కాయగూరలే కాపాడుతయ్

by Shyam |
కాయగూరలే కాపాడుతయ్
X

దిశ, న్యూస్ బ్యూరో: ‘ఇకపై రాష్ట్రంలో రైతులు.. తమకు ఇష్టమొచ్చిన పంటలు పండించొద్దు. ప్రభుత్వం సూచించిన, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవలంబించాల్సిన అవసరముంది’ అని సీఎం కేసీఆర్ పదే పదే ప్రెస్‌మీట్లలో చెబుతున్న సంగతి తెలిసిందే. అంటే.. ఏ పైరుకు మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువ ? ఏ రకం భూమిలో ఏం పంటలు వేయాలి ? వంటి విషయాలను విశ్లేషించి.. ఆ ప్రకారంగా సాగు విధానాలను అవలంభించడం. సాధారణంగా రైతులు.. తమ పక్క పొలం వారు ఏ పంట సాగు చేస్తే, అదే ఫాలో అవుతుంటారు. అలా ఒకరు మక్కలేశారంటే.. ఆ ఊరి నిండా మక్కలే. సాగు నీరు అందుబాటులో ఉంటే.. అందరిదీ వరి సాగే. ఇలా అంచనాల్లేకుండా ఏ పంటలు వేసినా.. మార్కెట్‌లో డిమాండ్‌ లేక మరోవైపు గిట్టుబాటు ధర లభించక రైతు నట్టేట మునగడం ఖాయం. ప్రస్తుత గ్రామీణ వ్యవసాయ ముఖచిత్రం ఇదే విషయాన్ని ప్రతిభింబిస్తోంది. మరి ప్రతీ రైతు.. మార్కెట్‌లో ఏ పంటకు డిమాండ్‌ ఉన్నదో అంచనా వేయడం కష్టమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలవారీగా ప్రణాళికలు రూపొందించేందుకు సమీక్షలు, చర్చలు, విస్తృత స్థాయి భేటీలను నిర్వహించడం మంచి పరిణామం. కానీ మార్కెట్‌ డిమాండ్‌ కేంద్రీకృతంగానే ప్రణాళికలు ఉండాలని శాస్త్రవేత్తలు, రైతులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌ మహానగర జనాభా కోటికి పై మాటే. అలాగే వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి నగరాల్లోనూ జనాభా ఎక్కువే. ఈ నగరాల జనాభాకు సరిపడా కూరగాయల్లో అధిక శాతం ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్ నగరానికి ఏటా 2 లక్షల టన్నుల కూరగాయలు దిగుమతి అవుతున్నాయని మార్కెటింగ్‌ శాఖ అంచనా. వీటిల్లో 70 శాతం వరకు పొరుగు రాష్ట్రాల నుంచే. దీంతో కూరగాయల డిమాండ్‌ను ఇక్కడి రైతాంగం సద్వినియోగం చేసుకోవడం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌, ఉత్పత్తికి మధ్యనున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం, రైతాంగం గుర్తిస్తే ప్రయోజనాలు నెరవేరుతాయని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూరగాయల సాగుకు అనుకూలమైన భూములే ఉన్నాయని, వర్షాభావ పరిస్థితుల్లోనూ కూరగాయల సాగుతో గిట్టుబాటు లభిస్తుందంటున్నారు. కాగా ఏయే జిల్లాల్లో.. ఏయే పంటలు సాగు చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించనున్న ప్రభుత్వం.. ప్రధానంగా మార్కెటింగ్‌, గిట్టుబాటుపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.

అనుకూల నేలల స్వభావం

తెలంగాణలోని వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం.. కూరగాయలు, పండ్ల తోటల సాగుకు అనుకూలమని తెలంగాణ విశ్వవిద్యాలయ కూరగాయల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తేలికపాటి నేలల ఉదజని సూచిక 5 నుంచి 7 వరకు ఉంటే అవి మంచి నేలలే. ప్రపంచంలో అత్యధికంగా సాగు చేసే కూరగాయల్లో ఆలుగడ్డ, చిలగడదుంప తర్వాతి స్థానంలో టమాటా ఉండగా.. దేశంలో టమాటాను అత్యధికంగా పండించే రాష్ట్రం కర్నాటక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 83100 హెక్టార్ల విస్తీర్ణంలో టమాటా సాగుచేస్తే 19.0 టన్నుల దిగుబడి వచ్చేది. కానీ డిమాండ్‌ మాత్రం నాలుగింతలుగా ఉంది. టమాటాను ఇసుకతో కూడిన గరప నేలలతో పాటు బరువైన బంక నేలల వరకు అన్ని రకాల నేలల్లో సాగు చేయొచ్చు.

అవసరం ఎంత?

గ్రేటర్ హైదరాబాద్‌లో కుటుంబాల సంఖ్య : 26.33 లక్షలు, మొత్తం జనాభా- 99.36 లక్షలు. వలస కార్మికులు, అతిథుల సంఖ్య కలిపితే కోటి పైమాటే ! సగటున నలుగురు సభ్యులున్న కుటుంబంలో రోజుకు కూరగాయల వినియోగం : అరకిలో, ఏడాదిలో కూరగాయల వినియోగం: 1,81,405 టన్నులు

డ్రిప్‌ సిస్టమ్ ఇవ్వాలి : మొద్దు అంజిరెడ్డి, ఉత్తమ రైతు, శేరిగూడ, ఇబ్రాహింపట్నం, రంగారెడ్డి జిల్లా.

రంగారెడ్డి జిల్లాలో నీళ్లు లేవు. పత్తికి కూడా అనుకూలం కాదు. పత్తి వేస్తే వారానికొక్కసారైనా తడి తాకాలి. ఆ అవకాశం లేదు. మక్కలదీ అదే పరిస్థితి. జొన్నలు, సజ్జలకు అనుకూలం. కానీ లేబర్‌ సమస్య తీవ్రంగా ఉంది. డ్రిప్‌ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తే కూరగాయల సాగు బాగుంటుంది. నేను మూడెకరాల్లో సాగుచేసిన పత్తి పంటకకు డ్రిప్‌ సిస్టమ్ పెట్టిన. అందుకే ఎకరాకు 22-25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. అలాగే ఆముదాల సాగులోనూ ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించిన. అందుకే మూడుసార్లు ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. నీళ్లు లేక ఇప్పుడా పరిస్థితులు లేవు. అందుకే కూరగాయల సాగుతోనే రైతులకు మేలు కలుగుతుంది.

మార్కెటింగ్‌ రైతు సొసైటీలు ఏర్పాటు చేయాలి : మల్‌రెడ్డి శంకర్‌రెడ్డి, ఆదిబట్ల, ఇబ్రాహింపట్నం, రంగారెడ్డి జిల్లా

నీటి సదుపాయం ఉంటేనే వరిసాగు. మక్కలకు రేటు లేదు. డిమాండ్‌ లేని పంటలు వేస్తే కొనండని బతిమిలాడాల్సి వస్తోంది. అందుకే హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి జిల్లాల రైతాంగానికి కూరగాయల సాగుతోనే లాభం. వరి వేస్తే తెలంగాణ సోనా రకం ద్వారా ప్రయోజనం. ఐతే రైతులకు మార్కెటింగ్‌ సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి. ఇప్పుడున్న కో ఆపరేటివ్‌ సొసైటీల్లో రాజకీయమే ఉంది. అలా కాకుండా నిజమైన రైతులను భాగస్వాములను చేయాలి. మార్కెటింగ్‌ బాధ్యతలను అప్పగించాలి. సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయడానికి ముందు మార్కెట్‌ను అధ్యయనం చేయాలి.

Advertisement

Next Story