MRO ఆఫీసులో రైతుల ఆత్మహత్యాయత్నం..

by Shyam |   ( Updated:2020-08-26 10:11:11.0  )
MRO ఆఫీసులో రైతుల ఆత్మహత్యాయత్నం..
X

దిశ, హుస్నాబాద్: తమకు న్యాయం చేయాలని కోరుతూ గత కొంతకాలంగా రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నా, వారు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన ఓ రైతు, అతని కూతురు తహశీల్దార్ ఆఫీసులో ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలోని ఎమ్మార్వో ఆఫీసులో బుధవారం వెలుగులోకి వచ్చింది.

బాధితుల కథనం ప్రకారం.. కొహెడ మండలం చెంచరువుపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతి రెడ్డికి ఇద్దరు కూతుర్లు కలరు. అయితే, తన పేరు మీద ఉన్న 1.30 ఎకరాల వ్యవసాయ భూమిని ఇంటి దగ్గర ఉంటున్న తన కూతురు స్వరూప పేరిట రాశారు. అయితే, రెవెన్యూ అధికారుల అండ దండలతో వెంకటరెడ్డి అనే వ్యక్తి తన పేరుమీద ఆ భూమిని పట్టాచేయించుకున్నాడు. బాధితులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

2011 నుంచి తమకు న్యాయం చేయాలని తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బాటిల్ వెంట తెచ్చుకున్న తిరుపతిరెడ్డి, తన కూతురు స్వరూప ఎమ్మోర్వో ఆఫీసులోని ఓ గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో వెంటనే స్పందించిన రెవెన్యూ, పోలీసులు ఉన్నతాధికారులు తిరుపతిరెడ్డి భూమిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని తహశీల్ధార్ రుక్మిణీ బాధిత రైతులకు హామిఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed