వాళ్లొక్కలే కాదు.. అధికారులు కూడా ఆశ్చర్యపోతున్రు

by srinivas |   ( Updated:2020-05-26 01:23:38.0  )
వాళ్లొక్కలే కాదు.. అధికారులు కూడా ఆశ్చర్యపోతున్రు
X

దిశ, ఏపీ బ్యూరో: సముద్రుడికి కోపం వస్తే లోపల కలిపేసుకుంటాడు అన్నది మత్స్య కారులు సాధారణంగా చెప్పే మాట.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని చింతలమోరి తీరాన్ని చూస్తే సముద్రుడికి కోపం వచ్చిందా? అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే సాధారణంగా సముద్రం 50 మీటర్లు ముందు వస్తేనే తీవ్ర ఆందోళన నెలకొంటుంది. ఇక్కడ మాత్రం ఏకంగా రెండు కిలోమీటర్ల మేర సముద్రపు నీరు పంటపొలాల్లోకి రావడం ఆశ్చర్యాందోళనలు నింపుతోంది.

ఈ మధ్యే వచ్చిన ఎంఫాన్ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. తీర ప్రాంతాలను భయపెట్టిన రాకాసి అలలు మినహా పెద్దగా నష్టం సంభవించలేదు. గాలితీవ్రతతో బొప్పాయి, అరటి, కొబ్బరి రైతులు నష్టపోయారు. అయితే అలల తీవ్రతకి సముద్రం తీరంపైకి దూసుకొచ్చింది. అది కూడా మీటర్ల దూరమే.. కానీ, ఇప్పుడు చింతలమోరి తీరంలో సుమారు 2 కిలోమీటర్లు రావడం ఏదైనా ప్రమాదానికి సంకేతమా? లేక సముద్రం లోపల భూకంపం లాంటిదేమైనా వచ్చిందా? అదీ కాకుంటే అమావాస్య సమయంలో సాధారణంగా వచ్చే ఆటుపోట్లే కాస్త తీవ్రంగా వచ్చాయా? అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

సహజంగా సునామీ సమయాల్లోనే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని, సునామీ హెచ్చరికలు లేకుండానే ఇలా జరగడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. సముద్రం ముందుకు రావడంతో అక్కడి పంటపొలాలన్నీ ఉప్పునీటితో నిండిపోయాయి. సారవంతమైన తమ నేలలు సముద్రం నీటి కారణంగా పాడైపోయాయని అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed