సంచలనాల గద్వాల కోట.!

by Anukaran |   ( Updated:2021-01-09 22:11:00.0  )
సంచలనాల గద్వాల కోట.!
X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాజుల కాలం నుంచి గద్వాల్ కోట సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది. కాకతీయ చక్రవర్తుల సామంతులుగా.. నిజాం ప్రభువుల కాలంలో సంస్థానాధీశులుగా గద్వాల పాలకులు నాలుగు శతాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించారు. మంచి పరిపాలన అధ్యక్షులుగా పేరుగాంచిన గద్వాల పాలకులు.. సుసంపన్నులుగా వెలుగొందాలని.. ఈ కోటలో నిధులు, నిక్షేపాలను దాచిపెట్టారని విశ్వాసం.. అటువంటి ప్రసిద్ధిగాంచిన కోటలో గతంలో చిరంజీవి హీరోగా కొండవీటి రాజా సినిమా షూటింగ్ జరగగా, గద్వాల నేపథ్యంలో అరుంధతి సినిమా రూపొందింది. ప్రతి ఏటా తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఇక్కడి నేత కార్మికులు రూపొందించిన జోడి పంచెలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నో సంచలనాలకు, అభూత కల్పనలకు మారుపేరైన కోటలో ఇప్పటికీ జరిగే ప్రతి సంఘటనా ఒక సంచలనం అవుతోంది. రాత్రిపూట భయం గొలిపే రీతిలో ఉండే ఈ కోటలో జరిగే తవ్వకాలు. ప్రతిసారి చర్చనీయాంశం అవుతున్నాయి.. ఇటీవల జరిగిన తవ్వకాలలో పెద్ద ఎత్తున నిక్షేపాలు బయట పడ్డాయని పుకార్లు షికార్లు అవుతున్నాయి.
పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోట ప్రాంగణంలో చెన్నకేశవస్వామి దేవాలయంతో పాటు ప్రస్తుతం రాణి లక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ బాలికలు, బాలుర జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఖాళీ స్థలం మైదానంగా ఉండడంతో పిల్లలు, పెద్దలు అందరూ ఇక్కడికి చేరుకొని వ్యాయామాలు చేయడం, ఆటలు ఆడుకోవడం చేస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో ఎప్పుడూ కొందరు అక్రమార్కులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గుప్త నిధులు దొరికాయని ప్రచారాలు ఎప్పటికప్పుడు షికార్లు చేస్తూ వస్తున్నాయి.

వందల సార్లు తవ్వకాలు..

రాజుల కాలంలో నిర్మాణమైన ఈ కోటలో గుప్తనిధులు పెద్ద ఎత్తున ఉన్నాయని ప్రజల నమ్మకం.. 70 సంవత్సరాల కాలంలో లెక్కలేనన్ని సార్లు గుప్తనిధుల కోసం కోటలో తవ్వకాలు చేశారు.. 20 సంవత్సరాల క్రితం చెన్నకేశవ స్వామి 5 గుడి గోపురాల లో రెండింటిని దుండగులు దొంగలించారు.. మరికొన్నిసార్లు పలుచోట్ల తవ్వకాలు చేశారు.. పోలీసులు తవ్వకాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న దాఖలాలు ఇప్పటివరకు లేవు..

కళాశాల నిర్మాణం కోసం తవ్వకాలు..

కోటలో ఉన్న డిగ్రీ, జూనియర్ కళాశాల అదనపు నిర్మాణాలకు తవ్వకాలు జరిపిన ప్రతిసారీ అందరి దృష్టి ఆ తవ్వకాలపై నిలుస్తోంది. ఇటీవల డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణాల కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. ఈ క్రమంలో కాంట్రాక్టర్ తవ్వకాలు జరిపారు. కరోనా నేపథ్యంలో నిధులు రద్దు కావడంతో తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు కళాశాల ప్రిన్సిపాల్ సూచనల మేరకు ఆ గుంతలను మూసి వేయించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున గుప్త నిధులు దొరికాయని ప్రచారం జరుగుతోంది. తవ్వకాల సందర్భంగా భూభాగంలో ఉన్న పలు రాతి కట్టడాలతో నిర్మించిన భాగాలు బయటపడ్డాయి. వాటిలో గుప్త నిధులు లభించాయని భావిస్తున్నారు. ఈ విషయం మూడు నెలల క్రితం జరిగినా వెలుగులోకి రెండు రోజుల క్రితం వచ్చి పుకార్లు షికార్లు చేస్తున్నాయి..

పురాతన కట్టడాలు బయటపడ్డాయి..

కళాశాల అదనపు నిర్మాణాల కోసం జరిపిన తవ్వకాల్లో పురాతన కట్టడాలు బయటపడ్డాయి. తవ్వకాలు జరిపే సమయంలో అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉంటారు. ఎటువంటి గుప్త నిధులు బయటపడలేదు. గతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన మాట వాస్తవమే. కళాశాల బాలికల వెయిటింగ్ గది నిర్మాణం కోసం తొవ్వకాలు చేసాం.. నిధులు నిలిచిపోవడంతో మళ్లీ మూసివేయించాం.. అక్కడ ఎటువంటి గుప్తనిధులు బయట పడలేదు.
-శ్రీపతి నాయుడు, ప్రిన్సిపాల్, రాణి లక్ష్మీ దేవమ్మ డిగ్రీ కళాశాల, గద్వాల
Advertisement

Next Story