‘బెదిరించడం సరికాదు.. రైతుక్లబ్‌లు ఏర్పాటు చేయాలి’

by Shyam |
‘బెదిరించడం సరికాదు.. రైతుక్లబ్‌లు ఏర్పాటు చేయాలి’
X

దిశ, మెదక్: ఇటీవల రైతుబంధు విషయంలో సీఎం కేసీఆర్ అన్న మాటలకు రాష్ర్టవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఏ పంట వేయాలో రైతులకే వదిలేయాలని పలువురు రాజకీయ నాయకులు సైతం విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. తాజాగా బుధవారం లోక్‌సత్తా పార్టీ నాయకులు కూడా దీనిపై స్పందించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా, భూసార పరీక్షలు చేయకుండా, మార్కెటింగ్ సౌకర్యం లేకుండా ప్రభుత్వం సూచించిన పంటలకే రైతుబంధు నిధులు మంజూరు చేస్తామని బెదిరించడం చిన్న, సన్న కారు రైతుల మనోధైర్యాన్ని దెబ్బ తీయడమే అని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గ్రామాన్ని లేదా 2500 ఎకరాల భూమి చొప్పున యూనిట్‌గా తీసుకొని ‘రైతుక్లబ్’ లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో పంటసాగును రైతుక్లబ్‌లు నిర్ణయించేలా చూడాలన్నారు. పంటల సాగు నిర్ణయం, పంటల నమోదు, భూసార పరీక్షలు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, యూరియా, పశు సంరక్షణ, ధాన్యం ఆన్ లైన్ ట్రేడింగ్ కొనుగోళ్ళు మరియు అమ్మకాలు వంటి భాద్యతలను రైతుక్లబ్‌0లకే అప్పగించాలని తుమ్మనపల్లి డిమాండ్ చేశారు. గత రబీ సీజన్‌లో కొంతమంది రైతులకు అందాల్సిన రైతుబంధు పైసలు నేటివరకూ అందలేదని ఆయన అన్నారు. అంతేగాకుండా మొదటి విడతలో సాంకేతిక, ఇతర అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన రైతులకు కూడా ఇంతవరకూ రైతుబంధు నిధులు బ్యాంక్ ఖాతాల్లో జమ కాలేదని ఇప్పటికైనా రెండో విడతతో కలిపి వెంటనే విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story