- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణం పేరిట దోపిడీ.. ఎకరానికి రూ.6 వేలు డిమాండ్
దిశ ప్రతినిధి, వరంగల్/ మహబూబాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రుణాలిప్పిస్తానని చెప్పి మద్దూరి వీరన్న అలియాస్ విక్రమ్ రెడ్డి అనే కేటుగాడు రైతుల నుంచి రూ.కోట్లు వసూలు చేశాడు. ఏజెంట్లకు కమీషన్ల ఆశచూపి అన్నదాతలు దరఖాస్తు చేసుకునేలా మోసానికి తెరలేపాడు. ఎకరానికి రూ. 50వేల రుణం ఇప్పిస్తామని, ఇందుకు దరఖాస్తుకు రూ.6వేలు చెల్లించేలా ఏజెంట్ల ద్వారా నకిలీ వ్యవహారం నడిపాడు. ఎకరానికి రూ.50వేల రుణం ఇప్పిస్తానని, మంజూరైన రుణంలో బీసీలైతే 50శాతమే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా రుణ మాపీ ఉంటుందని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకమని, తెలంగాణ ప్రభుత్వ ఆమోదితం పొంది ఉందని రకరకాలుగా నమ్మబలకడంతో అమాయకులైన రైతులు పదుల సంఖ్యలో ఈ కేటుగాడి చేతిలో దగాపడినట్లుగా తెలుస్తోంది.
డబ్బులు కట్టి నెలలు గడుస్తున్నా రుణం రాకపోవడంతో అనుమానం కలిగిన మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన రైతులు గురువారం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహబూబాబాద్‌లోని గాయత్రి గుట్ట వద్ద ఏర్పాటు చేసిన కార్యాలయంలో సిబ్బందిని,మద్దూరి వీరన్న అలియాస్ విక్రమ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో డబ్బులు కట్టిన రైతులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. కొంతమంది ఏజెంట్లు ఏకంగా పదుల సంఖ్యలో రైతులను దరఖాస్తు చేయించడం గమనార్హం. జనగామ జిల్లా ఏజెంటుగా పనిచేసిన వ్యక్తి ఏకంగా ఆ ప్రాంత రైతుల నుంచి రూ.3లక్షలు కట్టించినట్లుగా పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు. ఇప్పటి వరకు మహబూబాబాద్ స్టేషన్‌కు చేరుకుంటున్న రైతులు, ఏజెంట్లలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. ఉమ్మడి వరంగల్,కరీంనగర్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున వసూళ్లు జరిగినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్ టౌన్ పోలీసులు విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
గతంలోనూ ఇదే తరహా దందా.. చితక్కొట్టినా బుద్ధి మారలేదు…
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కందికొండ గ్రామానికి చెందిన మద్దూరి వీరన్న పేరు మార్చుకుని విక్రమ్‌రెడ్డిగా చెలామణి అవుతున్నాడు. ఈజీ మనీ సంపాదనకు.. వైట్ కాలర్ ఉద్యోగిగా..బిజినెస్ పర్సన్‌గా చుట్టు పక్కల జిల్లాలో పరిచయం చేసుకోవడం గమనార్హం. అయితే చేసేది మాత్రం దొంగ పనులు. గతంలోనూ ఇదే తరహా ఆర్థిక నేరం చేయడంతో దెబ్బలపాలయ్యాడు. ఏడాదిన్నర క్రితం వరంగల్‌రూరల్ జిల్లా నెక్కొండ మండలం నక్కలగుట్ట తండా వాసులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయిస్తానని డబ్బులు వసూలు చేశాడు. అయితే రుణాలు రాకపోవడంతో వారికి చెల్లని చెక్కులను చేతిలో పెట్టాడు. విషయం గ్రహించిన తండావాసులు వీరన్నను చితక్కొట్టారు. తండావాసులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. అయితే ఆ తర్వాత కూడా వీరన్న బుద్ధి మారలేదు. ఈజీ మనీ సంపాదనకు అలవాటు పడిన వీరన్న ఈ సారి ఏకంగా ప్రధానమంత్రి సమ్మాన్ నిధి పథకం పేరుతో రుణాలు అందజేస్తామని అన్నదాతలను మోసం చేయబోయి.. పోలీసులకు చిక్కాడు. పోలీసుల తమదైన శైలిలో విచారిస్తుండటంతో మొత్తం వ్యవహారం బయటకొస్తోంది. వసూలు చేసిన డబ్బులను ఏం చేశాడు..? ఎంతమంది వద్ద నుంచి వసూలు చేశాడు..? ఈ వ్యవహారం వెనుక ఇంకెంతమంది ఉన్నారు..? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేస్తామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ
– కళ్యాణ్, మహబూబాబాద్
బీ, టేక్ పూర్తి చేసి,ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న.నెల రోజుల క్రితం సోషల్ మీడియా లో వచ్చిన పోస్ట్ చూసి మా సొంత మండలం లో ఉద్యోగమని ,నెలకు 20 వేలు వస్తాయని నమ్మకంతో చేరాను. సుమారు 10 మంది రైతుల వద్ద నుండి లోన్ల కోసం రూ. 50 వేలు వసూళ్లు చేసి ఆఫీస్ లో వీరన్న కు ఇచ్చాను. మోసం జరిగిందని తెలుకొని పోలీసులు కు ఫిర్యాదు చేశాను.