నేటి నుంచి మళ్లీ ఫస్ట్ డోస్

by Anukaran |   ( Updated:2021-08-10 22:22:44.0  )
నేటి నుంచి మళ్లీ ఫస్ట్ డోస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్ట వ్యాప్తంగా ఈ రోజు నుంచి మళ్లీ ఫస్ట్ డోసు ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలతోపాటు, వైద్యశాఖ నుంచి అనుమతి పొందిన సెంటర్లలోనూ వ్యాక్సిన్ వేయనున్నారు. అయితే ఇన్నాళ్లు జీహెచ్ఎంసీ పరిధిలో కోవిన్ సాప్ట్ వేర్‌లో ముందస్తు నమోదు ఉంటేనే టీకా ఇవ్వగా, బుధవారం నుంచి ఈ నిబంధనను తొలగించనున్నారు. టీకా పొందాలనుకునే వారు ఆధార్ కార్డుతో నేరుగా సెంటర్లను సంప్రదిస్తే స్పాట్ రిజిస్ర్టేషన్ ద్వారా డోసులను పంపిణీ చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 74 మొబైల్ వాహనాలతో కూడా ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాలలో ఫస్ట్, రెండో డోసులను స్పాట్ రిజిస్ర్టేషన్ ద్వారా వేయనున్నారు. ఈ వాహనాలు మార్కెట్లు, కార్యాలయాలు, బ్యాంకులు, షాపింగ్ మాల్స్, తదితర ప్రాంతాల్లో అందుబాటులో ఉండనున్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన డోసుల సప్లై లేక సుమారు రెండు నెలల నుంచి రూరల్ ఏరియాల్లో ఫస్ట్ డోసు నిలిచిపోగా, జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన 25 రోజుల నుంచి వైద్యశాఖ ఫస్ట్ డోసును బంద్ పెట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సూచించిన థర్డ్ వేవ్ సంకేతంతో రాష్ర్ట వైద్యారోగ్యశాఖ ప్రత్యేకంగా 10 లక్షల డోసులను నేరుగా కొనుగోలు చేసి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది.

కోటి 53 లక్షల మందికి టీకాలు పూర్తి

రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 64 లక్షల మంది వ్యాక్సిన్‌కు అర్హులు కాగా, వీరిలో ఇప్పటికే కోటి 53 లక్షల 46, వేల 90 మందికి టీకాలు తీసుకున్నారు. దీనిలో 1,15,24,621 మంది మొదటి డోసు తీసుకోగా, 38,21,469 మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు అత్యధికంగా హైదరాబాద్‌లో రెండు డోసులు కలిపి 32,95,771 మంది వ్యాక్సిన్ తీసుకోగా, అత్యల్పంగా నారాయణపేట్ జిల్లాలో కేవలం 76,237 మంది టీకా వేసుకున్నారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెంలో 3,32,816, ఆదిలాబాద్‌లో 1,32,523, జగిత్యాలలో 2,89,198, జనగామ 1,43,605, భూపాలపల్లి 1,68,286, గద్వాల 1,05,595, కామారెడ్డిలో 3,05,335, కరీంనగర్ 5,00,915, ఖమ్మంలో 4,78,491, మహబూబాబాద్ 2,46,330, మహబూబ్‌నగర్‌లో 2,18,913, మంచిర్యాలలో 2,61,488, మెదక్ 2,25,880, మేడ్చల్ 19,81,923, ములుగు 1,17,163, నాగర్ కర్నూల్ 1,92,573, నల్గొండ 3,95,477, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 92,358, నిర్మల్‌లో 2,38,849, నిజామాబాద్ 3,99,489, పెద్దపల్లి 3,32,338, సిరిసిల్లాలో 2,06,860, రంగారెడ్డి 20,39,214, సంగారెడ్డి 4,44,628, సిద్ధిపేట్ 3,93,039, సూర్యాపేట 3,18,598, వికారాబాద్ 1,58,526, వనపర్తి 1,21,883, వరంగల్ రూరల్ 1,64,558, వరంగల్ అర్బన్‌లో 6,04,716, యాదాద్రిలో 3,62,515 మంది టీకా పొందినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. అయితే డిసెంబరు వరకు రాష్ట్రంలోని అర్హులందరికీ రెండు డోసులు పూర్తయ్యేలా ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్‌ను స్పీడప్ చేస్తుంది.

జీహెచ్ఎంసీ పరిధిలో 84 శాతం టీకా పంపిణీ పూర్తి

జీహెచ్ఎంసీ పరిధిలో 84 శాతం మందికి ఫస్ట్ డోసు పూర్తి కాగా, కేవలం 16 శాతం మంది మాత్రమే రెండో డోసును తీసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో 9,03,5088 మంది వ్యాక్సిన్ కు అర్హులుగా ఉండగా, వీరిలో 4,68,0239 మంది మొదటి డోసు, 144,16,3231 మంది రెండో డోసును తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా రాష్ర్టంలో మంగళవారం మరో 1,32,396 మంది వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ బులెటెన్ విడుదల చేసింది. వీరిలో 60,257 మంది మొదటి, 72,139 మంది రెండో డోసును తీసుకున్నారు.

వైరస్‌ను బంధిస్తే నియంత్రణ సాధ్యం కాదు

కరోనాను బంధించే కార్యక్రమాలు చేస్తే నియంత్రణ సాధ్యం కాదు. ఎక్కువ మందిలో యాంటీబాడీలు డెవలప్ చేస్తేనే ప్రజలకు రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం జరిగిన వ్యాక్సినేషన్ ద్వారా డిసెంబరు వరకు వైరస్ తీవ్రత ఉండదు. ఆ తర్వాత ప్రజల ప్రవర్తనపై వేవ్‌లు ఆధారపడి ఉంటాయి. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌ను పకడ్భందీగా చేస్తున్నాం. ప్రజలు స్వచ్ఛంధంగా కరోనా మార్గదర్శకాలను పాటిస్తేనే వేవ్ లను సులువుగా అడ్డుకోవచ్చు.
డాక్టర్ జి.శ్రీనివాసరావు, డీహెచ్

Advertisement

Next Story