Telangana Lawyers : లాయర్లకు లాక్‌డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు..!

by Shyam |   ( Updated:2021-05-27 11:56:58.0  )
Telangana Lawyers : లాయర్లకు లాక్‌డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా కోర్టు విధులకు హాజరయ్యే న్యాయవాదులకు విఘాతం కలుగుతోందని, ఈ ఆంక్షల నుంచి వారికి మినహాయింపు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సానుకూలంగా స్పందించింది. అత్యవసర సేవల తరహాలోనే న్యాయవాదుల విధులు కూడా ఎమర్జెన్సీ కేటగిరీ కిందికి వస్తాయని, వీరి విధులకు ఆటంకం కలిగితే అంతిమంగా అది సామాన్యుల పిటిషన్ల విచారణ జాప్యానికి కారణమవుతుందని, వారికే ఇబ్బంది కలుగుతుందని, అందువల్ల వారికి లాక్‌డౌన్ ఆంక్షల నుంచి సడలింపులు ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. నగరానికి చెందిన కారం కొమిరెడ్డి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కమిషన్ ఛైర్మన్ జి.చంద్రయ్య గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా డీజీపీకి స్పష్టం చేశారు.

మరోవైపు ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది జయంత్ సూర్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అనేక రాష్ట్రాలు న్యాయవాదులకు లాక్‌డౌన్, కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇచ్చాయని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక సర్క్యులర్‌లను న్యాయవాది ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు, లాక్‌డౌన్ ఆంక్షలు విధులకు హాజరయ్యే న్యాయవాదులకు ఇబ్బందిగా మారాయని, వీరు మాత్రమే కాక హైకోర్టులో పనిచేసే సిబ్బందికి కూడా ఇబ్బందిగానే ఉన్నాయని పేర్కొన్నది. ఇకపైన విధులకు ఆటంకం కలిగించేలా న్యాయవాదులకు ఆటంకాలు కల్పించవద్దని, వారికి ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు సూచించింది.

దీనికి సానుకూలంగా స్పందించిన అడ్వొకేట్ జనరల్, ప్రధాన కార్యదర్శికి ఈ విషయాన్ని తెలియజేస్తానని బదులిచ్చారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల కోసం ఎదురుచూడాలని పిటిషనర్‌కు అర్థం చేయిస్తూనే ఈ పిటిషన్‌లో ప్రధాన కార్యదర్శిని కూడా ప్రతివాదిగా చేర్చాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed