బ్యాంకులకు ఆర్థికమంత్రి డెడ్ లైన్ 

by Shyam |   ( Updated:2020-09-03 09:29:34.0  )
బ్యాంకులకు ఆర్థికమంత్రి డెడ్ లైన్ 
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారులతో ఆర్థిక మంత్రి గురువారం నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. కరోనాతో దెబ్బతిన్న వ్యాపారాలను పునరుద్ధరించే లక్ష్యంతో బ్యాంకుల రుణ పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికను త్వరగా అమలు చేయాలన్నారు. సెప్టెంబర్ 15 లోగా సిద్ధం చేయాలని బ్యాంకులను కోరారు. రుణ పునర్ వ్యవస్థీకరణకు బోర్డు ఆమోదాన్ని వీలైనంత త్వరగా అమలు చేయడానికి బ్యాంకులు సిద్ధమవ్వాలని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

ఈ పథకానికి అర్హులైన రుణగ్రహీతలను సంప్రదించి సంబంధిత వ్యాపారాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కాపాడాలని చెప్పారు. రుణాలను తిరిగి చెల్లించే వారికి మారటోరియం ఎత్తేసినందున రుణగ్రహీతలకు మద్దతు ఇవ్వాలని నిర్మలా సీతారామన్ బ్యాంకులను, ఆర్థిక సంస్థలను కోరారు. కరోనా సంక్షోభం ఆధారంగా రుణగ్రహీతల రుణ విలువను అంచనా వేయవద్దని నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు.

గురువారం ఆర్థిక మంత్రి కొవిడ్-19 కారణంగా దెబ్బతిన్న రంగాలకు రుణ పునర్ వ్యవస్థీకరణ ప్రణాళిక అమలుకు సంబంధించి బ్యాంకుల సీఈవోలతో సమీక్ష జరిపారు. రుణగ్రహీతల రుణ సామర్థ్యంపై ప్రభావం లేకుండా చూడాలన్నారు. అయితే, రుణ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి అవసరమైన పూర్తి సమాచారాన్ని వివిధ భాషల్లో బ్యాంకుల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచినట్టు బ్యాంకులు నిర్మలా సీతారామన్‌కు తెలిపారు.

ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టామని పేర్కొన్నారు. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగష్టు 6న వ్యక్తిగత, ఎంఎస్ఎంఈ (MSME), కార్పొరేట్ రుణాలతో పాటు ఇతర రుణగ్రహీతలకు రుణాల పునర్ వ్యవస్థీకరణను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికోసం రుణగ్రహీతలు డిసెంబర్ 31లోపు బ్యాంకులను కోరే అవకాశముంది. బ్యాంకులు అంగీకరించిన 180 రోజుల్లోగా రుణ పునర్వ్యవస్థీకరణ అమలవుతుంది.

Advertisement

Next Story

Most Viewed