ధరణి అంతా ఓ ట్రాష్.. మండిపడుతున్న రైతులు

by Shyam |
ధరణి అంతా ఓ ట్రాష్.. మండిపడుతున్న రైతులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ధరణి సేవలతో రైతులకు మేలు జరుగుతుందని గొప్పలు చెబుతున్న వారిని నిలువునా ఇబ్బందులకు గురి చేస్తోంది. మ్యుటేషన్, రెవిన్యూ రికార్డులలో భూముల వివరాలు నమోదు చేసి రైతులకు పాస్ పుస్తకాలు అందజేయాలని కొన్ని నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ కోసం మీ సేవలో ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించి సంబంధిత పత్రాలు అందజేసి స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా గంటల వ్యవధి లోనే పాసు పుస్తకాలు అందజేయడానికి చర్యలు తీసుకుంది. అయితే పలు సాంకేతిక పరమైన లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. కొంతమందికి రిజిస్ట్రేషన్ కావడంలో సమస్యలు ఎదరైతే మరికొంత మందికి పాస్ బుక్ లలో దొర్లిన తప్పుల సవరణ సరి చేసుకోవడం సవాల్ గా పరిమణమించింది . ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా తప్పుల సవరణలు కాకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.

చెప్పులరిగేలా తిరిగినా

రాష్ట్రంలో ధరణి పోర్టల్ మొదలైన నాటి నుండి రైతులకు మేలు కంటే చెడే ఎక్కువ జర్గిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ల సందర్భంగా జరుగుతున్న తప్పులు వారికి కంట నీరు తెప్పిస్తున్నాయి. ఆన్ లైన్ లో తప్పుల సవరణ కోసం నిర్ధేశించిన డబ్బులు చెల్లించినప్పటికీ వారి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులకు పరిష్కారం చూపడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుగా నమోదైన పేర్లు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వంటి వాటి సవరణ , పాస్ బుక్‌ల జారీ కోసం రైతులు తహశీల్ధార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయినా వారి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ధరణి పోర్టల్ మొదలు కాకముందు చిన్న చిన్న సమస్యలు ఇట్టే పరిష్కారమయ్యేవి. అందుబాటులోకి వచ్చాక రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. సమస్య చిన్నదైనా, పెద్ద దైనా నెలల తరబడి సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని వారు వాపోతున్నారు.

పేరు సవరణ కోసం

గోగిరెడ్డి లక్ష్మారెడ్డి -మియాపూర్

నాకు మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామంలోని సర్వే నెంబర్ 728/ఎ2 సర్వే నెంబర్‌లో 0.0414 గుంటల స్థలం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దీని కన్సిడరేషన్ వాల్యూ రూ 1,31,200 ఉండగా మార్కెట్ వ్యాల్యూ రూ 3,31,200 గా ఉంది. నా పేరు గోగిరెడ్డి లక్ష్మారెడ్డి కాగా, పట్టాదారు పాసుపుస్తకంలో పేరు స్థానంలో ‘‘ ళాఆ’’ గా తండ్రి పేరు స్థానంలో ‘‘ ఖృఈష్ణా’’గా తప్పు దొర్లింది. దీనిని సవరించుకునేందుకు గాను గత ఏడాది నవంబర్ నుండి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను . తప్పు సవరణ కోసం ప్రభుత్వం నిర్ధేశించిన రూ 20,450 గత సంవత్సరం నవంబర్ 2వ తేదీన ఆన్ లైన్ లో చెల్లించాను . నేటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తహశీల్ధార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా . సీఎంఓ, సీఎస్, సీసీఎల్ఏలకు వందలాది ఫిర్యాదులు చేశాను . ఫలితం లేకుండా పోవడంతో మంత్రి కేటీఆర్ కు వాట్సాప్, ట్విట్టర్‌లో ట్వీట్ కూడా చేశాను . అయినా నేటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ధరణి మొదలయ్యాక మహేశ్వరం మండలంలో మొదటి చెల్లింపు నేనే చేశాను . అయినా నేటికి దొర్లిన తప్పు సరి కాలేదు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను నేనింత వరకు చూడలేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోదు, ధరణి అంతా ఓ ట్రాష్.

Advertisement

Next Story