పాపం.. కరోనా అమరులకు అది ఇయ్యలేదంట

by  |
పాపం.. కరోనా అమరులకు అది ఇయ్యలేదంట
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న వైద్య సిబ్బందిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద వీరి కుటుంబాలకు తలా రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందాలి. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కుటుంబానికి కూడా ఆ పరిహారం అందలేదు. వివిధ దశల్లో అది ప్రాసెస్‌లో ఉందనే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో చనిపోయిన కొద్దిమంది వారియర్లకు ఇప్పటివరకూ డెత్ సర్టిఫికెట్ కూడా రాలేదు. వారాలు గడుస్తున్నా రకరకాల కారణాలతో ఆ సర్టిఫికెట్ల జారీ ముందుకు సాగడంలేదు. ఆ సర్టిఫికెట్లు వస్తే క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుందామని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బందిగా ఉన్న వీరి కుటుంబాలను సకాలంలో ఆదుకోడానికి చొరవ తీసుకుని ప్రాసెస్ పనులను వేగంగా చేయాల్సిన వైద్య విద్య విభాగం కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.

ఒకటిన్నర నెల రోజులు గడుస్తున్నా బీమా పరిహారం మాత్రం అందలేదు. కరోనా సమయంలో అనేక త్యాగాలు చేస్తూ వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకు వేసి ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మార్చి నెలలో చప్పట్లు కొట్టడం, ఆ తర్వాత దీపాలు వెలిగించడం లాంటివాటిలో పాల్గొన్నారు. కానీ విధి నిర్వహణలో కరోనా బారిన పడి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలను ఆదుకోవడంలో మాత్రం తగినంత శ్రద్ధ చూపలేదని ఎనిమిది మంది కుటుంబాల పరిస్థితి గమనిస్తే స్పష్టమవుతుంది.

అక్షర దోషాన్నిసరిదిద్దడానికి ఒకటిన్నర నెల రోజులు

నగరంలోని చెస్ట్ ఆసుపత్రిలో చనిపోయిన సీనియర్ నర్సు విక్టోరియా జయమణికి డెత్ సర్టిఫికెట్ జారీ చేయడానికి నెల రోజులు పట్టింది. దాని ఆధారంగా బీమా కోసం దరఖాస్తు చేసుకున్న క్రమంలో భర్త పేరులో వచ్చిన ఒక్క అక్షర దోషం కారణంగా క్లెయిమ్ కావడానికి జాప్యం జరిగింది. సర్వీసు రికార్డుల్లో ఉన్న పేరును సరిగ్గా రాయడంలో సిబ్బంది చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి స్వయంగా ఆమె భర్త దరఖాస్తు చేసుకున్నతర్వాత పదిహేను రోజులు గడిచినా ఇంకా సవరించిన డెత్ సర్టిఫికెట్ రాలేదు. జూన్ 26న ఆమె ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ చనిపోతే ఆగస్టు 14వ తేదీ నాటికి కూడా డెత్ సర్టిఫికెట్ జారీ కాలేదు. మిగిలినవారి విషయంలోనూ రకరకాల కారణాలతో డెత్ సర్టిఫికెట్ రావడానికి నెల రోజుల కంటే ఎక్కువ సమయమే పట్టింది. పోస్టుమార్టం రిపోర్టు రాలేదని, ఆ కారణంగా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేమని, కుటుంబ సభ్యుల వివరాలు అందలేదు కాబట్టి నామినీగా ఎవరిని పెట్టాలో తెలియలేదని, కుటుంబ సభ్యుల్లో ఇంకొకరికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నందున ఆ వివరాలను పేర్కొనాల్సి ఉంటుందని, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి బీమా పరిహారం లబ్ధిదారుల కోవలోకి వస్తారో రారో తెలియదని.. ఇలా అనేక కారణాలతో బీమా సంస్థకు క్లెయిమ్ చేయడంలో జాప్యం జరుగుతోంది.

కుటుంబ సభ్యులకు అందని సమాచారం

కరోనా విధుల్లో ఉంటూ చనిపోయిన వైద్య సిబ్బందికి అందాల్సిన పరిహారం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేనప్పటికీ తగిన డాక్యుమెంట్లను సదరు బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా సకాలంలో అందించాల్సి ఉంటుంది. కానీ ఫార్మాలిటీస్ పేరుతో వైద్యారోగ్య సిబ్బంది మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో వైద్య విద్య శాఖ ద్వారా చివరకు కావాల్సిన ఈ ప్రక్రియ ఎక్కడిదాకా వచ్చిందో కుటుంబ సభ్యులకు సరైన సమాచారమే అందడంలేదు. సర్వీసులో ఉన్న వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాలకు సకాలంలో తగిన సహాయ సహకారాలు ఇవ్వాల్సిన ప్రభుత్వ విభాగాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. క్లెయిమ్ ఎలా చేసుకోవాలో ఆ కుటుంబ సభ్యుల్లో అవగాహన లేనప్పుడు ప్రభుత్వ సిబ్బందే వారిని గైడ్ చేస్తుండాలని, కానీ అలాంటి సహకారమేదీ ప్రభుత్వం నుంచి లభించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున అందని ఎక్స్‌గ్రేషియా

కరోనా విధుల్లో ఉంటూ చనిపోయిన వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ తరపున రూ.50 లక్షల మేర పరిహారం అందుతుంది. కానీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉంటూ చేసిన సేవలకు గుర్తింపుగా తన వంతుగా కోటి రూపాయల సాయాన్ని అందిస్తోంది. డాక్టర్ జావీద్ ఆలీ, డాక్టర్ ఆశిమ్ గుప్త తదితరులకు గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటించిన కోటి రూపాయల చెక్కు కుటుంబ సభ్యులకు అందింది. ఒడిషా ప్రభుత్వం సైతం రాష్ట్రం తరపున కరోనా వారియర్లు చనిపోతే రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వం సైతం తన వంతుగా రూ.50 లక్షలను ప్రకటించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు అలాంటి సాయాన్ని ప్రకటించలేదు.

పుట్టెడు శోకంలోనూ పడిగాపులు

సర్కారు ఆసుపత్రుల్లో సామాన్యులకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ప్రజలు మొత్తుకుంటే మంత్రి, అధికారులు మాత్రం దాన్ని అవాస్తవమంటూ కొట్టిపారేస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా బారిన పడిన ల్యాబ్ టెక్నీషియన్ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి వస్తే గేటు దాటి లోపలకు కూడా వెళ్లలేకపోయారు. ప్రభుత్వ వైద్యులకు మాత్రమే ఇక్కడ కరోనా చికిత్స తప్ప ల్యాబ్ టెక్నీషియన్‌కు కాదంటూ ఆర్ఎంవో చికిత్స అందించడానికి నిరాకరించారు. చివరకు చేసేది లేక అదే అంబులెన్సులో మళ్లీ వరంగల్ ఎంజీఎంకు వెళ్లాల్సి వచ్చింది. చికిత్స విషయంలోనే ఇలా ఉంటే ఇక బీమా పరిహారం విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందనే ఆశలు లేవని ప్రభుత్వ ల్యాబ్ టెక్నీషియన్ల అసోసియేషన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. మృతుని కుమారుడు ఇంకా చదువుకుంటూ ఉన్నారని, మృతుని భార్యకు డెత్ సర్టిఫికెట్ తీసుకోవడం, క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం లాంటివేవీ తెలియదని, ఇలాంటిప్పుడు గైడ్ చేయాల్సిన ఆసుపత్రి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదని ఆ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ క్లెయిమ్ దరఖాస్తు ఎక్కడిదాకా వచ్చిందో ఆ కుటుంబానికి సమాచారమే లేదని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వానిదీ అదే తీరు

దేశం మొత్తం మీద ఎంతమంది వైద్య సిబ్బంది చనిపోయారనే గణాంకాలను కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించడం లేదు. జూలై 31 నాటికి వివిధ రాష్ట్రాల్లో చనిపోయిన వైద్య సిబ్బంది తరపున న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి 131 క్లెయిమ్ దరఖాస్తులు వస్తే అందులో 64 క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల మొదటి వారంలో ఢిల్లీలో ప్రకటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఆగస్టు మొదటి వారానికే 175 మంది డాక్టర్లు, 40 మంది నర్సులు చనిపోయినట్లు తేలింది. ఇక కరోనా విధుల్లో ఉన్న వైద్యారోగ్య శాఖకు చెందిన పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు… లాంటి వారియర్లు చాలా మందే చనిపోయారు. కానీ ఆయా రాష్ట్రాలు గణాంకాలను సేకరించి వెల్లడించడంలో కేంద్రం కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.

రాష్ట్రంలో చనిపోయిన కరోనా వారియర్లు

– హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రికి చెందిన సీనియర్ నర్సు విక్టోరియా జయమణి – జూన్ 26న చనిపోయారు. ఇప్పటికీ బీమా పరిహారం అందలేదు.
– వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ ఖుర్షీద్ – ఆగస్టు 1న మృతి. పరిహారం అందలేదు.
– హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ గోవర్ధన్ – జూలై 25న మృతి. పరిహారం అందలేదు.
– హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ నాగరాజు – ఆగస్టు 6న మృతి – డెత్ సర్టిఫికెట్ కూడా రాలేదు.
– హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న మేల్ నర్సింగ్ ఆర్డర్లీ సంజీవ్ – జూలై 11న మృతి – పరిహారం అందలేదు.
– హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న దోభీ రాజ్‌కుమార్ – జూలై 10న మృతి – పరిహారం అందలేదు.
– కొత్తగూడెం జిల్లా పర్ణశాలలో పనిచేస్తున్న డాక్టర్ నరేశ్ – ఆగస్టు 7న మృతి – పరిహారం అందలేదు.
– గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు – జూలైలో మృతి – కానీ కేంద్ర ప్రభుత్వ బీమా జాబితాలోకి వస్తారో లేదో ఇప్పటికీ తేలని స్పష్టత.



Next Story