మాపై ఎందుకీ వివక్ష .. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన

by Shyam |   ( Updated:2021-12-03 05:49:29.0  )
మాపై ఎందుకీ వివక్ష .. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన
X

దిశ, కాటారం : ఎందుకీ వివక్ష.. వడ్లు కొనుగోలు చేస్తామంటూ కేంద్రాన్ని ప్రారంభించి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ ధాన్యం కొనక పోవడంతో ఓపిక నశించిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం‌లోని రేగుల గూడెం కొనుగోలు కేంద్రం వద్ద కాటారం- మంథని రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించడంతో పాటు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నినాదాలు ఇచ్చారు. రాస్తారోకో చేయడంతో రహదారికి ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ధాన్యం అమ్ముకోవడానికి ఈ ఏడాది ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని మునుపెన్నడూ, ఇలా జరగలేదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, మా ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డుపై ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. కొందరు రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ధాన్యం సక్రమంగానే ఉన్నప్పటికీ కేంద్రాల్లో వడ్ల కాంటా ప్రారంభించక పోవడం‌తో రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రం వద్ద ఎన్నోమార్లు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా అధికారులు, అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించడంతో పాటు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలుసుకొని కాటారం తహసీల్దార్ శ్రీనివాసరావు, కాటారం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సింగిల్ విండో మేనేజర్ సతీష్ అక్కడికి చేరుకున్నారు. కేంద్రాల్లో వడ్ల కాంట ప్రారంభించే అంతవరకూ తాము నిరసన విరమించమని రైతులు తెగేసి చెప్పారు.

కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఇక్కడికి రావాలని రైతులు డిమాండ్ చేశారు. చివరకు తహసీల్దార్ శ్రీనివాస రావు , సింగిల్ విండో మేనేజర్ సతీష్ తో మాట్లాడి రేపటి నుండి కొనుగోలు ప్రారంభించనున్నట్లు రైతులకు హామీ ఇచ్చి విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్ రైతు నాయకుడు గుడిపాటి రమేష్ రెడ్డి, పి.ఏ.సి ఎస్ మేనేజర్ సతీష్, తహసీల్దారు శ్రీనివాసరావు, కాటారం ఎస్ ఐ శ్రీనివాస్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed