ఎక్సైజ్ శాఖలో.. మూడు నెలలుగా జీతాల్లేవ్

by Shyam |   ( Updated:2021-04-24 09:43:08.0  )
ఎక్సైజ్ శాఖలో.. మూడు నెలలుగా జీతాల్లేవ్
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో నియామకమైన 280 మంది ఎస్ఐ పోస్టులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను వెక్కరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిన ఏడాదికే నోటిఫికేషన్ వచ్చినా.. నియామక పత్రం వచ్చేనాటికి ఐదేళ్లు పట్టింది. అయినా.. ప్రభుత్వం అనుసరించాల్సిన విధానపరమైన నిర్ణయాలలో చిత్తశుద్ది లేకపోవడం, అధికారుల అలసత్వంతో ఉద్యోగాలు పొందినా పోస్టింగ్ ల కోసం ఏడాది కాలంగా వెయిట్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. 2015లో గ్రూప్ -2 నోటిఫికేషన్ ద్వారా ఎక్సైజ్ శాఖలో 280 ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, నియామక పత్రాలు చేతికి అందేసరికి 2020 వచ్చేసింది. అంటే 280 పోస్టుల నియామకానికి టీఎస్‌పీఎస్సీకి ఐదేళ్ల కాలం పట్టడం గమనార్హం.

అడ్‌హాక్ ప్రమోషన్లు..

రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలలో 1032 గ్రూప్ -2 పోస్టులకు 2015లో నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో ఎక్సైజ్ శాఖకు చెందినవి 280 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్ష 2016లో జరగగా, 2017లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాయి. ఎగ్జామ్ సమయంలో ఓఎంఆర్ షీట్ జంబ్లింగ్ విషయంపై 2018లో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దీంతో మరో ఏడాదికి 2019లో ఇంటర్వూలు, 2020లో నియామక పత్రాలను ఆలస్యంగా జారీ చేయాల్సి వచ్చింది. అయితే, 2018 కోర్టు కేసుల సందర్భంలో అప్పటికే నోటిఫికేషన్ వచ్చి మూడేళ్లు కావడంతో.. ఎక్సైజ్ శాఖ జూనియర్ అసిస్టెంట్ లకు ఎస్ఐలుగా అడ్ హాక్ ప్రమోషన్ కల్పించి, పోస్టింగ్ లు కేటాయించింది. జూనియర్ అసిస్టెంట్ లకు అడ్ హాక్ ప్రమోషన్ కల్పించిన రెండేళ్ల తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా 280 మంది ఎస్ఐల నియామకం ప్రక్రియ పూర్తయ్యింది. అప్పటికే వీరి స్థానంలో ప్రమోషన్లు పొందిన వారు ఉన్నందున ఈ 280 మందికి ట్రైనింగ్ పీరియడ్ గా పేర్కొంటూ.. ఆయా పోలీస్ స్టేషన్లకు సర్థుబాటు పద్దతిలో కేటాయించారు. అయితే, ఈ ప్రక్రియలో 193 మందికే సర్థుబాటు కావడంతో మరో 87 మందికి సూపర్ న్యూమరరీ పద్దతిలో జీవో ఆర్టీ నెంబరు 176ను ప్రభుత్వం విడుదల చేసి, రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లకు కేటాయించారు.

3 నెలలుగా వేతనాల్లేవ్ ..

వాస్తవానికి అడ్ హాక్ ప్రమోషన్లు పొందిన వారిని డిపార్ట్మెంట్ లో నియామకం ద్వారా ఎంపికైన వారు వచ్చినప్పుడు అడ్‌హాక్ ప్రమోషన్ పొందిన వారికి రివర్స్ ప్రమోషన్ ఇవ్వాలి. కానీ, ఎక్సైజ్ శాఖ అలా చేయకుండానే.. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియాకమైన వారిని నేటికీ ట్రైనిగ్ పద్దతిలోనే కొనసాగిస్తున్నారు. ఇలా సర్థుబాటు చేసిన 193 మందికి వివిధ పోలీస్ స్టేషన్ల ద్వారా వేతనాలు అందుతుండగా.. సర్థుబాటు కాకపోవడంతో సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసిన 87 మందికి ఎక్సైజ్ అకాడమీ ద్వారా వేతనాలు పొందేలా ఆ జీవోలో పేర్కొన్నారు. సూపర్ న్యూమరరీ పోస్టుల ద్వారా అకాడమీ వేతనాలు చెల్లించే గడువు 2021 జనవరి 23వ తేదీతో ముగిసింది. వీరి స్థానాలలో ఉన్న అడ్ హాక్ ప్రమోషన్ పొందిన వాళ్లను అధికారులు వెనక్కు పంపకపోవడంతో జీవో ముగియగానే ఈ 87 మందికి వేతనాలు మంజూరు చేయడం డిపార్ట్మెంట్ కు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో 87 మందికి వేతనాలు అందించేందుకు సూపర్ న్యూమరరీ జీవోను పొడిగించాల్సి ఉన్నా.. అధికారులు ఆ వైపుగా చర్యలు తీసుకోలేదు. దీంతో గడువు ముగిసిన 2021 జనవరి 23 నుంచి నేటి వరకూ మూడు నెలలుగా వీరికి వేతనాలు అందక వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలే కరోనా పరిస్థితుల్లో కుటుంబ పోషణకు నానా తిప్పలు పడుతున్నారు.

పర్మినెంట్ పోస్టింగ్ ఇవ్వరా..

ప్రభుత్వ నియామకాలు చేపట్టే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి ఐదేళ్లుగా పోస్టింగ్‌లు కేటాయించకపోవడం ఎక్సైజ్ శాఖ పనితీరుకు నిదర్శనం. అడ్ హాక్ ప్రమోషన్లు కల్పించిన వారిని రివర్షన్ చేయకపోవడంలో అధికారుల వ్యవహారంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. నోటిఫికేషన్ ద్వారా నియామకం అయినందుకు సాఫీగా ఉద్యోగం చేయాల్సిన మొత్తం 280 మందికి ఇంకా ట్రైనింగ్ పీరియడ్ లోనే కొనసాగడం డిపార్ట్మెంట్ కే సిగ్గు చేటు అంటూ పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఎక్సైజ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీగా కొనసాగుతున్నా.. ఈ సమస్యకు పరిష్కారం చూపకపోవడం గమనార్హం. ఈ విషయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ లు వెంటనే జోక్యం చేసుకుని 87 మందికి వేతనాల సమస్యను పరిష్కరించాలని, 280 మందికి పర్మినెంట్ పోస్టింగ్ లు కేటాయించాలని ట్రైనింగ్ పూర్తయినా, నేటికీ ట్రైనీలుగానే కొనసాగుతున్న ఎక్సైజ్ ఎస్ఐలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed