హుజురాబాద్ ఉపఎన్నిక కోసం తెలంగాణ బంద్: జితేందర్ రెడ్డి

by Sridhar Babu |
హుజురాబాద్ ఉపఎన్నిక కోసం తెలంగాణ బంద్: జితేందర్ రెడ్డి
X

దిశ, జమ్మికుంట: హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ప్రజలను మరోమారు మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ అన్ని బంధులు ఇస్తామంటూ.. చివరకు తెలంగాణ బంద్ చేస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలో మాజీ జడ్పీ చైర్‌ పర్సన్ తుల ఉమతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాళా రాష్ట్రంగా మార్చారన్నారు. ఆసరా పింఛన్లకు నిధులు విడుదల చేయకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో.. దాదాపు 74 కళాశాలలు మూతపడ్డాయన్నారు.

హుజురాబాద్‌లో గప్పాలు కొడుతున్న హరీశ్ రావు.. దుబ్బాకను దత్తత తీసుకుంటున్నానని ప్రకటించి.. ఓడిపోయిన తర్వాత హరీశ్ అక్కడ కాలు కూడా పెట్టలేదన్నారు. హుజురాబాద్‌ను ఈటల రాజేందర్ ఎంతో అభివృద్ధి చేశారని.. ఎక్కడ చూసినా డబుల్ రోడ్లు, ఫోర్ లైన్ రోడ్లు కనిపిస్తున్నాయన్నారు. అయినా, ఈటల ఏమీ చేయలేదని ఆరోపించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు.

దళితుల అకౌంట్‌లో రూ. 9.9 లక్షలు పడ్డట్టు మెసేజ్‌లు చూపిస్తున్నా.. అవి హోల్డ్‌లో పెట్టారని, ఆ డబ్బులను లబ్ధిదారులు ఉపయోగించుకునే విధంగా నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు.. గిమ్మిక్కులు చేసినా హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.

Advertisement

Next Story