అన్నదాత ఆగం.. ‘మద్దతు’ నిల్లు.. ధరలు మాత్రం ఫుల్లు

by Shyam |   ( Updated:2021-04-08 22:27:01.0  )
అన్నదాత ఆగం.. ‘మద్దతు’ నిల్లు.. ధరలు మాత్రం ఫుల్లు
X

దిశ,తెలంగాణ బ్యూరో : రైతు నెత్తిన పిడుగు పడేలా ‘ఇఫ్కో‘ (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పోరేషన్ కో-ఆపరేటీవ్ లిమిటెడ్ కాంప్లెక్స్) ఎరువుల ధరలను గణనీయంగా పెంచింది. డీఏపీ, నైట్రోజన్, పొటాషియం కాంప్లెక్స్ ఎరువుల ధరలను గతేడాదితో పోలిస్తే భారీగా పెంచింది. 2019 అక్టోబరులో యాభై కిలోల డీఏపీ ధర మార్కెట్‌లో రూ. 1200 ఉంటే ఇప్పుడు దాన్ని రూ. 1900కు పెంచింది. ఎన్‌పీకే పేరుతో పిలిచే మూడు రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను కూడా భారీగానే పెంచింది.ఈ నెల 1వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వచ్చినట్లు ‘ఇఫ్కో‘ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటికే స్టాకులో ఉన్న ఎరువుల ధరలను మాత్రం పాత విధానం ప్రకారమే అమ్ముకోవచ్చంటూ డిస్ట్రిబ్యూటర్లకు స్పష్టం చేసింది.

గత రెండేళ్లుగా యూరియా ధరలు పెరుగుతూనే వస్తున్నా ఇప్పుడు కరోనా సమయంలోనూ భారీ స్థాయిలో పెంచింది. ‘ఇఫ్కో‘ తాజా ధరల పెంపుతో వ్యవసాయం మరింత భారంగా మారింది. కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతులకు కొత్త ధరలు గుదిబండలా మారాయి. 2019లో ఎన్‌పీకే (10-26-26) ధర మార్కెట్‌లో ఒక టన్నుకు రూ. 23,500 ఉంటే, ప్రస్తుతం రూ.35,000కు పెరిగింది. రెండేళ్ల వ్యవధిలోనే రూ.11,500 మేర పెరిగింది. గిట్టుబాటు ధర పెరగకపోయినప్పటికీ సేద్యం ఖర్చులు మాత్రం రకరకాల పేర్లతో భారీగానే పెరుగుతున్నాయి. ఒకవైపు వ్యవసాయ కూలీలకు ఇచ్చే రేట్లు పెరిగాయనుకుంటున్న సమయంలో ‘ఇఫ్కో‘ పిడుగు లాంటి వార్తను మోసుకొచ్చింది.

యూరియా, 20-20 పొటాష్ నాట్లు వేశాక ఒకసారి, నాట్లు పిలకలు వచ్చాక ఒకసారి, కాయ వచ్చే ముందు మరోసారి మూడు సార్ల చొప్పున రైతులు వినియోగిస్తుంటారు. ఒక ఎకరం వరి పంటకు ఒకసారి 50 కిలోల బస్తాలను మూడింటిని వాడాల్సి ఉంటుంది. పంట దిగుబడుల్లో కీలకంగా ఉండే యూరియా రైతులకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. క్రమం తప్పకుడా దీన్ని వాడుతూ ఉంటారు. ఒక ఎకరానికి 3 బస్తా (ఒక్కోదాంట్లో 50 కిలోలు)ల చొప్పున రైతుకు రూ. 5,700 వరకు ఖర్చు అవుతుంది. పంట కాలంలో మూడుసార్లు యూరియాను వినియోగిస్తే రైతుకు రూ.17,100 మేర ఖర్చవుతుంది.

ఏప్రిల్ 1 నుంచి ‘ఇఫ్కో‘ ప్రకటించిన ఎరువుల కొత్త ధరలు :

ఎరువు రకం టన్ను 50కిలోల బస్తా..

డీఏపి రూ.38,000 రూ.1900
ఎన్‌పికె 10-26-26 రూ.35,500 రూ.1775
ఎన్‌పికె 12-32-16 రూ.36,000 రూ.1800
ఎన్‌పికె 20-20-0-13 రూ. 27,000 రూ.1350
ఎన్‌పికె 15-15-15 రూ.30,000 రూ.1500

2109లో యూరియా ధరలు:

ఎరువు టన్ను 50కిలోల బస్తా..

డీఏపి రూ.24,000 రూ.1200
ఎన్‌పికె 10-26-26 రూ.23,500 రూ.1175
ఎన్‌పికె 12-32-16 రూ.23,700 రూ.1185
ఎన్‌పికె 20-20-0-13 రూ. 18,500 రూ.925
నీలమ్ కోటెడ్ యూరియా రూ.5,922.22 రూ.266.50

Advertisement

Next Story