ఆలనపాలన ‘ఆమె’దే!

by vinod kumar |   ( Updated:2020-03-31 03:24:48.0  )
ఆలనపాలన ‘ఆమె’దే!
X

దిశ, మహబూబ్ నగర్: హక్కుల పోరాటంలోనే కాదు..రాజ్యాధికారంలోనే కాదు.. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్న మహిళలు నేడు విపత్కర పరిస్థితుల్లో సైతం పురుషులతో సమానంగా పనిచేయగలమని నిరూపిస్తున్నారు మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇంటిని చక్కబెట్టడమే కాదు అవకాశం ఇస్తే మొత్తం సమాజాన్ని కూడా చక్కబెట్టగలమని నిరూపిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు. కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహాయక చర్యలు తీసుకునేందుకు వారు ముందుకు వచ్చి నడుంబిగిస్తున్నారు. అటు శాంతిభద్రతల విషయంతో పాటు పరిపాలన విషయంలో కూడా వారికి మరొక్కరు పోటీ లేరని నిరూపిస్తూ మొత్తం కిందిస్థాయి అధికార వ్యవస్థను ముందుండి నడిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాను పరిగణలోకి తీసుకుంటే అటు రాజకీయంగా ఇటు పరిపాలనా పరంగా కూడా మహిళలే కీలక పదవులలో వుండడంతోపాటు వారిదే పై చేయిగా కనిపిస్తోంది. అందుకే మహబూబ్ నగర్ జిల్లాలో ఆమెదే రాజ్యాధికారం అని చెప్పవచ్చు. ఈ సందర్భంలో కరోనా నివారణ చర్యల్లో వారు ముందుండి తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తూ అవసరమైతే వారే స్వయంగా పనులను చేసేందుకు కూడా వెనుకంజ వేయడం లేదు.

పరిపాలనలో వారివే ఉన్నత స్థానాలు…

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పరిపాలనా పరంగా చూస్తే మహిళలదే పై చేయిగా కనిపిస్తుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో కలిపి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం 5 జిల్లాలుగా కొనసాగుతుంది. అందులో మూడు జిల్లాలకు మహిళా కలెక్టర్లుగా కొనసాగుతుండగా, మూడు జిల్లాలకు మహిళలు ఎస్పీలుగా కొనసాగుతుండగా మరో జిల్లాకు కూడా మహిళా ఎస్పీ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. వీరిలో కొంత మంది మహబూబ్ నగర్ జిల్లా విభజన సమయం నుండే జిల్లాలో కొనసాగుతుంటే మరి కొందరు ఇటీవల కొత్తగా బదిలీపై వచ్చారు. అయినా కూడా వారు వారివారి జిల్లాలపై పూర్తిస్థాయి పట్టు సాధించి జిల్లా కరోనా నియంత్రణ చర్యల్లో తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాల వారిగా చూస్తే నారాయణపేట జిల్లా కలెక్టర్ గా హరిచందన, ఎస్పీగా డా.చేతన, వనపర్తి జిల్లా కలెక్టర్ గా యాస్మీన్ భాషా, ఎస్పీగా అపూర్వరావు, జోగుళాంభ గద్వాల జిల్లా కలెక్టర్ గా శృతి ఓఝా, ఇంచార్జ్ ఎస్పీగా అపూర్వరావు, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా రెమారాజేశ్వరిలు పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడా కూడా తమపై ఆరోపణలు, విమర్శలు లేకుండా విపత్కర పరిస్థితుల్లో తమదైన శైలీలో పాలనను సాగిస్తున్నారు. వీరితోపాటు పలు కీలక శాఖలలో, విభాగాల్లో సైతం మహిళా అధికారులే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్ నగర్ డీఆర్ఓగా స్వర్ణలతా, పౌరసరఫరాల శాఖాధికారిగా వనజాత, వ్యవసాయశాఖాధికారిగా సుచరిత, మర్కెటింగ్ ఏడీగా బాలమణి, జిల్లా విద్యాధికారిగా ఉషారాణి, డీటీఓగా దుర్గాప్రమీల, స్టేట్ హోం అధికారిగా వెంకటరమణమ్మ కొనసాగుతుండగా వనపర్తిగా డీఎస్ఓగా రేవతి, నారాయణపేట జెడ్పీ సీఈఓగా కళాందిని, గద్వాల సీఈఓగా ముషాహిది బేగం, జిల్లా వైద్యాధికారిగా సుచరిత, మర్కెటింగ్ శాఖ ఏడీగా పుష్పమ్మలు కొనసాగుతున్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం 6300 మంది వివిధ ప్రభుత్వ హోదాల్లో మహిళలు పాలనను సాగిస్తున్నారు. ఎక్కడా కూడా జిల్లాలో ఇప్పటి వరకు కరోనా నియంత్రణ చర్యలు అలసత్వం వహించారనే అరోపణలు లేకుండా చూసుకుంటన్నారంటే వారి నిబద్దతకు నిదర్శనంగా చెపుకోవచ్చు.

రాజ్యాదికారంలో వారిదే పైచేయి….

మహిళలకు రాష్ర్ట ప్రభుత్వం అన్ని స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించిన తరువాత రాజకీయాల్లో చాలా మంది మహిళలకు తామేంటో రుజువు చేసుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా పురుషులతో పోటీపడలేక కొంత మంది మహిళలు రాజకీయంగా వెనుకబడి వారు రిజర్వేషన్లతో సమాజంలో మహిళలు తలుచుకుంటే ఏలా పాలన సాగించగలరనే విషయాన్ని నిరూపించుకున్నారు. ముఖ్యంగా గత కొంత కాలంగా యువతలో కూడా రాజకీయాలపై అసక్తి కనబరుస్తుండడంతో చాలా మంది చదువుకున్న మహిళలు నేడు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సర్పంచ్ స్థాయి నుండి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు కూడా వారు వివిధ హోదాల్లో నేడు తమ సత్తా చాటుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు వుండగా అందులో 11 స్థానాల్లో మహిళలు పుర చైర్మన్లుగా వుండడంతోపాటు ఉమ్మడి జిల్లాలో 186 మంది మహిళా కౌన్సిలర్లు ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలోని 5 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలకు 4 జిల్లాలకు మహిళలే జెడ్పీ చైర్మన్లుగా కొనసాగుతున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగుళాంబగద్వాల జిల్లా పరిషత్ చైర్మన్లుగా మహిళలు కొనసాగుతున్నారు. వీరిలో మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్న స్వర్ణసుధాకర్ రెడ్డి గతంలో అమరచింత ఎమ్మెల్యేగా కూడా కొనసాగిన అనుభవం వుంది. అదే సమయంలో స్థానిక సంస్థల విషయానికి వస్తే మొత్తం 71 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు సంబంధించి 34 ఎంపీపీ స్థానాలు, 36 జెడ్పీటీసీ స్థానాలను సైతం మహిళలు పదవిలో ఉన్నారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 389 మంది ఎంపీటీసీలుగా మహిళలు కొనసాగుతున్నారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1692 గ్రామ పంచాయితీలకు 839 మంది మహిళలు సర్పంచ్ లుగా వున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న అదేశాలను, అధికారులు చేస్తున్న సలహాలను పట్టిష్టంగా అమలు చేస్తూ గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న చోట్ట ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. అదే విధంగా మహిళా సంఘాల సభ్యులతోపాటు ఏఎన్ఎంలు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కూడా తమవంతు బాధ్యతలను నిర్వర్తిస్తూ అదర్శంగా నిలుస్తున్నారు.

Tags: ladies, officers, mahaboobnagar, corona

Advertisement

Next Story

Most Viewed