12 ఏళ్ల చిన్నారి.. మూగజీవాల కోసం రూ.70వేల విరాళాల సేకరణ

by Sujitha Rachapalli |
12 ఏళ్ల చిన్నారి.. మూగజీవాల కోసం రూ.70వేల విరాళాల సేకరణ
X

దిశ వెబ్ డెస్క్ : కరోనా వైరస్ కారణంగా దేశమంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది పేదలు, నిరాశ్రయుల కోసం సహృదయులు ముందుకు వస్తున్నారు. వారికి ఏదో విధంగా ఆహారం అందిస్తున్నారు. కానీ వీధుల్లో నివసించే మూగ జీవాల పరిస్థితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడా తిండి దొరకక అవి అలమటించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 12 ఏళ్ల చిన్నారి ఆ మూగ జీవాల కోసం ఆలోచించింది. వాటి ఆకలి తీర్చాలనుకుంది. అందుకోసం కుంచెపట్టి బొమ్మలు వేస్తోంది. వాటిని అమ్ముతూ ఇప్పటికే 70 వేల రూపాయల విరాళాలు సేకరించింది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరాఖాన్ కూతురు అన్య.

దేశ ప్రజలంతా ఒక్కటై కరోనా పై యుద్ధం చేస్తున్నారు. ఈ పోరులో వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, సహృదయులు వారితో పాటు ఎంతో మంది అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. మరెంతో మంది కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకొందరు మూగజీవాల ఆకలి తీర్చడానికి సాయం చేస్తున్నారు. యాంకర్ రష్మీ కూడా మూగ జీవాల పరిస్థితి చూసి కన్నీటి పర్యంతమైంది. తానే స్వయంగా వీధుల్లో తిరిగి మూగ జీవాలకు ఆహారం అందించింది. ఇలా ఎందరో జంతు ప్రేమికులు వాటికోసం పరితపిస్తూ.. ఆహారం అందిస్తున్నారు. 12 సంవత్సరాల అన్య కూడా ఈ విషయంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.

మండుటెండ‌లో తిండీ, నీళ్లు దొర‌క్క మూగ జీవాలు ప్రాణాలు కోల్పోకూడదని ఆ చిన్నారి నిశ్చ‌యించుకుంది. అందుకోసం మూగ‌జీవాల చిత్రాల‌ను గీసి వాటిని అమ్మకానికి పెట్టింది. ఒక్కో చిత్రాన్ని రూ.1000 చొప్పున అమ్మింది. అలా కేవలం ఐదు రోజుల్లోనే రూ.70 వేల వ‌ర‌కు విరాళాల‌ను సేక‌రించింది. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ ఫ‌రాఖాన్ ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. త‌న కూతురు అన్య డ్రాయింగ్ ద్వారా సేకరించిన డబ్బు మొత్తాన్ని వీధి జంతువుల‌కు ఆహారాన్నందించేందుకు వినియోగించ‌నున్నట్లు పేర్కొంది. పెంపుడు జంతువుల చిత్రాల‌ను గీయ‌మ‌ని ఆర్డ‌ర్లు ఇచ్చిన‌ వారితోపా‌టు, విరాళాలిచ్చిన‌వారికి క‌త‌జ్ఞ‌త‌లు తెలిపింది. అన్య ఒక్కరే కాదు.. చాలా మంది చిన్నారులు తమ కిడ్డీ బ్యాంకుల్లో, గల్లా పెట్టెల్లో, ప్యాకెట్ మనీగా దాచుకున్న డబ్బులను విరాళంగా అందిస్తూ.. పెద్దవాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags : corona virus, lockdown, animals, street dogs, food, charity, anya, farah khan

Advertisement

Next Story

Most Viewed