ఫేస్‌బుక్-జియో భాగస్వామ్యం.. కరోనాను మించిన సంచలనం!

by Shyam |   ( Updated:2020-04-22 08:47:05.0  )
ఫేస్‌బుక్-జియో భాగస్వామ్యం.. కరోనాను మించిన సంచలనం!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ వారి జియో టెలికాం సంస్థ వయస్సు కేవలం నాలుగేళ్లు. తక్కువ సమయంలో ఎక్కువ సంచలనాలకు తెరలేపింది. అయితే, ఇది అపరకుబేరుడైన ముఖేశ్ అంబానీకి చెందినది కాబట్టి సాధ్యమైందని చెప్పేవారు కూడా లేకపోలేదు. అయితేనేం, అన్ని రకాలుగా ఇండియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించడమే కాకుండా ఒక తరం ఆలోచనలను, దేశ ఆర్థిక వ్యవస్థను ఇంకో స్థాయికి తీసుకెళ్లే స్పష్టమైన మార్పుకు సాక్ష్యంగా నిలువనుంది. గత రెండు నెలలుగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు రానున్నాయని నిపుణులెందరో భావిస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో రిలయన్స్ జియో, ఫేస్‌బుక్ మధ్య జరిగిన ఈ ఒప్పందం తొలి అడుగుగా వారు అభిప్రాయపడుతున్నారు.

రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. ఉదాహరణకు, జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు ఉండటం ఆశ్చర్యపరిచే విషయం.

ఇండియాలో డిజిటల్ వ్యవస్థను మరింత పతిష్టంగా మార్చేందుకే ఫేస్‌బుక్, జియో భాగస్వామ్యం అని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు. ఈ ఒప్పందం తర్వాత ప్రపంచంలోని డిజిటల్ సొసైటీలో ఇండియా ఒకటిగా ఉండనుందని, దీనికోసం దీర్ఘకాలిక భాగస్వామిగా ఫేస్‌బుక్ వస్తున్నందుకు, సంతోషంగా ఉందని ముఖేశ్ చెప్పారు. ఆసక్తికర విషయమేంటంటే… ముఖేశ్ అంబానీ ఎన్నో ఏళ్లుగా కలగంటున్న కిరాణా దుకాణాల విషయంలో ఫేస్‌బుక్, జియో అనుసంధానంతో మెరుగవుతుందని తెలుస్తోంది. సుమారు 3 కోట్ల కిరాణా దుకాణాలకు భారీగా ప్రయోజనాలుంటాయని ముఖేశ్ అంబానీ ప్రస్తావించారు. రైతులకు, చిన్న మధ్య తరహా సంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆరోగ్య సంరక్షణలోని వారు, వీటికి మించి యువకులకు, ఇండియా భవిష్యత్తుకు పునాదులు వేసే మహిళలకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు.

తక్కువ వాటా.. ఎక్కువ చెల్లించి…

భారత ప్రభుత్వం మొదలుపెట్టిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ‘ఈజీ ఆఫ్ లివింగ్’ లక్ష్యాలను ఈ భాగస్వామ్యం సాకారం చేస్తుందని ముఖేశ్ అంబానీ అన్నారు. త్వరలో వాట్సాప్ డిజిటల్ చెల్లింపు సేవలను ప్రభుత్వం ఆమోదించిన అనంతరం ఫేస్‌బుక్ సంస్థ జియోలో పెద్ద మైనారిటీ వాటాదారుగా ఉండే ఒప్పందం అమలవుతుందని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థల భాగస్వామ్యం వల్ల ఫేస్‌బుక్‌కి మరింత కలిసి వచ్చే అవకాశముంది. ఇండియాలో వేగంగా పెరుగుతున్న మార్కెట్‌ను దక్కించుకునే ఛాన్స్‌తోపాటు, ఇండియాలో అత్యధికంగా ఆయిల్, టెలికాం సంస్థల వరకూ అందరికీ సాయం చేసే వీలుంది. ఈ ఒప్పందంపై మార్కెట్ వర్గాలు సైతం సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత తక్కువ వాటాను ఎక్కువకు కొన్న పెట్టుబడి ఇదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చెబుతోంది. ఇండియాపై తమ నిబద్ధతకు ఈ పెట్టుబడి సాక్ష్యమని, ఇండియాను జియో మార్చిన తీరు ఆశ్చర్యపరిచిందని, జియో భాగస్వామ్యంతో మరింతమంది ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో పనిచేస్తామని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది.

డిజిటల్ పేమెంట్స్:

ఈ ఒప్పందం తర్వాత ప్రత్యేకంగా డిజిటల్ పేమెంట్స్ విభాగంలో మిగిలిన పేమెంట్ సంస్థలకు ధీటుగా వాట్సాప్ మారనుంది. వాట్సాప్ పే సర్వీసు త్వరలో ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇప్పుడు రిలయన్స్ జియో తో కలిసిన తర్వాత ఫేస్‌బుక్ వాట్సాప్ పే సర్వీసులను వీలైనంత తొందరలో తీసుకొచ్చే అవకాశముంది.

‘రిలయన్స్ జియోతో ఒప్పందం ద్వారా ఫేస్‌బుక్ ఓ రకంగా ఇన్సూరెన్స్ పాలసీని కొన్నదని చెప్పొచ్చు. ఇండియాలో ఫేస్‌బుక్ ఇక మీదట రెగ్యులేటరీ వ్యవస్థను ఈజీగా డీల్ చేయవచ్చు’ అని ఓ బ్యాంకర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పే సర్వీసులు అందిస్తున్న గూగుల్ పే, పేటీఎమ్, ఫోన్ పే వంటి సంస్థలకు ‘వాట్సాప్ పే’ గట్టి పోటీగా నిల్వనుంది. రిలయన్స్ జియోకు ఇండియాలో 38 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. జియో సపోర్ట్‌తో వాట్సాప్ ప్రజల్లోకి వేగంగా విస్తరించే అవకాశాన్ని అందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, డేటా లోకలైజేషన్ నిబంధనలను వాట్సాప్ అనుసరించాల్సి ఉన్నందున ప్రభుత్వం నుంచి అతిపెద్ద సవాలుని ఎదుర్కోక తప్పదు. ఇక్కడ కూడా మరో వెసులుబాటు ఉంది. రిలయన్స్ సంస్థకు అధికార ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున కష్టతరమేమీ కాదనే వాదన ఓవైపు వినిపిస్తోంది.

రిటైల్‌ రంగంలో మార్పులు…

వాట్సాప్ రిలయన్స్ రిటైల్‌కు చెందిన జియో మార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ విభాగం జియో మార్ట్.. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే సదవకాశముంది. కీలకమైన ఈ అనుమతి తర్వాత జియోమార్ట్ నుంచి చిన్న చిన్న కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులు ఆన్‌లైన్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. దీని ద్వారా వినియోగదారులు స్థానిక దుకాణాల నుంచే రోజూవారీ ఆర్డర్లను తెప్పించుకోవచ్చు. పంపిణీ కూడా సులభతరం, వేగవంతమవుతుంది. ముఖ్యంగా దుకాణాదారులు తమ వ్యాపారాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల అసోచామ్-పీడబ్ల్యూసీ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం… 2023 నాటికి రూ. 10.27 లక్షల కోట్ల విలువతో అవతరించనున్న డిజిటల్ మార్కెట్లో ఫేస్‌బుక్ మిగిలిన వాటితో పోటీ పడేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ప్రస్తుతం దేశంలో రిటైల్ దిగ్గజాలుగా అమెజాన్, వాల్‌మార్ట్ యాజమాన్యానికి చెందిన ఫ్లిప్‌కార్ట్ సంస్థలున్నాయి. త్వరలో రిలయన్స్ జియో మార్ట్ వల్ల వీటి వ్యాపారానికి గట్టిదెబ్బ తప్పదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో జియోమార్ట్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా మహారాష్ట్రలో ప్రారంభించారు. త్వరలో దేశవ్యాప్తంగా మొదలుపెట్టనున్నారు. జియో ప్లాట్‌ఫామ్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ మధ్య భాగస్వామ్యంతో వాట్సాప్ ఉపయోగించి జియోమార్ట్‌తో స్థానిక దుకాణాల నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లు చేసి ఇంటి అవసరాలకు వస్తు ఉత్పత్తులను, సేవలను పొందవచ్చని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వివరించారు.

ముఖేశ్ అంబానీ రిలయన్స్ జియో కోసం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయనున్నారు. రుణభారం తగ్గించుకోవడమే మొదటి లక్ష్యమని గతంలో అంబానీ ప్రకటించారు. 2021 మార్చి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చేందుకు సిద్ధమైనట్టు ముఖేశ్ అంబానీ వెల్లడించారు. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ. 1.1 లక్షల కోట్లు లభించనున్నాయి.

Tags: Jio And Facebook, Facebook Stake In Jio, Facebook And Reliance, Facebook Buy Jio, Facebook Jio Deal, Reliance Facebook Deal, Reliance Jio Facebook, Facebook To Invest In Jio, Facebook Reliance, Reliance And Facebook Deal, Facebook Valuation, Facebook Jio

Advertisement

Next Story