- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఉద్యోగుల బదిలీల్లో సిత్రాలు.. నకిలీ సర్టిఫికెట్ల కలకలం.. తలపట్టుకున్న సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో : ‘అయ్యా, మేమంతా రోగాల పుట్టలం. ఉన్న దగ్గర నుంచి కదలలేం. మమ్ములను ఇక్కడ నుంచి బదిలీ చేయకండి. దయ ఉంచి ఇక్కడే కొనసాగించండి’ జోనల్ కేటాయింపుల సందర్భంగా ఉన్నతాధికారులకు ఉద్యోగులు పెట్టుకున్న వినతుల సారాంశం ఇది. కోరుకున్న చోటనే ఉండడానికి ప్రతీ వంద మందిలో 70 మంది ఉద్యోగులు ఇలాంటి అర్జీలే పెట్టుకోవడంతో ఉన్నతాధికారులు కంగు తిన్నారు. ఉద్యోగుల్లో ఇంత మంది వ్యాధిగ్రస్తులున్నారా? అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ విషయం సీఎస్ మొదలుకుని ఆయా శాఖల ఉన్నతాధికారుల దాకా నమ్మకం కుదరడం లేదు.
దీంతో అత్యధికంగా వచ్చిన రెండుశాఖల్లో ఈ తతంగం మీద విచారణకు ఆదేశించారు. ఇంత మందికి నిజంగానే రోగాలున్నాయా? వీరిని పరీక్షించిందెవరు? సర్టిఫికెట్లు ఇచ్చింది ఎవరు? అనే అంశాలపై ఆరా తీయాలని సూచించారు. వరంగల్ జిల్లాలోని ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్టు ప్రాథమికంగా గుర్తించారని ప్రభుత్వ వర్గాల టాక్. ఎంతో కొంత ఉన్న రోగాలను అత్యధికంగా చూపించుకునేందుకు ఈ సర్టిఫికెట్లను సమర్పించినట్టు తెలుస్తున్నది. ఈ ధ్రువీకరణ పత్రాలపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటూ తిరిగి పంపించారు. ప్రస్తుతానికి రెండు శాఖలకు సంబంధించిన ఈ ధ్రువీకరణ పత్రాలు పరిశీలన కోసం హెచ్‌వోడీలకు వెళ్లాయి.
కాలి వేలి నుంచి కండ్ల దాకా..!
ఉద్యోగుల జిల్లాలు, జోనల్ కేటాయింపుల సందర్భంగా ఆప్షన్ల ప్రక్రియ ముగిసి అలాట్‌మెంట్ ఆర్డర్ల పంపిణీ ప్రక్రియ మొదలైంది. ఆదివారం ఆప్షన్ల పత్రాలను పరిశీలించిన ఉన్నతాధికారులు ఉద్యోగులు సమర్పించిన సర్టిఫికెట్లను చూసి నోరెళ్లబెట్టారు. అన్ని శాఖల్లో 70 శాతం మంది ఉద్యోగులు తాము అనారోగ్యంతో ఉన్నట్లు మెడికల్సర్టిఫికెట్లు ఇచ్చారు. దీనిలో ఎక్కువగా నరాల బలహీనతలు, ఆస్తమా, శ్వాసకోస సంబంధిత రోగాలు, మధుమేహం, బీపీ, మోకాళ్ల నొప్పులు, కంటిచూపు మందగించడం వంటి రోగాలకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించారు. మెడికల్ గ్రౌండ్‌లో తమను వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాల్లోకే బదిలీ చేయాలని, దీర్ఘాకాలిక వ్యాధులతో సతమతమవుతున్నట్లు విన్నవించుకున్నారు.
పరిశీలించండి..
చాలా శాఖల్లో ఇలాంటి సర్టిఫికెట్లు వచ్చాయి. దీనిలో భాగంగా ముందుగా వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖలో ఇలాంటి సర్టిఫికెట్లను పరిశీలించాలని ఉన్నతాధికారులు తిప్పి పంపారు. దీంతో ఈ శాఖల్లో ఇప్పుడు అనారోగ్య సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతున్నది. వీటితో పాటుగా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను సైతం విచారించాలని, సంబంధిత శాఖల హెచ్ఓడీలు వీటిని సర్టిఫై చేయాలంటూ ఆదేశాలిచ్చారు. దీనిపై లిఖితపూర్వక ఆదేశాలు కాకుండా.. డిపార్ట్‌మెంట్ల వారీగా అనుమానం ఉన్న సర్టిఫికెట్లను పంపించి వెరిఫై చేయాలంటూ మౌఖికంగా సూచించారు. కొన్నిచోట్ల చిన్న చిన్న ఆపరేషన్లను సైతం పెద్దవిగా చూపిస్తున్నారంటున్నారు.
ప్రస్తుతం వరంగల్, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో రెండు శాఖల్లో సుమారు 320 సర్టిఫికెట్లపై ఉన్నతాధికారులు వెరిఫై చేయాలని సీఎస్నుంచి ఆదేశాలు అందినట్లు ఓ శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. ఒకవేళ కొన్ని సర్టిఫికెట్లు నకిలీవని తేలితే ఆ తర్వాత అన్నింటిపైనా విచారణ చేస్తారని ఆయా శాఖల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు కూడా అంటున్నాయి. అక్కడక్కడ నకిలీ ధ్రువీకరణ పత్రాలను ఇస్తే అసలైన వారికి అన్యాయం జరిగే అవకాశాలుంటాయంటున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు, దివ్యాంగులను బదిలీల నుంచి మినహాయింపుతో పాటుగా వైద్యసదుపాయం అందుబాటులో ఉండే ప్రాంతాలు అంటే జిల్లా కేంద్రాల్లోనే ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నిబంధన ఉండటంతో దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు నకిలీ వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.