ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్ వార్తా సేవలు బంద్

by vinod kumar |
ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్ వార్తా సేవలు బంద్
X

దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం ఫేస్‌బుక్.. ఆస్ట్రేలియాలోని తన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి వార్తా విషయాలను బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు ఆ దేశవాసులు ఫేస్‌బుక్‌లో వార్తలను చదివే అవకాశాన్ని కూడా నిలిపేసింది. వార్తలు పంచుకొన్నందుకు గాను ఆయా సంస్థలకు ఫేస్‌బుక్‌ కొంత మేర ఫీజు చెల్లించాలనే నిబంధనను తెచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే అక్కడ వార్తా సేవలను నిలిపేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది.

ఆస్ట్రేలియాలోని వార్తా కథనాలకు సంబంధించి ఆయా వార్తాసంస్థలకు ఫేస్‌బుక్, గూగుల్‌ డబ్బులు చెల్లించేలా ఆ దేశం ‘మీడియా బార్‌గెయినింగ్ కోడ్’ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. గత డిసెంబరులోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా ‘సెనెట్‌ ఎకనమిక్స్‌ లెజిస్ట్రేషన్‌ కమిటీ’ ఎలాంటి మార్పులు అవసరం లేదని నివేదిక ఇచ్చింది. దీని ఫలితంగా ఫేస్‌బుక్, గూగుల్‌లు తమ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌ను చూపించడానికి వాణిజ్య ఒప్పందం ఏర్పడుతుంది.

కాగా అవి ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే తమ కార్యకలాపాల్లో వార్తా సేవలు ప్రధాన భాగం అయినందున న్యూస్‌ షోకేస్‌ విధానంలో వార్తలను అందించేందుకు గూగుల్‌.. స్థానిక మీడియా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటుండగా, ఎఫ్‌బీ మాత్రం వార్తలను తమ వేదికపై షేర్ చేయడాన్ని నిషేధించింది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా వార్తా ప్రచురణకర్తలు వారి కంటెంట్ నుంచి వచ్చే ప్రకటన ఆదాయంలో కొంత భాగాన్ని మాత్రమే పొందుతారు లేదా అగ్రిమెంట్‌లో భాగంగా ఇన్‌స్టంట్ ఆర్టికల్స్ రూపొందించి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారు. ఏదేమైనా ఈ ఆదాయం స్థిరంగా లేకపోగా, క్రమం తప్పకుండా మారుతూ ఉంటుంంది.

వార్తా సంస్థలు ఫేస్‌బుక్‌లో తమ వార్తల లింక్స్‌ను స్వచ్ఛందంగా పోస్ట్ చేస్తాయి. యూజర్లు వాటిపై క్లిక్ చేసినప్పుడు సదరు న్యూస్ ఏజెన్సీలకు రిఫరల్ లాభాలు వస్తాయి. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీలు గతేడాది దాదాపు 407 ఆస్ట్రేలియన్ డాలర్ల లాభాన్ని పొందాయి’. కానీ ఇప్పుడు కొత్తగా చెల్లింపులు చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఆస్ట్రేలియాలో వార్తా సేవలను నిలిపివేస్తున్నాం. ఇకపై ఫేస్‌బుక్ యూజర్లు వార్తలను చదువుకునే సదుపాయం ఉండదని చెప్పేందుకు విచారిస్తున్నాం’ అంటూ ఫేస్‌బుక్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed