పొన్నాల… ఎందుకీ దూరం?

by Anukaran |   ( Updated:2021-03-21 00:47:20.0  )
పొన్నాల… ఎందుకీ దూరం?
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య జాడ జ‌న‌గామ‌లో క‌నిపించ‌డం లేదు. ఈనియోజ‌క‌వ‌ర్గం నుంచి గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నాల.. 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓట‌మిపాల‌య్యారు. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న జ‌న‌గామ‌లో పర్య‌టించింది బ‌హు అరుద‌నే చెప్పాలి. గ‌త కొన్నాళ్లుగా పొన్నాల నియోజ‌క‌వర్గానికి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అప్పుడ‌ప్పుడూ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర రాజ‌కీయాల‌పై స్పందించ‌డం మినహా… తన సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జల సమస్యలను తెలుసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కొంత‌మంది అతిముఖ్య‌మైన నేత‌ల‌తో మాత్ర‌మే ట‌చ్‌లో ఉండటంతో.. మండ‌ల‌, గ్రామ‌స్థాయి నేత‌లు త‌లో దారి చూసుకుంటున్నారు. మార్గ‌నిర్దేశం చేసే నాయ‌కుడు లేక‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే నాయ‌క‌త్వం క‌నిపించ‌క నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ శ్రేణులు చెల్లా‌చెదుర‌వుతున్నారు. దీనికితోడు జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలో జంగా, పొన్నాల వర్గాలుగా కాంగ్రెస్‌లో విభ‌జ‌న ఏర్ప‌డ‌టంతో కాంగ్రెస్ పార్టీలో స‌మ‌న్వ‌యం లోపించి నానాటికి తీసిక‌ట్టుగా మారుతోంది.

కావాల‌నే దూరంగా ఉంటున్నారా?

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పొన్నాల రాజ‌కీయంగా ఒక వెలుగు వెలిగారు. న‌లుగురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. వైఎస్సార్ క్యాబినేట్‌లో కీల‌క‌మైన భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రిగా, 2014, మార్చి 11న తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ చీఫ్‌గా ప‌నిచేశారు. కావాలనే నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారా..? అనే చ‌ర్చ జ‌న‌గామ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.‌

ఎన్నిక‌లొస్తేనే వ‌స్తారా?

పొన్నాల ల‌క్ష్మ‌య్య నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోకపోవడంపై సొంత పార్టీ నేతలు మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల్లో ఎల్లప్పుడూ ఉండేవారే అభిమానాన్ని పొందుతారని పొన్నాల నిర్ల‌క్ష్యాన్ని ఉద్దేశించి వ్యాఖ్యనిస్తున్నారు. సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లోనే ఆయనపై వ్యతిరేకత ఉంది. మ‌రి పొన్నాల నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకుంటారా..? లేక అలానే వ‌దిలేసి మ‌రో నాయ‌కుడికి నియోజ‌క‌వ‌ర్గ నేత‌గా చేజేతులా అవ‌కాశం క‌ల్పిస్తారా? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.

Advertisement

Next Story