దుబ్బాకలో విషాదం.. కొనుగోలు కేంద్రంలోనే ఆగిపోయిన రైతు గుండె

by Sridhar Babu |   ( Updated:2021-11-19 01:31:56.0  )
farmer-died-at-paddy-porcur
X

దిశ, దుబ్బాక: కొనుగోలు కేంద్రంలో వడ్లు ఎగబోస్తుండగా గుండె పోటుతో రైతు మృతి చెందిన సంఘటన ధర్మాజీపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ రాములు (43) అనే రైతు తన వ్యవసాయ పొలంలో పండించిన వరి ధాన్యాన్ని అమ్మడానికి మెప్మా కొనుగోలు సెంటర్లలో ఆరబోసి గురువారం రాత్రి ఎగబోస్తుండగా కుప్పకూలాడు. వెంటనే అతడిని 108 వాహనంలో దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతు రాములు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలపడంతో వారి కుటుంబం, బంధువులు బోరున విలపించారు.

కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆరబెట్టడానికి వచ్చిన రాములు ఒకేసారి గుండెపోటుతో మృతిచెందడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. అయోమయానికి గురవుతున్నారు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ చెప్పడం.. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయాలంటూ ధర్నాలు చేయడం.. వీటన్నింటిని చూసిన రైతు ఒకేసారి గుండెపోటుతో మృతి చెందడంతో రైతులంతా కలత చెందుతున్నారు. మృతునికి భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కౌన్సిలర్ స్వామి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద గుండె పోటుతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు.

Advertisement

Next Story