ఆటో పరిశ్రమ సంఘాలు ఏకతాటిపై రావాలి : ఎఫ్ఏడీఏ

by Harish |
ఆటో పరిశ్రమ సంఘాలు ఏకతాటిపై రావాలి : ఎఫ్ఏడీఏ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ డీలర్ల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్స్ (FADA) ఆటో రంగాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ సమస్యలకు సంబంధించి ప్రభుత్వంతో సమర్థవంతంగా చర్చించడానికి ప్రధాన ఆటో పరిశ్రమ సంఘాలను ఏకతాటిపై తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఎఫ్ఏడీఏ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వింకేశ్ గులాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వివిధ విధానపరమైన విషయాలు, దీర్ఘకాలిక డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వంతో చర్చించేందుకు ఈ చర్య ముఖ్యమని ఆయన చెప్పారు.

సుధీర్ఘ మందగమనంతో తీవ్రంగా నష్టపోయిన డీలర్ కమ్యూనిటీ లాభదాయకతను పెంచేందుకు చర్యలు తీసుకోవడం ముందున్న ప్రధాన లక్ష్యమని, దీనివల్ల ఆటో రిటైల్ వ్యాపారాన్ని ఆచరణీయంగా మార్చటానికి ఎఫ్ఏడీఏ కృషి చేస్తుందని వింకేశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15 వేల ఆటో డీలర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎఫ్ఏడీఏ, రిటైలర్లు, డీలర్లను రక్షించే చట్టాన్ని రూపొందించడానికి డీలర్ మార్జిన్లను పెంచడం, ఇతర రిటైల్ సంస్థలకు సహకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.

‘ఆటో పరిశ్రమకు ఉమ్మడి వైఖరి ఉండాలని భావిస్తున్నాం. గత రెండు, మూడు సంవత్సరాలుగా సియామ్, ఏసీఎంఏ(ఆటోమోటివ్ కాంపొనెంట్ తయారీదారుల సంఘం), ఎఫ్ఏడీఏ స్వతంత్రంగా ఆటో పరిశ్రమ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కానీ ఎలాంటి సానుకూల స్పందనలు లేవని’ వింకేశ్ వివరించారు. కాబట్టి, తాము ఎఫ్ఏడీఏ తరపున ఈ అంశంలో ముందడుగు వేయాలని భావిస్తున్నాం. ఐదారు ఆటో పరిశ్రమ సంఘాల సంస్థలన్నిటినీ ఒకచోటుకు చేర్చాలని ప్రయత్నిస్తున్నాం. తద్వారా ఆటో పరిశ్రమ డిమాండ్లను ప్రభుత్వానికి వివరిస్తామని వింకేశ్ గులాటి తెలిపారు.

Advertisement

Next Story