పంటల బీమాపై సందిగ్ధం వీడేనా?

by Shyam |
పంటల బీమాపై సందిగ్ధం వీడేనా?
X

దిశ ప్రతినిధి, మెదక్ : పంటల బీమాపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఈ పథకంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత నివ్వలేదు. మక్కల సాగు వద్దని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో కొందరు రైతులు పత్తి, వరి, కంది పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికే 15 శాతం పంటలు సాగవగా వేసిన పంటలకు బీమా చేయించేందుకు నిరీక్షిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ‌శాఖ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అసలు పంటల బీమా పథకం ఉన్నట్టా..? లేనట్టా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంటల బీమా పథకం గతంలో అధికారుల నిర్లక్ష్యంతో కొంతమంది రైతులకు అందకుండా పోయింది. వడగండ్లు, అకాలవర్షం, క్రిమికీటకాల వల్ల పంటలకు జరిగే నష్టానికి ఈ బీమా వర్తిస్తుంది. ఈ పథకం వర్తించాలంటే రైతులు బ్యాంకు‌ల్లో రుణం తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు అవగాహన లేకపోవడంతో ప్రతిసారీ పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవాల్సి వస్తోంది. దీంతో వారికి పరిహారం అందడం లేదు. జిల్లాల్లో సహకార, కేంద్ర సహకార బ్యాంకు శాఖలు ఉండగా ఇందులో వేలాది మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అంతేస్థాయిలో బ్యాంక్ ఖాతాలున్నాయి. ఇవే కాకుండా స్టేట్ బ్యాంక్, ఆంధ్రా, సిండికేట్, ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో రైతులు రుణాలు పొందారు. ప్రతి ఏడాదీ రైతులు పంట రుణాలను రెన్యూవల్ సమయంలో పంటబీమా యోజన పథకానికి ప్రీమియం చెల్లించలేక పోతున్నారు. ఇప్పటికే పంటల బీమా ప్రకటన వెలువడాల్సి ఉండగా దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. సాధారణంగా వరికి ఆగస్టు 31, పత్తికి ఆగస్టు 15, శనగ, పెసర, కంది, మొక్కజొన్న పంటలకు జులై 31 గడువు వరకు ఉంటుంది. కానీ అసలు ప్రకటనే లేకపోవడం రైతులు అయోమయానికి గురవుతున్నారు.

బీమా చెల్లింపులు.. లాభాలు..

పంటలకు వడగండ్లు క్రిమికీటకాల వల్ల జరిగే నష్టానికి బీమా వర్తిస్తుంది. రైతుల ఆదాయం నిలకడగా, స్థిరంగా కొనసాగించడం, రైతులు శాస్త్రీయంగా కొత్త పద్ధతుల వైపు మొగ్గు చూపేటట్టు చేయడం, వ్యవసాయానికి నిరంతరంగా రుణాలు అందేటట్టు చూడడంతో పాటు బీమా ప్రీమియంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ సైతం అందిస్తాయి. పంట రుణం తీసుకున్న రైతులకు బ్యాంకులు తప్పనిసరిగా రుణం నుంచి ప్రీమియం కట్ చేయాలి. రుణం పొందని రైతులు మాత్రం తమ ప్రీమియంను బ్యాంకు ద్వారా మాత్రమే అకౌంట్ పేరున డీడీ రూపంలో చెల్లించాలి. మొక్కజొన్న గ్రామ యూనిట్‌గా అమలు చేస్తుండగా మిగతా పంటలు మాత్రం మండల యూనిట్‌గా అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వం మొక్కజొన్నకు ఎకరానికి రూ.25 వేల బీమా సౌకర్యాన్ని కల్పించగా ఇందులో రైతు 2 శాతం అంటే రూ.500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వరికి ఎకరాకు రూ.34 వేల బీమా వర్తిస్తుండగా ఇందుకోసం 2 శాతం రూ.680 ప్రీమియం చెల్లించాలి. కందికి ఎకరాకు రూ.14 వేల బీమా వర్తించే అవకాశముండగా 2 శాతం రూ.280 ప్రీమియం చెల్లించాలి. పత్తికి ఎకరాకు రూ.35 వేలు వచ్చే అవకాశం ఉండగా రూ.1170 ప్రీమియం చెల్లించాలి.

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం..

ఈ పథకం ముఖ్యంగా బ్యాంకు ద్వారా రుణాలు పొందే రైతులకు, ఇతర రైతులకు వర్తిస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పంట నష్టం, దిగుబడిలో తగ్గుదల వచ్చినట్టయితే బీమా వర్తిస్తుంది. ఉద్యానవన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇస్తాయి. పంటలు కోసిన తర్వాత 14 రోజులలోపు వర్షాలు, తుఫాను వస్తే పంటలకు నష్టం వాటిల్లితే వాటికి బీమా వర్తిస్తుంది. బ్యాంకులో తీసుకున్న రుణంపై వర్షాకాలంలో 2 శాతం బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కూడా స్పష్టత లేకపోవడం అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఆదేశాలు రాలేదు
– శ్రవణ్ కుమార్ , డీఏవో సిద్దిపేట
పంటల బీమాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు రాగానే పంటల బీమా పథకంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. పంటల బీమా పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్పులు చేయనుంది.. గైడ్ లైన్స్ సైతం విడుదల కాలేదు.

Advertisement

Next Story