కరోనా నివారణకు రైతాంగం సహకరించాలి : ఎస్పీ రంగనాథ్

by vinod kumar |

దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారి నివారణకు రైతాంగం ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ రైతులను కోరారు. శనివారం నల్లగొండ పట్టణం ఆర్జాలబావి, శెట్టిపాలెం పరిధిలోని వసంత రైస్ మిల్లులోని ఐకేపీ కేంద్రాలను ఆయన పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. పలువురు రైతులతో ఆయన నేరుగా మాట్లాడి సౌకర్యాల ఏర్పాట్లు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధాన్యం తూకం కాంటాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేసే సమయంలో మోసాలకు పాల్పడవద్దన్నారు. తూకం విషయంలో ఎవరైనా మోసం చేసినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐకేపీ కేంద్రాలకు వచ్చే ధాన్యం కొనుగోళ్లు, లోడింగ్ వెంటనే జరిగేలా చూడాలన్నారు. హమాలీల కొరత లేకుండా మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో దళారుల ప్రమేయం ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ మహబూబ్ బాషా, మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐ నర్సింహులు, సుధీర్ పాల్గొన్నారు.

Tags: farmers, rice collecting, marketing, lockdown, sp ranganath

Advertisement

Next Story

Most Viewed