెందిన చిన్నస్వామి కొంతకాలంగా ప్రేమ పేరుతో తేజస్విని వెంట పడుతున్నాడు. తేజస్విని పలుమార్లు చిన్నస్వామిని వారించినప్పటికీ… అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తనను ప్రేమించట్లేదన్న కారణంతో తేజస్వినిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 15 ఉదయం తేజస్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లాడు. మాట్లాడాలని తేజస్వినిని బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లతో తేజస్విని అక్కడికక్కడే కుప్పకూలింది. ఆపై చిన్నస్వామి తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. గమనించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించాగా తేజస్విని మృతి చెందింది. చిన్నస్వామి కోలుకోని జైలుకెళ్లాడు.

నవంబర్ 1, రాత్రి 9:30 గంటలు..

గాజువాకలోని శ్రీనగర్‌ సుందరయ్య కాలనీలో రాత్రి 9.30 గంటలకు యువతి హత్యకు గురైంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసుకున్న వరలక్ష్మి (17) అనే యువతిని చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి వెంకట్‌(21) ప్రేమ పేరుతో వేధించేవాడు. నవంబర్ 1న రాత్రి రాము అనే స్నేహితుడితో కలిసి ఆమెకు ఫోన్‌చేసి సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అఖిల్‌సాయిని నిలదీయగా.. మాట్లాడాలి రా అంటూ తుప్పల్లోకి లాక్కెళ్లాడు. అక్కడి పరిస్థితిని చూసిన వరలక్ష్మి ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్‌ చేసి చెప్పగా.. కోపోద్రిక్తుడైన అఖిల్‌సాయి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికి పరారీ అయ్యాడు. అఖిల్‌సాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొనఊపిరితో ఉన్న యువతిని కారులో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పథకం ప్రకారమే వరలక్ష్మి హత్య జరిగిందిని పోలీసుల విచారణలో వెల్లడైంది. యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే కారణంతోనే హత్య చేసినట్లు తెలిసింది. వరలక్ష్మిపైన అనుమానంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

డిసెంబర్ 2, ఉదయం 8:45 గంటలు..

విశాఖ ఫెర్రీ వీధికి చెందిన ప్రియాంకపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. 20 ఏళ్లుగా రెండు కుటుంబాలు కలిసి ఉంటుండగా.. గత కొద్దికాలం నుంచి శ్రీకాంత్ ప్రేమపేరుతో ప్రియాంక వెంట పడుతున్నాడు. అతడిని ఇరు కుటుంబ సభ్యులు మందలించినా బుద్ది మార్చుకోక కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా గొంతు కోసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా, ప్రియాంక, శ్రీకాంత్ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కొన్ని ఫేస్‌బుక్‌లో దర్శనిమిచ్చాయి. పెళ్లికి అంగీకరించకపోవడంతోనే… దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పై నాలుగు సంఘటనలన్ని తాను ప్రేమించిన యువతి తనకే దక్కాలని, తనకు దక్కనిది మరొకరికి సొంతం కావద్దనే ఉన్మాదంతోనే దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రేమిస్తే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని కానీ.. ఇలా కత్తులతో తెగకోయడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదు. నిజమైన ప్రేమ ఇలాంటి దుశ్చర్యలను కోరుకోదని గుర్తించాల్సిన అవసరం ఉన్నది.

Advertisement

Next Story