కేసీఆర్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఈటల.. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

by Anukaran |   ( Updated:2021-05-01 21:36:16.0  )
minister etela rajendar
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి ఈటల రాజేందర్‌ ఇరుక్కోవడంతో ఒక్కసారిగా ఆయన అనుచరులు డీలాపడ్డారు. హుజూరాబాద్, కమలాపూర్ తదితర ప్రాంతాల నుంచి వందలాదిగా ఆయనను కలవడానికి వస్తున్నారు. గంటల తరబడి ఈటల తన అనుచరులతో, అభిమానులతో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ ప్రణాళిక గురించి కసరత్తు మొదలైంది. కేసీఆర్‌తో దీర్ఘకాలంగా ఉన్న అనుబంధం ఒక్కసారిగా తెగిపోయింది. పైకి డీమోరలైజ్ కాలేదని చెప్పుకుంటున్నా అనూహ్య పరిణామాలతో ఆయన దిక్కుతోచని స్థితికి గురయ్యారు. షామీర్‌పేట ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన మంత్రి ఈటల రాజేందర్ ‘దిశ‘తో తన భావాలను పంచుకున్నారు.

భూకబ్జా వివాదం ఇప్పుడే తెరపైకి ఎందుకొచ్చింది?

అది ప్రభుత్వానికే తెలియాలి. ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పాలి. ఒక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదు. ఒక్క నిర్మాణం కూడా చేయలేదు. చేసినట్లయితే దాన్ని కూల్చేసుకోవచ్చు. కానీ వంద శాతం నన్ను ఇరికించడానికి దీన్ని ఒక సాకుగా తెరపైకి తెచ్చారు. పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరిగిందని నేను అనుకోవడంలేదు.

ఇరికించాల్సిన అవసరం ఏమొచ్చింది?

నన్ను వదిలించుకోవాలన్న భావనకు కేసీఆర్ వచ్చి ఉండొచ్చు. అందుకే నా క్యారెక్టర్‌ మీద దెబ్బకొట్టాలనుకున్నారు. నన్ను డీమోరలైజ్ చేయాలనుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కుటుంబానికి చెందిన పత్రిక (నమస్తే తెలంగాణ), టీవీ ఛానెల్ (టీ న్యూస్)లో రాయించుకున్నారు.

వదిలించుకోడానికి కారణమేంటి?

అది కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి తెలియాలి. ఏం ప్రయోజనం ఆశించి నన్ను వదిలించుకోవాలనుకున్నారో నాకు తెలియదు. నా క్యారెక్టర్‌ మీద మచ్చ వేస్తే వారికి ఏం లాభమో కూడా తెలియదు. నాతో ఆయనకు, పార్టీకి ఎలాంటి డేంజర్ ఉందని గ్రహించారో వారికే తెలియాలి.

మీరు డీమోరలైజ్ అయ్యారా?

డీమోరలైజ్ కాలేదుగానీ.. బాధపడ్డాను. భూకబ్జా ఆరోపణలు, అవి ప్రసారమైన తీరు బాధ కలిగించాయి. ఈ పరిణామాలు ఎందుకొచ్చాయో తెలియదు. ఇంతకాలం లేనివి ఇప్పుడు రావడం నాకు గాయం చేశాయి. కేసీఆర్ కుటుంబానికి చెందిన ప్రసార మాధ్యమాల్లో రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్‌కు తెలియకుండా ప్రసారం అయ్యాయని అనుకోవడంలేదు. ఆయన డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగింది. నాకు బలమైన అనుమానం ఉంది. కొండను తవ్వినా ఎలుకను కూడా పట్టలేరు.

మీకు ప్రమేయం లేనప్పుడు బాధపడాల్సిందేముంది?

నాకు భూకబ్జా మచ్చను అంటగట్టడం నేను ఊహించని పరిణామం. మీడియా ద్వారా ప్రసారం కావడం ఒక ఎత్తు. కానీ ఆ కథనాల తీరు జుగుప్సాకరంగా ఉంది. నిజంగా నాపైన ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే నా నుంచి క్లారిఫికేషన్ అడగాలి. ఒక కేబినెట్ మంత్రిగా నన్ను పిలిచి మాట్లాడాలి. నా అభిప్రాయాన్ని, స్పందనను తెలుసుకోవాలి. కేసీఆర్‌‌తో నాకు చాలా అనుబంధం ఉంది. కానీ ఇదేం లేకుండా నేరుగా ప్రసారం చేయించడం బాధాకరం.

కేసీఆర్‌తో మీకు ఉద్యమ అనుబంధం ఉంది గదా!

కేసీఆర్‌కు ఎనకటిలాగా ఉద్యమ బంధాలు లేవు. మానవ సంబంధాలు అంతకన్నా లేవు. ఈ రెండు పదాలూ వారి డిక్షనరీలోనే లేవు. కేవలం రాజ్యం, రాజ్యానికి సంబంధించిన లక్షణాలు మాత్రమే ఉన్నాయి. రాజ్యానికి ఉండే కర్కశత్వం, కక్షసాధింపు లక్షణాలే ఉన్నాయి.

ఉద్యమ నాయకుడే రాష్ట్ర సారధి అని చెప్పుకుంటున్నారు గదా!

2014 వరకే ఉద్యమం. ఆ తర్వాత ఇంకెక్కడ ఉద్యమం. ఫక్తు రాజకీయ పార్టీ. ఆయన మనసులో అన్నీ స్కీములు, పథకాల గురించిన ఆలోచనే. ఇవి తప్ప ఉద్యమం లేదు. ఉద్యమ అనుబంధం లేదు. 2014 వరకు కనిపించిన కేసీఆర్ వేరు. 2014 తర్వాత కనిపించిన కేసీఆర్ వేరు. 2018 తర్వాత నుంచి కనిపిస్తున్న కేసీఆర్ వేరు.

ఉద్యమకారులకు పార్టీలో స్థానం తగ్గిపోతూ ఉందా?

పార్టీలో, ప్రభుత్వంలో ఉద్యమ స్వభావం తగ్గిపోయిందంటూ ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. గాదె ఇన్నారెడ్డి, ఆలె నరేంద్ర మొదలుకుంటే నాయిని నర్సింహారెడ్డి వరకు చాలా మంది పేర్లను వారు ప్రస్తావించారు. నేను ఒక ఉద్యమకారుడిగానే 2004 నుంచి కేసీఆర్‌తో కలిసి ఉన్నాను. ఇప్పుడు ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది.

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఈ పరిణామాలా?

నేను నాలుగైదు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు పార్టీలో గతంలో చర్చనీయాంశాలుగా మారాయి. వరి కొనుగోలు కేంద్రాలను మూసివేసే విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడాను. కొనుగోలు కేంద్రాలను బంద్ చేయడానికి వీల్లేదన్నాను. రెండు మూడేళ్ళుగా పింఛన్లు, రేషను కార్డులు కొద్దిమందికి అందడం లేదని కూడా మాట్లాడాను. ఇవి పార్టీకి, అధినేతకు ఆగ్రహం కలిగించి ఉండొచ్చేమో! కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల రీత్యా మాట్లాడాల్సి వచ్చింది.

పార్టీతో గ్యాప్ ఉన్నందుకే ఈ కామెంట్లు చేయాల్సి వచ్చిందా?

అలాంటి కామెంట్లు చేయాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ప్రజల్లో తిరుగుతున్నప్పుడు చాలా రకాల సమస్యలు నా దృష్టికి వస్తుంటాయి. సమావేశాల్లో, బహిరంగసభల్లో వీటిని ప్రస్తావించాను. ఈ పథకాలు అందని కారణంగా ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. మా దృష్టికి తెస్తుంటారు. వాటికి పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందలేదనే విషయం సుస్పష్టం. సీఎంతో మాట్లాడి ఇప్పిస్తాను అని హామీ ఇవ్వక తప్పలేదు. స్థానికంగా సర్పంచ్‌లకూ ప్రజల నుంచి ఈ సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ గ్యాప్ పూడే అవకాశం ఉందా?

కొనుగోలు కేంద్రాలు, రేషను కార్డుల విషయంలో నేను చేసిన కామెంట్లపై పత్రికలో చాలా దరిద్రపు రాతలుగానే వచ్చాయి. ఉల్లంఘనలాగా చిత్రీకరించారు. మంత్రి హోదా దాటి మాట్లాడినట్లుగా హడావిడి చేశారు. నెగెటివ్ రంగు అద్దారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా చాలా కటువుగానే ఇప్పుడు భూ కబ్జా వ్యవహారాన్ని ప్రసారం చేస్తున్నాయి. కేసీఆర్‌తో ఒకసారి గ్యాప్ ఏర్పడిన తర్వాత పూడడం దాదాపు అసాధ్యం.

కేసీఆర్‌తో ఎప్పటి నుంచి గ్యాప్ ఏర్పడింది?

గ్యాప్ అని చెప్పలేనుగానీ తాజా పరిణామాలను భూతద్దంలో పెట్టి చూపడం బాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి మూడు సందర్భాల్లో నాకు అవమానం కలిగించే తీరులో కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ సర్దుకుపోయాను.

ఇప్పుడు జరిగింది ‘ఆత్మగౌరవానికి‘ కలిగిన అవమానంగా భావిస్తున్నారా?

గతంలో నేను ‘గులాబీ జెండా ఓనర్లం… కిరాయిదార్లం కాదు..‘, ‘మంత్రి పదవి ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికంటే గొప్పవేమీ కాదు..‘, ‘పదవులు శాశ్వతం కాదు.. ప్రజాభిమానం శాశ్వతం.. ‘ లాంటి వ్యాఖ్యలు చేశాను. ఎప్పుడూ నేను ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. మంత్రి పదవి వాటికంటే గొప్పదేమీ కాదని కూడా నొక్కిచెప్పాను. కానీ కొందరిలాగా గడ్డిపోచతో పోల్చలేదు. చిన్నచూపుగానూ చూడలేదు.

మీ అత్మగౌరవానికి తగినట్లుగా భవిష్యత్ ప్లాన్ ఏంటి?

నన్ను వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బాధ్యతల నుంచి తప్పించారు. సంతోషం. శాఖలేని మంత్రిగానే కొనసాగుతున్నాను. తాజా పరిణామాలన్నీ నా ఆత్మభిమానాన్ని ఇబ్బంది పెట్టాయి. నా అనుచరులు, అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాను.

కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా?

నా మనసు కలకలం అయింది వాస్తవం. ఇప్పటికైతే నేను నా భవిష్యత్తుకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆలోచనలు చేయలేదు.

Advertisement

Next Story

Most Viewed