'రామజన్మ భూమి' విరాళాలాకు ఐటీ పన్ను మినహాయింపు

by Shamantha N |   ( Updated:2020-05-08 11:52:16.0  )
రామజన్మ భూమి విరాళాలాకు ఐటీ పన్ను మినహాయింపు
X

• గెజిట్ విడుదల చేసిన ఆర్థిక శాఖ

దిశ, న్యూస్ బ్యూరో :

దేశమంతా లాక్‌డౌన్, కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ అనే ట్రస్ట్‌కు ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను శాఖలోని 80జి సెక్షన్ ద్వారా ఐటీ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ పరిధిలోని ప్రత్యక్ష పన్నుల బోర్డు డైరెక్టరేట్ కార్యాలయం గెజిట్ విడుదల చేసింది. రాముడి జన్మస్థానమైన అయోధ్యలో రామమందిరం నిర్మించే బాధ్యతను పై ట్రస్టుకు అప్పగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ లోక్‌సభలో ప్రకటించారు. స్వతంత్ర ట్రస్టుగా ఆ సంస్థ రామమందిర నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు ప్రజలంతా లాక్‌డౌన్ కష్టాలు అనుభవిస్తున్న సమయంలో ఈ ట్రస్ట్‌కు ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు లభిస్తుందని గెజిట్ విడుదల కావడం రాజకీయ విమర్శలకు తావిచ్చినట్లయింది.

ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి, వలస కార్మికులు కాలి నడకన తిండి తిప్పలు లేకుండా వేలాది కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్ళకు వెళ్తున్నారు. ఆకలికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పార్లమెంటు నూతన భవన నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు కరోనా పేషెంట్లకు చికిత్స చేసే వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, మాస్కులు తదితరాలను జీఎస్టీ నుంచి మినహాయించాలన్న డిమాండ్లు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. అనేక రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో హెలికాప్టర్ మనీ, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంపు, రుణాల చెల్లింపులకు ఆరు నెలల గడువు.. లాంటి చాలా డిమాండ్లు వస్తున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సానుకూలంగా స్పందించలేదు. కానీ రామజన్మభూమి ట్రస్ట్ విషయంలో మాత్రం విరాళాలను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చే నిర్ణయాన్ని తీసుకోవడం రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువైంది.

Tags: Ramajanma Bhoomi Trust, Ministry of Finance, Income tax exemption, Section 80G

Advertisement

Next Story

Most Viewed