ఈటల సీక్రెట్ ఆపరేషన్.. సీల్డ్ కవర్ల తరువాత ఏం జరిగింది?

by Sridhar Babu |
Etela-1
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ లో ఓటర్లకు సీల్డ్ కవర్లు చేరిన తరువాత ఏం జరిగింది, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తులను చిత్తు చేసేందుకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఏం చేశారు? ఆరు నెలల టీఆర్ఎస్ పార్టీ శ్రమకు ఈటల ఆ రెండు రోజుల్లో చెక్ ఎలా పెట్టారు? అంటూ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే. ఓటర్లను తీవ్ర ప్రభావితం చేస్తాయనుకున్న ఆ ఎత్తులను చిత్తు చేయడంలో ఆయన పన్నిన వ్యూహం ఏంటో తెలుసా..?

అప్పటి వరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ సాగిన ప్రచారం ఆ ఒక్క ఎపిసోడ్ తో ఉల్టా పల్టాగా మారిందనుకున్న క్రమంలో ఈటల రాజేందర్ తనకు ఎలా అనుకూలంగా మల్చుకున్నాడంటే… ? 28వ తేదీ నుంచి సింగిల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన ఈటల నియోజకవర్గం అంతా కలియతిరిగారు. తన వెంట అనుచరులు లేకుండా, కారులో ఒక్కడే తిరుగుతూ తన వ్యూహాన్ని అమలు పరిచారు. వందకు పైగా గ్రామాల్లో తిరిగిన రాజేందర్ గ్రామాల వారీగా స్థానిక సంస్థల ప్రతినిధులను కలిసి సమీకరణాలు మార్చేశారు. ఒకరిని కలిసిన విషయం మరోకరికి తెలియకుండా వన్ మెన్ ఆర్మీలా ఆయన ప్రజా ప్రతినిధులను కలిసి వారిని మానసికంగా మార్చేశారు. తనకు అనుకూలంగా పనిచేస్తానన్న మాట తీసుకుని నింపాదిగా పోలింగ్ రోజు నియోజకవర్గంలో తిరిగారు.

వార్డు మెంబర్లు, మహిళళే ఆయుధం…

టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ల వరకు పార్టీలో చేర్పించుకోవడంతో సరిపెట్టింది. ఈ క్రమంలో గ్రామాల్లో మిగిలిన వార్డు మెంబర్లు ఈటలకు ఆయుధాలుగా మారారు. వార్డు మెంబర్ల ద్వారా వారి వారి ప్రాంతాల్లోని ఓటర్లను తనకు అనుకూలంగా మల్చుకోగలిగారు. మాజీ ప్రజా ప్రతినిదుల అండదండలు కూడా ఆయనకు కలిసొచ్చాయి. ఇదే సమయంలో మహిళా సంఘాల ప్రతినిధుల ద్వారా గ్రామాల్లో తన ప్రచార పర్వాన్ని ఉధృతంగా కొనసాగించారు. అధికార పార్టీ తన వెంట ఎవరూ లేరన్న భ్రమల్లో ఉండడంతో తన ఎత్తుగడలను అంచనా వేయలేరని భావించిన ఈటల పకడ్భందీగా తన స్కెచ్ ను అమలు చేసుకున్నారు. ఒంటిరిగా తిరుగుతున్న ఈటలను కోలుకోలేని దెబ్బతీశామని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు అనుకున్నారు. కానీ.. చాప కింద నీరులా ఈటల వేసిన ఎత్తుగడలకు చివరకు టీఆర్ఎస్ పార్టీ చిత్తయిపోయింది.

బూత్ కు వంద ఓట్లు…

306 బూత్ లలో కేవలం రెండింటిలో మాత్రమే ఈటలకు మెజార్టీ రాలేదు. ఆయన తన వ్యక్తి గత ఓటు బ్యాంకుతోపాటు అదనంగా ప్రతి బూత్ కు వంద ఓట్లు అధికంగా వేయించుకోవాలన్న వ్యూహం పర్ ఫెక్ట్ గా సక్సెస్ అయింది. ఈ పద్ధతి అమలు చేయడంలో ఈటల రాజేందర్ 30 వేల పై చిలుకు ఓట్లను సాధించుకోలిగారు. బూత్ ల వారీగా ఓటర్ల వివరాలను సేకరించిన ఈటల సన్నిహితులు వారిచే ఓట్లు వేయించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ వ్యూహంతోనే ఈటల సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed