నేడు బీజేపీలో చేరనున్న ఈటల..

by Shamantha N |   ( Updated:2021-06-13 23:30:44.0  )
Eatala Rajender Bjp
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్న ఈటల తనతో పాటు అనుచర గణాన్ని కూడా ప్రత్యేక విమానంలోనే ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు బీజేపీలో చేరనున్నారు. ఆ తర్వాత సాయంత్రానికి అమిత్ షా ను ఆయన నివాసంలో కలవనున్నారు. రాత్రికి అక్కడే ఉండి మంగళవారం ఉదయం తిరిగి షామీర్‌‌పేట్‌కు చేరుకోనున్నారు.

ఈటల రాజేందర్‌తో పాటు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన గండ్ల నళిని, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకుడు అశ్వత్థామరెడ్డి తదితర సుమారు ఇరవై మందితో పాటు మొత్తం 150 మందికి పైగా ఒకేసారి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఉస్మానియా వర్శిటీ విద్యార్థి జేఏసీ నేతలు పలువురు కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇకపైన ఉప ఎన్నిక ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్నందున వీలైనంత ఎక్కువగా నియోజకవర్గంలోనే గడపనున్నారు.

పాదయాత్ర చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలనూ చుట్టేలా రోడ్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైంది. అధికార పార్టీ ప్రలోభపెట్టి స్థానికంగా ఉన్న మద్దతుదారులను లాక్కునే ప్రమాదం ఉందని గ్రహించిన ఈటల రాజేందర్ ఇప్పటి నుంచే కేడర్‌ను నిలబెట్టుకోవడంతో పాటు గ్రామాల్లో ప్రజల మద్దతు పొందడానికి బీజేపీ సాయాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు. లాంఛనంగా బీజేపీలో చేరిన తర్వాత క్షేత్రస్థాయి కార్యాచరణను ముమ్మరం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed